Property Tax: ఆస్తి పన్ను వసూళ్లలో తెలంగాణ రికార్డు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:27 AM
ఆస్తి పన్ను వసూళ్లలో తెలంగాణ కీలక మైలురాయిని దాటింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25)లో రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు రూ.1000 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేశాయి.

1000 కోట్లు దాటిన రాబడి
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: పురపాలకశాఖ
సెలవు ఉన్నప్పటికీ నేడు, రేపు పనిచేయనున్న మున్సిపాలిటీలు
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఆస్తి పన్ను వసూళ్లలో తెలంగాణ కీలక మైలురాయిని దాటింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25)లో రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు రూ.1000 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేశాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రూ.922 కోట్ల ఆస్తి పన్ను మాత్రమే వసూలైంది. కానీ, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) ముగియడానికి రెండు రోజుల ముందే (శనివారంకల్లా) ఆస్తి పన్ను వసూళ్లలో కొత్త రికార్డు నమోదైంది. ఆస్తి పన్ను పాత బకాయిలపై అపరాధ రుసుములో కల్పించిన 90శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పురపాలకశాఖ కోరింది.
ఈ నెల 30(ఆదివారం- ఉగాది), 31(సోమవారం-రంజాన్)సెలవు దినాలైనా.. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు రోజులు మిగిలే ఉన్నందున ప్రజలు తమ ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని పురపాలకశాఖ విజ్ఞప్తి చేసింది.