ద్వితీయ భాషగా తెలుగు తప్పనిసరి వద్దు
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:45 AM
రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పని సరిచేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలను పునరాలోచించాలి.

ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శాంతియుతంగా ధర్నా
కవాడిగూడ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పని సరిచేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలను పునరాలోచించాలి. ప్రత్యేక నిర్ణయం తీసుకొని చిన్నారుల భవిష్యత్‌ను కాపాడాలి’’ అని హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర రాష్ట్రాల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుతానికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలంగాణ ప్రభుత్వం తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ వారు వారి పిల్లలతో కలిసి శాంతియుత నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రుల ప్రతినిధులు రాహుల్ కేజ్రీవాల్, శృతిజగదీశ్ తదితరులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యా స్వేచ్ఛను పరిమితంచేసి.. భాషా ప్రాధాన్యతలను విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటినుంచి తెలుగుచదివిన విద్యార్థులతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పోటీపడలేరని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించి ద్వితీయ భాషగా నచ్చిన భాషను ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు.