Share News

Telangana: స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివర్లో?

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:03 AM

రాష్ట్రంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నాయా? ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాల వేడిలోనే ఈ ఎన్నికలను కానిచ్చేందుకు రేవంత్‌ సర్కారు సన్నద్ధమవుతోందా?

Telangana: స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివర్లో?
Telangana Local Body Elections

  • లేదా ఏప్రిల్‌లో నిర్వహించే యోచనలో సర్కారు!

  • ఈ నెల 26 నుంచి గ్రామాల్లో పథకాల జాతర

  • ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటున్న నేతలు

  • కోడ్‌ లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం

  • బీసీ రిజర్వేషన్‌ పెంపు కూడా చిక్కుముడే!

  • రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరే యోచన

  • ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే చాన్స్‌

  • దావోస్‌ నుంచి సీఎం తిరిగి వచ్చాక స్పష్టత!

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నాయా? ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాల వేడిలోనే ఈ ఎన్నికలను కానిచ్చేందుకు రేవంత్‌ సర్కారు సన్నద్ధమవుతోందా? ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్‌లో పడుతున్నాయి. దీనికితోడు ఎన్నికలను త్వరగా నిర్వహించాలంటూ స్థానిక నేతల నుంచి ప్రభుత్వంపై, పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని, కార్యకర్తలను, స్థానిక నాయకత్వాలనూ కాస్త పట్టించుకోవాలని నేతలకు చురకలు వేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి మూడో వారంలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీలకు, నాలుగో వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.


బీసీ రిజర్వేషన్‌ పెంపే చిక్కుముడి!

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్‌ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏయే కులాల జనాభా ఎంత ఉంది? వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులెలా ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటనను ముగించుకుని వచ్చాక.. ఈ సర్వేపై మంత్రివర్గం సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలోనే సర్వే నివేదికను ఆమోదిస్తారని, ఆ తర్వాత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంనిర్వహించి చర్చ చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించి అమలు చేయరాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఉంది.


రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం 27 శాతం రిజర్వేషన్‌ ఆ వర్గాలకు అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్‌ హామీ మేరకు బీసీలకు 42 శాతం అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కులగణన సర్వే నివేదికను పరిగణనలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోతే.. స్థానిక ఎన్నికల్లో రేవంత్‌ సర్కారు ఏ వైఖరి అవలంబిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. పాత పద్ధతిలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇస్తుందా? లేక ఇతర మార్గాలను అన్వేషిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.


అలా అయితే ఎన్నికలు ఏప్రిల్‌ లోనే!

ఈ నెల 26 నుంచి రైతులకు రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్‌ కార్డు లేని వారికి కొత్త రేషన్‌ కార్డుల మంజూరు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో ఈ పథకాల వేడిలోనే స్థానిక ఎన్నికలు కానిచ్చేయాలంటూ స్థానిక నాయకులు కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని, ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే 15 రోజుల్లో నిర్వహణ పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తే.. అదే నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల కోడ్‌ లోపు పథకాల అమలు పూర్తవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు పూర్తిస్థాయిలో నిధులు సమకూరడం సాధ్యమవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. కానీ, సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ముందే ప్రకటించినందున.. ఆ మేరకు నిధుల సేకరణ జరుగుతోందని, ఆత్మీయ భరోసాకూ నిధులు సమకూరుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కోడ్‌ అమల్లోపు ఈ నాలుగు పథకాలు అసంపూర్ణంగా అమలైతే.. దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో పథకాలు పూర్తి స్థాయిలో అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే మాత్రం.. ఏప్రిల్‌ లేదా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - Jan 18 , 2025 | 08:31 AM