Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున చేసుకోవాల్సిన స్పెషల్ ప్రసాదాలు.. రెసిపీలు..
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:00 PM
Popular Prasad Recipes For Sri Rama Navami: శ్రీ రామనవమి నాడు ఎక్కువమంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ లేదా పూజ పూర్తయ్యేవరకూ ఉపవాసం చేస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ ప్రసాదాలు తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి, ఆ పదార్థాలు ఏవో.. వాటి తయారీవిధానం ఎలాగో తెలుసుకుందామా..

Healthy Prasad Recipes For Sri Rama Navami: ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి పండుగ చైత్ర మాసంలో జరుపుకుంటారు. రాముడు జన్మించిన ఈ రోజునే ఊరూరా ఉండే రామాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపిస్తారు భక్తులు. ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. శ్రీ రామనవమి నాడు ప్రతి ఇంట్లో, గుళ్లో వడపప్పు, పానకం దేవుడికి నైవేద్యంగా, పెడతారనే విషయం అందరికీ తెలుసు. అలాగే ఈ రోజున కచ్చితంగా తినాల్సిన మరికొన్ని స్పెషల్ ప్రసాదాలు కూడా ఉన్నాయి. అవేంటో, వాటిని ఎలా తయారుచేయాలో మీకోసం..
హల్వా : సంప్రదాయ పదార్థాలు వాడి బొంబాయి రవ్వతో తయారుచేసే రుచికరమైన తీయటి హల్వా శ్రీరామనవమి నాడు చాలా ప్రాంతాల్లో తప్పక తయారుచేస్తారు. దీన్నెలా తయారుచేయాలంటే..
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ - 2 కప్పులు
నెయ్యి - ఒక కప్పు
సన్నగా తరిగిన జీడిపప్పు - 1 టీస్పూన్
సన్నగా తరిగిన బాదం - 1 టీస్పూన్
ఎండుద్రాక్ష - 1 టీస్పూన్
ఏలకుల పొడి - చిటికెడు
సన్నగా తరిగిన కొబ్బరి - 1 టీస్పూన్
చక్కెర - 1 కప్పు
పాలు - అర కప్పు
కుంకుమ పువ్వు
తయారీ విధానం :
హల్వా చేయడానికి ముందుగా పాలను వేడి చేయండి. కండెన్స్‌డ్ మిల్క్ ఉపయోగిస్తే హల్వా రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి వేడెక్కగానే బొంబాయి రవ్వను వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో ఏలకుల పొడి, పాలు, కుంకుమపువ్వు వేయాలి. అనంతరం చక్కెర, కొన్ని డ్రై ఫ్రూట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆపకుండా కలుపుతూనే ఉండాలి. అది బాగా ఉడికి చిక్కగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో అలంకరిస్తే సరి. రుచికరమైన బొంబాయి రవ్వ హల్వా రెడీ.
శనగల కూర, పూరి రెసిపీ : శ్రీరామనవమి నాడు ఉపవాసం తర్వాత చనా, పూరీ కలిపి తింటే చాలా మంచిది. దీన్నెలా తయారుచేయాలంటే..
కావలసిన పదార్థాలు :
శనగలు - 1 కప్పు
రాతి ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - 1 స్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
అల్లం - 1 చిన్న ముక్క
పచ్చిమిర్చి: 2
పసుపు - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం :
శనగపప్పును బాగా కడిగి 3 లేదా 4 గంటల పాటు నీటిలో నానబెట్టండి. తర్వాత వాటిని ప్రెషర్ కుక్కర్‌లో వేసి పైన ఉప్పు, పసుపు కూడా వేయండి. 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పాన్‌లో నూనె లేదా నెయ్యి వేసి వేడెక్కాక జీలకర్ర, చిటికెడు ఇంగువ వేయాలి. వెంటనే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాక శనగపప్పును వేసి బాగా ఉడికించాలి. చివర్లో ఉప్పు, కొద్దిగా పసుపు, గరం మసాలా కూడా కలపండి. అంతే రుచికరమైన శనగల కూర సిద్ధమైనట్టే.
పూరీకి కావలసిన పదార్థాలు :
గోధుమ పిండి - 2 కప్పు
మైదా - 1 కప్పు
నెయ్యి - 2-3 టీస్పూన్లు
రుచికి సరిపడా ఉప్పు
తయారీ విధానం :
గోధుమ పిండి, మైదా పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసి పిండిని ముద్దలా కలపండి. 15-30 నిమిషాల వరకూ మూతపెట్టి అలాగే ఉంచండి. తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకుని పూరీ రేకులను వత్తుకోండి. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి పూరీలను ఒక్కొక్కటిగా వేయించాలి. ఈ పూరీలను శనగల కూరతో కూరతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
Read Also: మీకు రాజపాయసం గురించి తెలుసా.. దాన్ని ఎలా తయారు చేస్తారంటే..
Tomato Powder: టమాటా పొడి ఇలా తయారుచేసుకోండి.. ఏ కూరలో వేసినా టేస్ట్
Onion Powder: ఇంట్లోనే ఉల్లిపాయతో ఈ నిల్వ పొడి తయారుచేస్తే.. ఎప్పుడైనా, ఏ కూరలోనైనా వాడుకోవచ్చు..