Medigadda Barrage: కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి డిజైన్ లోపాలే ప్రధాన కారణం!
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:02 AM
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సీపేజీలకు డిజైన్ లోపాలే ప్రధాన కారణమని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ తేల్చింది.

ఎన్డీఎ్సఏ నిపుణుల కమిటీ నివేదిక
జలశక్తి శాఖ, ఎన్డీఎ్‌సఏకు అందజేత
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సీపేజీలకు డిజైన్ లోపాలే ప్రధాన కారణమని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ తేల్చింది. వాటితో పాటు ‘కార్యకలాపాలు, నిర్వహణ (ఓఅండ్‌ఎం)’ లోపాలు కూడా కారణమని గుర్తించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు, ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌కు నివేదిక అందించింది. బ్యారేజీల నిర్మా ణ ప్రదేశాల్లో జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు సరిగ్గా చేయలేదని, పరీక్షలు చేయడానికి ముందే డిజైన్లు/డ్రాయింగ్‌లు సిద్ధం చేశారని గుర్తించింది. డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మాణం చేయకపోవడం, క్వాలిటీ కంట్రోల్‌తో పాటు ఓఅండ్‌ఎం లోపాలూ కారణమని గుర్తు చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ గతేడాది ఫిబ్రవరి 13న ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌కు లేఖ రాయగా.. మార్చి 2న కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురు నిపుణులతో ఎన్‌డీఎ్‌సఏ కమిటీ వేసింది.
సుదీర్ఘ ఉత్తరప్రత్యుత్తరాల అనంతరం నివేదికకు తుదిరూపు అందించి, నిపుణుల కమిటీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌కు అందించింది. ఈ నివేదిక కోసం కూడా కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదురు చూస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019లో పూర్తికాగా.. ఆ ఏడాది నవంబరు లో వరదల అనంతరం గేట్లు మూయడంతో సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు చెల్లాచెదురయ్యాయని, ఆఫ్రాన్లు దెబ్బతిన్నాయని, మేడిగడ్డలో ఐదేళ్లపాటు ఓఅండ్‌ఎం పనులు జరగలేదని కమిటీ తేల్చింది. మేడిగడ్డ కుంగుబాటుకు ఇది కూడా కారణమని పేర్కొంది. అన్నారం, సుందిళ్లలో కూడా డిజైన్లతో పాటు నిర్వహణ పనులు సరిగ్గా చేయలేదని తేల్చింది. కాగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్ల నిర్వహణలో స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాటించలేదని నిపుణుల కమిటీ గుర్తు చేసింది.