Ram Mohan Naidu: సీఎం రేవంత్.. కన్ఫ్యూజన్‌లో!
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:00 AM
విమానాశ్రయాలను నిర్మించేది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూ సేకరణ మాత్రమే చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రం కాదు
మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు
మిగులు ఉన్న తెలంగాణ.. కాంగ్రెస్ వచ్చాక అప్పులపాలు ఎలా అయ్యింది?
విమానాశ్రయానికి భూ సేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దాం!
భూమి ఇస్తే రెండున్నరేళ్లలోనే పూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
రామప్పకు గుర్తింపు వచ్చినప్పుడే మోదీ ఎయిర్‌పోర్టు హామీ ఇచ్చారు
విమానాశ్రయంతో వరంగల్‌లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): విమానాశ్రయాలను నిర్మించేది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూ సేకరణ మాత్రమే చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టును రాజకీయం చేయొద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే మామునూరు విమానాశ్రయం ఆలస్యమైందని రామ్మోహన్ ఆరోపించారు. ఆదివారం కవాడిగూడలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. ‘మామునూరు ఎయిర్‌పోర్టును ఎవరు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు. అందుకే దీన్ని వారికే వదిలేద్దాం’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. అప్పులపాలు ఎలా అయ్యిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను ముందు అమలు చేయండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మేం మాట ఇచ్చాం. అందుకు అనుగుణంగా వరంగల్ ఎయిర్‌పోర్టును ఇస్తున్నాం. దానికి ఎంత తొందరగా భూసేకరణ చేస్తారో చూద్దాం’ అని రామ్మోహన్ అన్నారు. మామునూరు విమానాశ్రయాన్ని కొచ్చి విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దాలంటూ సీఎం రేవంత్ అధికారులను ఆదేశించడంపై స్పందిస్తూ రామ్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశాయని ఆరోపించారు. తెలంగాణను ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. ఇక్కడ ఏరో స్పేస్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. విమానాలను మనదేశంలోనే తయారు చేసుకోవాలన్నది ప్రధాని మోదీ సంకల్పమని, అలాంటి పరిశ్రమను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రామ్మోహన్ చెప్పారు. మామునూరు విమానాశ్రయం రన్‌వేకు అవసరమైన 280 ఎకరాల భూమి ని అప్పగిస్తే.. రెండున్నరేళ్లలోనే ఎయిర్‌పోర్ట్ పను లు పూర్తిచేస్తామన్నారు. విమానాశ్రయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. వరంగల్‌లో ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ అధీనంలో ఉన్న 696 ఎకరాల్లో గతంలో ఆసియా ఖండంలోనే (దేశానికి స్వాతంత్య్రం రాకముందు) అతిపెద్ద విమానాశ్రయం ఉండేదన్నారు. హైదరాబాద్-శ్రీశైలం సీ ప్లేన్ ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వారధిగా పనిచేస్తున్నారని చెప్పారు. ఉడాన్ యాత్రికన్ కెఫేను హైదరాబాద్ విమానాశ్రయంలోనూ అందుబాటులోకి తెస్తామన్నారు. దీంతో రూ.10కే టీ, కాఫీ, మంచినీటి సీసా, స్వీటు రూ.20కి దొరుకుతాయ న్నారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో రెండో విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని.. బేగంపేట విమానాశ్రయం కూడా భవిష్యత్తులో మరింత వినియోగంలోకి వస్తుందని చెప్పారు. గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచిఏకంగా 150కి చేరుకుందన్నారు. భద్రాచలం, జక్రాన్‌పల్లిలో భౌగోళిక సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వరంగల్‌లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయ్: కిషన్‌రెడ్డి
ఓరుగల్లుకు విమాన సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. విమానాశ్రయంతో వరంగల్‌లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించినప్పుడే ప్రధాని మోదీ వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.