Share News

Krishna Tribunal: కరువు ప్రాంతాలకు ఒక్క పంట నీరివ్వండి

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:05 AM

కరువు పీడిత ప్రాంతాల్లో ఒక్క పంటకు నీరు ఇవ్వాలని తెలంగాణ కోరింది. ఏపీలాగా రెండో, మూడో పంటకు నీరు కావాలనడం లేదని గుర్తు చేసింది.

Krishna Tribunal: కరువు ప్రాంతాలకు ఒక్క పంట నీరివ్వండి

  • 811 టీఎంసీల్లో 575 టీఎంసీలు కేటాయించాలి

  • కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ వాదన

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరువు పీడిత ప్రాంతాల్లో ఒక్క పంటకు నీరు ఇవ్వాలని తెలంగాణ కోరింది. ఏపీలాగా రెండో, మూడో పంటకు నీరు కావాలనడం లేదని గుర్తు చేసింది. ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రైబ్యునల్‌ (కృష్ణా ట్రైబ్యునల్‌-1) కేటాయించిన 811 టీఎంసీల్లో 575 టీఎంసీలను తెలంగాణకు న్యాయమైన వాటా కింద కేటాయించాలని నివేదించింది. కృష్ణా జలాల కేటాయింపు విషయమై సోమవారం కృష్ణా ట్రైబ్యునల్‌-2 (జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌) ముందు తెలంగాణ న్యాయవాదులు ఎస్‌ఓసీ దాఖలు చేశారు. ఈ విషయమై సోమవారం మొదలైన తుది వాదనలు ఈ నెల 26న ముగుస్తాయి. ఏపీలో కృష్ణా నదీ జలాల్లో 323 టీఎంసీలను బేసిన్‌ ఆవలి ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలంగాణ వాదించింది. తెలంగాణ 1,12,077 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉండగా, అందులో 52,232 చదరపు కి.మీ కృష్ణా బేసిన్‌ పొడవునే ఉందని గుర్తు చేసింది.


తెలంగాణలో కృష్ణా బేసిన్‌ వెంట రెండు కోట్ల మంది నివసిస్తుండగా, ఏపీలో 76లక్షల మందే నని పేర్కొంది. ఏపీ 36.45 లక్షల హెక్టార్ల భూమి సాగవుతుంటే.. 15.3 లక్షల హెక్టార్లలో మాత్రమే కరువు పీడిత ప్రాంతం ఉందని ట్రైబ్యునల్‌కు తెలంగాణ న్యాయవాదులు నివేదించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బేసిన్‌ అవసరాలు తీరిన తర్వాతే అవతలి ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఏపీలో 40 బేసిన్‌లు ఉన్నాయని.. అందులో పెన్నా బేసిన్‌కు 344 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కృష్ణా బేసిన్‌ నుంచి 332 టీఎంసీల నీటిని తరలిస్తున్నదని పేర్కొన్నారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం ఏపీలో తలసరి నీటి లభ్యత 1892 క్యూబిక్‌ మీటర్లు ఉంటే, తెలంగాణలో 422 క్యూబిక్‌ మీటర్లేనని తెలిపారు. కనుక అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తెలంగాణకు 575 టీఎంసీల నీటిని కేటాయించాలని వాదించారు. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌, ఏపీ నుంచి జయదీప్‌ గుప్తా వాదించారు.

Updated Date - Mar 25 , 2025 | 04:05 AM