Share News

ప్రజారోగ్యంపై పట్టింపేదీ!

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:23 AM

జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఓ ఆర్‌ఎంపీ పేరొందిన వైద్యుడి పేరుతో ఆస్పత్రి ప్రారంభించా డు. ఓ రోగి దగ్గుతో బాధపడుతూ రాగా, అతడికి టాన్సిల్స్‌ వచ్చాయంటూ ఆర్‌ఎంపీనే శస్త్రచికిత్స చేశాడు. అది వికటించడంతో అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ఆర్‌ఎంపీనే అన్ని ఖర్చులు భరించి చికిత్స చేయించాడు.

ప్రజారోగ్యంపై పట్టింపేదీ!

విచ్చలవిడిగా అర్హత లేని వైద్యులు

ఆగని ప్రైవేట్‌ ఆస్పత్రుల దందా

తనిఖీలు మరిచిన వైద్య ఆరోగ్యశాఖ

భువనగిరి (కలెక్టరేట్‌), మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఓ ఆర్‌ఎంపీ పేరొందిన వైద్యుడి పేరుతో ఆస్పత్రి ప్రారంభించా డు. ఓ రోగి దగ్గుతో బాధపడుతూ రాగా, అతడికి టాన్సిల్స్‌ వచ్చాయంటూ ఆర్‌ఎంపీనే శస్త్రచికిత్స చేశాడు. అది వికటించడంతో అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ఆర్‌ఎంపీనే అన్ని ఖర్చులు భరించి చికిత్స చేయించాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డాడు. రాజాపేట మండలంలో ఓ ఆర్‌ఎంపీ గర్భిణికి అబార్షన్‌ చేయగా ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను హైదరాబాద్‌ తరలించి ఆర్‌ఎంపీనే అన్ని ఖర్చులు భరించి చికిత్స చేయించాడు. ఇక ఆలేరు మండలంలో ఓ ఆర్‌ఎంపీ సుమారు 10 పడకలతో ఆస్పత్రి నడిపిస్తుండగా జ్వరం పేరుతో వచ్చిన వ్యక్తికి ఇంజక్షన్‌ చేయడంతో అతడు మృతిచెందాడు. ఈ విషయం బయటికి రాకుండా అతడి కుటుంబ సభ్యులతో డబ్బు ఒప్పందం చే సుకున్నాడు. ఇకగతంలో యాదగిరిగుట్టలో వ్యభిచార గృహాల్లో బాలికలు తొందరగా కౌమారదశకు వచ్చేందుకు ఇంజెక్షన్లు ఇచ్చిన వారిలో ఆర్‌ఎంపీలపాత్ర ఉంది. గతంలో మెడికల్‌ కౌన్సిల్‌ జిల్లాలో తనిఖీలు నిర్వహించి బొమ్మరామారం మండలం, భువనగిరి పట్టణంతోపాటు మరోమండలంలో అర్హతలేని వైద్యులపై మూడు కేసులు నమోదు చేసిం ది. ఆ తరువాత తనిఖీలు లేకుండా పోయాయి.

ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు కోట్ల రూపాయ లు ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో వైద్యఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగా పేదలకు సర్కారు వైద్యం అం దకుండా పోతోంది. అంతేగాక ప్రైవేట్‌ ఆస్పత్రులపై నియంత్రణ కొరవడటంతో వైద్యం పేరుతో ప్రైవేట్‌ వైద్యులు పేదల జేబును ఖాళీచేస్తున్నారు. అర్హతలే ని వారు వైద్యులుగా అవతారమెత్తి కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయి వైద్యం అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆస్పత్రులను తనిఖీచేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రా మాలు, పట్టణాలు తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు నడపడమేగాక రోగులకు అవసరానికి మించి యాంటిబయోటిక్‌ ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌ ఇస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ డాక్టర్లు కనిపించరు

ప్రైవేట్‌ ఆస్పత్రి ఏర్పాటుకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో నిర్వాహకులు కొందరు ఎంబీబీఎస్‌ వైద్యుల పేరుతో నమోదు చేస్తున్నారు. ఆస్పత్రి ప్రారంభం తర్వాత ఏ డాక్టర్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారే వైద్యుడు ఇక్కడ చికిత్స అందించకపోవడం గమనార్హం. ఇక్కడ ఆర్‌ఎంపీ, పీఎంపీలు వైద్యం చేస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. అర్హతలేని వారు వైద్యం అందించడంతో గతంలో పలు ప్రాణాపాయ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఇలాంటి ఘటలు చోటుచేసుకున్నాయి.

తనిఖీలు కరువు

ప్రైవేట్‌ ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. అయితే కొంతకాలంగా తనిఖీల దాఖలాలే కనిపించడం లేదు. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో గతంలో అర్హతకు మించిన వైద్యం చేసిన పలువురిపై కేసులు నమోదయ్యాయి. కనీసం పదో తరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణత లేని వారు వైద్యులుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఫస్ట్‌ ఎయిడ్‌ పేరుతో..

జిల్లాలోని 17 మండలాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ పేరుతో నర్సింగ్‌హోం స్థాయి వైద్యం అందిస్తున్నారు. అర్హత లేని వారు వైద్యం చేస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అటుగా కన్నెత్తి చూడటం లేదు. ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నామని బోర్డు పెట్టి నర్సింగ్‌హోం తరహాలో బెడ్లు, ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేసి ఎంబీబీఎస్‌ వైద్యుడి తరహాలో చికిత్స అందజేస్తున్నారు. అంతేగాక రహస్యంగా అబార్షన్లు సైతం నిర్వహిస్తున్నట్టు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అనారోగ్యం బారిన పడిన ఎందరో పేద, సాధారణ ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం లేక ఈ ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి జేబు ఖాళీ చేసుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం : డాక్టర్‌ ఎం.మనోహర్‌, డీఎంహెచ్‌వో

క్లీనికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టం ప్రకారం అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులతో త్వరలో సమావేశమై ప్రభుత్వ నిబంధనలను వివరిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకుంటాం. అర్హత లేకుండా చికిత్స, అనుమతికిమించి వైద్యం చేస్తే క్రిమినల్‌ చర్యలతో పాటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తాం.

Updated Date - Mar 05 , 2025 | 01:23 AM