Share News

Supreme Court: మోహన్‌బాబుకు ఉపశమనం

ABN , Publish Date - Jan 10 , 2025 | 05:09 AM

జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు మోహన్‌ బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసు శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది.

Supreme Court: మోహన్‌బాబుకు ఉపశమనం

  • జర్నలిస్టుపై దాడి కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దన్న సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు మోహన్‌ బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసు శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిసెంబరు 23న కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ సుధాంశు దులియా, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌ను గురువారం విచారించింది. మోహన్‌బాబు తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన పరిస్థితులను వివరించారు. క్షణికావేశంలో మోహన్‌బాబు మైక్‌ విసిరారని తెలిపారు.


బాధిత జర్నలిస్టును మోహన్‌బాబు ఇప్పటికే స్వయంగా పరామర్శించారని కూడా తెలియజేశారు. ఇందుకు, జర్నలిస్టు తరఫు న్యాయవాది స్పందిస్తూ.. మోహన్‌బాబు చేసిన దాడి వల్ల బాధిత జర్నలిస్టు ముఖానికి శస్త్రచికిత్స జరిగిందని, ఐదు రోజులు ఆస్పత్రిలోనే గడిపారని తెలిపారు. ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని బెదిరించేందుకే మోహన్‌బాబు ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. అనంతరం.. రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మోహన్‌బాబు జర్నలిస్టును బెదిరించలేదని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పరిహారం కావాలా? వద్దా? చూడాలని జర్నలిస్టు తరపు న్యాయవాదిని కోరింది. జర్నలిస్టు న్యాయవాదితో మాట్లాడి, ఆయనకు ఏమి కావాలో చేస్తామని ముకుల్‌ రోహత్గీ కోర్టుకు తెలిపారు. అనంతరం మోహన్‌బాబుకు మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, జర్నలిస్టుకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Jan 10 , 2025 | 05:09 AM