విస్తృత చింతనాశీలి

ABN , First Publish Date - 2021-03-15T09:36:37+05:30 IST

నిజంగా వర్తమానం ఒక పాడు కాలం. గత కొద్దిరోజుల్లో ముగ్గురు మంచి రచయితలని మింగేసింది. దేవీప్రియ, సింగమనేని నారాయణ, అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గార్లను మనకు...

విస్తృత చింతనాశీలి

The Good Life is one inspired by Love and guided by Knowledge - Bertrand Russel 

నిజంగా వర్తమానం ఒక పాడు కాలం. గత కొద్దిరోజుల్లో ముగ్గురు మంచి రచయితలని మింగేసింది. దేవీప్రియ, సింగమనేని నారాయణ, అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గార్లను మనకు దూరం చేసింది. తెలుగు సమాజాల సాహిత్య, సాంస్కృతిక నిధిలో వీళ్ళ చేర్పు గుర్తించదగినది. 


ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు మరణించిన అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు తెలుగులో చాలా తక్కువ మంది మాత్రమే చేయగలిగిన రచనలు చేశారు. ఒక రకంగా ఎవరూ నిర్దిష్టంగా రాయని అంశాలను గురించి చాలా విస్తృతంగా రాశారు. త్రిపురనేని రామస్వామి హేతువాద భావాల ప్రేరణతో రచనారంగంలోకి వచ్చిన అన్నపరెడ్డి 80కి పైగా పుస్తకాలు రాశారు. ఇవన్నీ ఆయన మాత్రమే రాయగలిగినవి. జి.వి.కృష్ణరావు, త్రిపురనేని గోపీచంద్‌, హితశ్రీ, కొండూరి వీరరాఘవాచార్యుల లాంటి వాళ్ళ సాన్నిహిత్యంతో తన హేతువాద భావాల్ని బలో పేతం చేసుకుంటూ వచ్చిన అన్నపరెడ్డి ప్రముఖ మానవ హక్కుల నేత బి.చంద్రశేఖర్‌ మాటల్లో చెప్పాలంటే ‘పాశ్చాత్య ప్రపంచ వికాస యుగశిశువు’. ఐరోపా హేతు వాద భావాల్ని ఆయన తనలో సంలీనం చేసుకున్నాడు. బౌద్ధానికి దగ్గరైన తరవాత కూడా హేతువాద ఆలోచనలు ఆయన నుంచి దూరం కాలేదు. ఇంకొక రకంగా చెప్పా లంటే బుద్దిజంలో హేతువాద ధోరణే ఆయనను దానికి దగ్గర చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఆయన చేసిన రచనలన్నీ ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో బౌద్ధ రచనలు, అనువాదాలే. 


ఒక్క చింతనాపరుడిగా అన్నపరెడ్డి ప్రత్యేకత ఆయన మనోవైజ్ఞానిక శాస్త్రం గురించి చేసిన రచనల్లో ఉంది. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ రచనలను, జీవితాన్ని నిర్దిష్టంగా తెలుగు పాఠకులకు పరిచయం చేసింది అన్నపరెడ్డి గారే. ఆయన రచన ‘స్వప్నసందేశం’ తొలిసారిగా తెలుగు సమాజాలకు ఫ్రాయిడియన్‌ స్వప్న విశ్లేషణా పద్ధతిని పరిచయం చేసింది. పెరల్‌ బక్‌ కథలను తెలుగులోకి ‘నిశీధిలో నిర్గమనం’ పేరుతో తీసుకురావడంతో రచనారంగంలోకి ప్రవేశించిన అన్నపరెడ్డి తన ఆరు దశాబ్దాల రచనాకాలంలో పదహారువేల పేజీలకు పైగా రాశారు. అవన్నీ సామాజిక, మనో వైజ్ఞానికశాస్త్రం, బుద్ధిజం, నైతికత, మతం, శాస్త్రం, సాహిత్యంలాంటి అంశాలకు సంబంధించినవి. 


తర్క, సామాజిక శాస్ర్తాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన అన్నపరెడ్డి రచనలు చేయడం అనేది చాలా నిబద్ధతతో కూడుకున్న విషయంగా భావించారు. రచనకు ఆయన ఎంచుకున్న విషయాలు, వాటి విస్తృతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అవి ఏ ఒక్క రంగానికో పరి మితమై లేవు. మతం, చరిత్ర నుంచి మనోవైజ్ఞానిక శాస్త్రం దాకా విస్తరించి ఉన్న ఆయన పరిజ్ఞానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్క మార్క్సిజానికి మాత్రమే ఆయన దగ్గర కాలేక పోయారు. తన రచ నల్లో, చర్చల్లో మార్క్స్‌, మార్క్సిజాలకు సంబంధించిన ప్రస్తావనలు చాలా అరుదు. ఇది ఒకరకంగా అర్థంకాని విషయం. 


