Jaggareddy: 30 ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న కుసుమ్, కుమార్‌రావుకు ఎమ్మెల్సీ ఇవ్వాలి
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:16 AM
ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు జెట్టి కుసుమ్ కుమార్, కుమార్‌రావుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

నాకు పదవి కావాలని నేను అడగట్లేదు
పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతతో తృప్తిగా ఉన్నా
కమ్మ వర్గానికి చెందిన కుసుమ్‌కు ఇస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రయోజనం
30 ఏళ్లుగా గాంధీభవన్‌లో సేవలు అందించిన కుమార్‌రావుకూ ఇవ్వాలి
రేవంత్, భట్టి, మహేశ్, ఉత్తమ్‌కు చెప్పా
మీడియాతో చిట్‌చాట్‌లో జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు జెట్టి కుసుమ్ కుమార్, కుమార్‌రావుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదని, ఎమ్మెల్సీ టికెట్‌నూ తాను అడగబోనని స్పష్టం చేశారు. పార్టీ తనకు ఇస్తున్న ప్రాధాన్యతతో తృప్తిగా ఉన్నానన్నారు. సంగారెడ్డి ప్రజలు తనను గెలిపించినా.. ఓడించినా లాభమే చేస్తున్నారని చెప్పారు. తాను ఓటమిపాలైనా తన భార్య నిర్మలకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ అయ్యే అవకాశం వచ్చిందన్నారు. సీనియర్ నేతలు జెట్టి కుసుమ్‌కుమార్, కుమార్‌రావుకు ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తే బాగుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌కు తన అభిప్రాయంగా చెప్పానని తెలిపారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని వెల్లడించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుసుమ్‌కుమార్.. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నారన్నారు. కుసుమ్ కుమార్‌కు అవకాశం ఇస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి, పొన్నంతోపాటు కుసుమ్‌కుమార్ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని, పొన్నం మంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కుసుమ్‌కుమార్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక, 30 ఏళ్లుగా గాంధీభవన్‌కు సేవలందిస్తున్న వ్యక్తిగా కుమార్‌రావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుందన్నారు. పార్టీకి సేవ చేసిన వ్యక్తిగా ఆయనకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌ను కోరుతున్నానన్నారు.