స్వప్నసందేశం, మనసు- మర్మం, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, ప్రేమించడం ఒక కళ, మానవీయ బుద్ధ లాంటి రచనలు విశేష పాఠకాదరణ పొంది, అనేక ముద్రణలు పొందాయి. అయన పరిచయం చేసిన ఫ్రాయిడ్‌, ఎరిక్‌ ఫ్రామ్‌ ఆలోచనలు చాలామంది తెలుగు రచయితలకు తమ కాల్పనిక సాహిత్య మనో విశ్లేషణకు ఉపకరించాయి. అలాగే ‘మనోవైజ్ఞానిక శాస్త్ర నిఘంటువు’, ‘సామాజిక శాస్త్ర నిఘం టువు’, ‘లఘు విజ్ఞాన సర్వస్వం’ లాంటివి కూడా. తెలుగులో పారిభాషిక పదాల రూప కల్పనలో రచయితలు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి కొంతవరకు ఈ నిఘంటువులు బైట పడవేశాయి. నిర్దిష్ట పారిభాషిక పదాల రూపకల్పన చేసు కోకుండా ఏ కొత్త సిద్ధాంతాన్ని పరిచయం చేయటం సాధ్యం కాదని గ్రహించిన అన్నపరెడ్డి చాలావరకు ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిం చారు. ఒక సమూహం చేయాల్సిన పనిని ఒంట రిగా చేసాడు. ముఖ్యంగా మనోవైజ్ఞానిక శాస్ర్తా నికి సంబంధించిన అనేక కొత్త పదాల్ని ఆయన రూపొం దించారు. ఆయన రూపొందించిన పరిభాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నాయని వాదించే వాళ్లకు వాటి నిర్దిష్ట అర్థం పలుచబడకుండా ఉండటానికి సంస్కృతం మీద ఆధారపడటం తప్పనిసరని చెప్పారు. 


మిసిమి పత్రికను నడపడంలో ఆయన చాలా శ్రద్ధ కనపరిచారు. దాని వ్యవస్థాపకులు ఆలపాటి రవీంద్రనాథ్‌ గారి అభిప్రాయాలకు అనుగుణంగా నడపడంలో, దాని పరిధిని విస్తరించడం లోను అన్నప రెడ్డి గారి కృషి ఉంది. ఆయన సంపాదకుడిగా బాధ్య తలు తీసుకున్న తొలిరోజుల్లో ‘మిసిమి’ ఐరోపా సాం స్కృతిక పునరుజ్జీవన కాలపు భావజాల ప్రాతి పదికగానే ఉండేది. అన్నపరెడ్డి క్రమంగా దానిని వర్తమాన తాత్త్విక, సాహిత్య, శాస్త్ర చర్చలకు వేదిక చేసారు. సమకాలీనంగా వస్తూ ఉన్న అనేక వాదాల పరి చయ వేదికగా చేశారు. 


ఒక రచయితగా అన్నపరెడ్డిలో రెండు దశల్ని చాలా స్పష్టంగానే గుర్తించవచ్చు; మొదటిది మనో వైజ్ఞానిక శాస్త్ర, అస్తిత్వవాదాల ప్రాతిపదికన నడిస్తే, రెండవది బుద్ధిజం కేంద్రంగా నడిచింది. మొదటి దశలో ఆయనను ప్రధా నంగా ప్రభావితం చేసింది ఫ్రాయిడ్‌, ఎరిక్‌ ఫ్రామ్‌, సార్ర్తే, పాల్‌ టెల్లిచ్‌, నాగార్జునుడు అయితే, ఈ రెండవదశలో వీళ్ళందర్నీ పక్కనపెట్టారు. ఈ దశలో రచనలన్నింటికీ బౌద్ధమే ప్రాతిపదిక అయ్యింది. గత రెండు దశాబ్దాలుగా బౌద్ధాన్ని ఆయన గాఢంగా నమ్ముతూ వచ్చారు. తన పేరును కూడా ‘బుద్ధఘోషుడు’గా మార్చుకున్నారు. బుద్ధిజం పట్ల ఆయన కున్న నిబద్ధతే ఆయనచేత ఒక్కడుగా చేయటం అసాధ్య మనిపించే ‘మహా బౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు’ను పూర్తి చేసేలా చేసింది. ఇది బౌద్ధ సూత్రాలను, శాస్ర్తాలను, సిద్ధాంతాలను, వాటికి సంబంధించిన పారిభాషిక పదాలను లోతుగా వివరిస్తుంది. ఈ పుస్తకానికి ఆయన రాసుకున్న ‘రచయిత మాటలు’ ఆయనకున్న Intellectual humility ని తెలియజేస్తాయి. ఈపైన రచనలతోపాటు ఆయన వెలువరించిన ‘మానవీయ బుద్ధ’, ‘బుద్ధ దర్శనం’, ‘తెలుగులో బౌద్ధం’, ‘ఆచార్య నాగార్జునుడు’, ‘బుద్ధుని దీర్ఘ సంభాషణలు’, ‘బుద్ధుని మార్గం’, ‘బుద్ధుని ధర్మోపదేశం’, ‘పారాయణ వర్గ’, ‘బుద్ధుని మాధ్యమ సంభాషణలు’ (మూడు సంపుటాలు) లాంటి స్వతంత్ర రచనలు, అనువాదాలు ఆయనకు బుద్ధిజం పట్ల ఉన్న నిబద్ధతకు తార్కాణాలు. ఒక పుస్తకాన్ని రాయటానికి ఒక టైమ్‌ టేబుల్‌ లాంటిది వేసుకుని ఆ ప్రకారం ఆయన రాయటం నేను స్వయంగా చూసాను. 


తెలుగులో సిద్ధాంత చర్చలు ఎక్కువగా జరగటం సంతో షించాల్సిన విషయమైతే అవేవి పుస్తకరూపం పొందక పోవటం, ముఖ్యంగా కొత్త సిద్ధాంతాల ఆలోచనాధారల గురించిన రచనలు శకలాలుగా, వ్యాసాలుగా మాత్రమే వెలువడటం చింతించాల్సిన విషయం. మానవహక్కుల నేత బాలగోపాల్‌ అన్నట్లు మనది ఎక్కువగా వినికిడి జ్ఞానం మీద ఆధారపడే సంస్కృతి. దీనిని తిరస్కరిస్తూ మనో విజ్ఞానశాస్త్రం, అస్తిత్వవాదంల గురించిన ప్రామాణిక రచనలు చేశారు. అస్తిత్వవాదం గురించి ఎంతోకొంత సమగ్రమైన పుస్తకం తెలుగులో ‘అస్తిత్వవాదం ఒక్కటే’. ఇందులో రెండు ప్రపంచయుద్ధాల మధ్య, ఆ తరవాత కూడా విశేషంగా ప్రభావితం చేసిన కీర్క్‌ గార్డ్‌ నుంచి సార్ర్తే దాక ఉన్న తత్త్వశాస్త్ర భావాల్ని సాహిత్యంలో ఆ భావాలకున్న ప్రాధాన్యత గురించి చర్చించారు. 


అన్నపరెడ్డి భావాలు ఎక్కువగా విశ్వజనీనదృష్టి కల్గి ఉంటాయి. విశ్వజనీనత అనే భావన సమస్యాత్మకం చేయ బడిన నేపథ్యంలోకూడా ఆయన మారలేదు. అదే ధోరణిలో ఆలోచించారు. ప్రాచీన గ్రికు తాత్త్వికుల, వికాస యుగ తాత్త్వికుల రచనల్ని అయన తన సంస్కారంలో విలీనం చేసు కున్నారు. వాటినుంచి బయటపడి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. నిర్దిష్టమైన, ప్రాంతీయమైన అనుభవ కేంద్రంగా ముం దుకు వచ్చిన ఉద్యమాల్ని, ఆలోచనల గురించి ఆయనెప్పుడూ పట్టించుకోలేదు. అది అయన పరి మితి. ఆ పరిమితిని ఒప్పుకునేవారు.  Classical Doctrinesలో ఒదగని ఆలోచనల్ని అయన అంగీకరించటం అరుదుగా మాత్రమే జరిగేది. 


ఎన్ని రచనలు చేసినా అన్నపరెడ్డి Intellectual humilityతోనే ఉండేవారు. ‘‘జ్ఞానమనే మహాసముద్రంలోని జలాన్ని నా ‘బుడ్డజెంబు’ పట్టినంతవరకే గ్రహించానని’’ వినయంగా చెప్పుకున్నారు. వ్యక్తిగా అన్నపరెడ్డి చాలా ప్రైవేట్‌ పర్సన్‌. మిసిమి సంపాదకుడిగా ఉన్న కాలంలో మాత్రమే ఎక్కవమందిని కలిసేవారు. తెనాలి మిత్రులతో మాత్రం దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు రోజూ చర్చలు సంప్రదింపులు నడిచేవి. తన సమయం ఎక్కువగా రాయటం, చదవటానికే ఉపయోగించేవారు. ఇందుకు అయన జీవన సహచరి కాంతమ్మ సహకారం చాలా ఉంది. 


తెలుగు సమాజాల్లో మిగతావాళ్ళు చేయని, చేయలేని రచనలు అన్నపరెడ్డి చాలా చేసారు. అవేవీ విస్మరింప రానివి. ప్రత్యామ్నాయ ఆలోచనల అవసరం ముందెప్పుడూ లేనంతగా ఉన్న వర్తమాన సందర్భంలో అన్నపరెడ్డిగారు లేని లోటు పూడ్చలేనిది. 

బి.తిరుపతిరావు 

9440408982 

Updated Date - 2021-03-15T09:36:37+05:30 IST