Abn logo
Aug 30 2021 @ 00:34AM

తెలుగులో తొలి వచనాలు

తెలుగు కవిత్వంలో ఏ పోకడలకైనా 14వ శతాబ్దం వరకూ సంస్కృతమే ఆధారమయింది. శాంతం, వీరం, శృంగారం మొదలైన రసాలే అప్పటి రాజులు, రాజకవులు, కవిరాజులు, పండితులను ఎక్కువగా ఆకర్షించాయి. ఆయా సంస్కృత కావ్యాల్లో ఉండే భక్తిని తెలుగులో వారివారి పాండిత్య ప్రకర్షతో చూపించడం తప్ప, వారి రచనలకు భక్తి పనికొచ్చే రసం కాలేకపోయింది. భక్తి అందరికీ చెందిన వస్తువు. అయినా పండితులకు చాలాకాలం దూరం అయింది. పైగా అప్పటి కావ్యాలు సంస్కృత పద్ధతి లోని పద్యం గద్యం కలగలిపిన చంపూ కావ్యాలు. దానికి మినహాయింపుగా, 11-12 శతాబ్దాలలో నన్నెచోడుడు, పాల్కురి సోమనాథుడు మూలంగా జానుతెలుగు, దేశీ పద్ధతిలోని ద్విపదలు వచ్చిచేరాయి.


అటువంటి సమయంలోనే 13 శతాబ్దంలో కృష్ణమాచార్యులు వచ్చి చేరాడు. కొందరు అతనిని తెలుగులో ప్రప్రథమ వచన కవితాచార్యు డని, ఇంకొందరు తొలి తెలుగు వచన గేయకారుడని, మరికొందరు తొలి తెలుగు వాగ్గేయకారుడని అన్నారు. అతని జీవిత విశేషాలు ఎక్కువ భాగం అతను రాసుకున్న వచనాల్లోనే దొరుకుతాయి. తల్లి పేరు లక్ష్మమ్మ, తండ్రి నారాయణయ్య. అయితే అతను పుట్టినట్టు పేర్కొన్న ‘‘సంతూరు’’ ఎక్కడో తెలియదు. అది సింహాచలానికి సమీపాన ఉన్న సంతలూరే అని, తమిళనాడులో తిరునల్వేలి జిల్లా లేదా ఉత్తరార్కాడు లోని ఏదో ఊరని, కాదు తెలంగాణాలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ‘‘సంత ఊరు’’ అని, రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. కృష్ణమాచార్యులు కొంతకాలం విశాఖపట్నం సమీపంలోని సింహాచలం వద్ద ఉన్నట్లు సింహగిరి వచనాలు చెబుతున్నాయి. పుట్టుకతో అంధుడు కావడంతో, తల్లిదండ్రులు పాడుబావిలో పారవేస్తే, కృష్ణకువ్వారు స్వామి అనే ఒక సాధువు కాపాడి, తనతోబాటు సింహాచలం చేరిస్తే, సింహాచల నాథుడే చూపునిచ్చి పెంచాడని అతని వచనాల్లో చెప్పుకున్నాడు. కొంత కాలానికి అతని మేనమామ రంగాచార్యుల స్వామి అతనిని గుర్తించి, కూతుర్నిచ్చి పెళ్లి చేసాడు. అతని ఒకే ఒక్క కొడుకు ఏడేళ్ల ప్రాయంలో మరణించాడు, ఆ తరువాతే తాను వేశ్యాలోలుడయినట్టు వచనాల్లో చెప్పుకున్నాడు. అతనికి మోహనాంగి అనే వారకాంత, అన్నసాని పేరున ప్రియమైన సేవకురాలు కూడా ఉన్నారన్నాడు. కృష్ణమాచార్యుని భక్తులు ఐదుగురు- పౌతకమూరి భాగవతులు నారాయణయ్య, యౌబళయ్య, యచ్యుతయ్య, చెన్నయ్య, లక్ష్మణయ్యలు- వేశ్యాలోలుడైన కృష్ణమాచార్యులకు కనువిప్పు కలగడానికి దోహదపడ్డారు. అహోబిలం, శ్రీరంగం, వేంకటాచలం, కాశీ, ద్వారక, అయోధ్య మొదలైన క్షేత్రాలను సందర్శించినట్టుగా చెప్పుకున్నాడు.


కృష్ణమాచార్యులు వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు. నరసింహ స్వామి కోరిక మేరకే తన పదహారవ ఏట (1284లో) వచన రచన ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాకతీయుల యుగంలో మధుర కవితలు ప్రచారంలో ఉండేవి. అలాంటి సింహగిరి వచనాలు రచనతో కృష్ణమా చార్యులు ప్రజాదరణ పొందాడు. మధుర కవితకు అతడిని ఆద్యుడిగా పేర్కొంటారు. ఈ వచనాలు, సింహాచలంలోని వరాహ నారసింహస్వామిని, ఆ స్వామి విశేష గుణగణాలని కీర్తిస్తూంటాయి. అందులోని ప్రతి వచనం ‘దేవా!’ అనే సంబోధనతో మొదలై ‘సింహగిరి నరహరి నమోనమో దయానిధీ’ అనే మకుటంతో ముగుస్తుంది. అక్కడక్కడ మకుటం మారినవీ ఉన్నాయి. అనాథపతీస్వామి సింహగిరి నరహరీ నమోనమో దయానిధీ, మాయతి రామానుజ మునివరం దాతారు సింహగిరినరహరీ నమోనమో దయానిధీ, కృష్ణకువ్వారుస్వామీ సింహగిరినరహరీ లాంటి వేర్వేరు మకుటాలూ ఉన్నాయి. గద్యం పద్యంతో కూడిన చంపూ సాహిత్య సంప్రదాయం నుండి బయటకొచ్చి, వచన పద్ధతిని తెచ్చిన ప్రథముడు కృష్ణమాచార్యుడు. భక్తిభావంతో రాసిన ఆ వచనాలను జనసామాన్యంలోకి తీసుకుపోయిన ప్రథమ సంకీర్తనాచా ర్యుడు కూడా అతనే. రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడ్డాయి. కృష్ణమాచార్యుని రచనలన్నీ రాగతాళాలతో పాడదగిన ధ్యాన సంకీర్తనాలే. బాలాంత్రపు రజనీకాంతరావు ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంగా ‘భక్తి రంజని’ కార్యక్రమంలో రెండు వచనాలను (41, 62) అద్భుతంగా గానంచేసి చూపించారు. ఆ తరువాత వాటిని పాట రూపంలో పెట్టేందుకు ఒకరిద్దరు ప్రయత్నం చేసినా, అది ఇంక కొనసాగక మరుగునపడిపోయాయి. 


పద్యాల లాంటి వచనాలు రాయడం తెలుగు సాహిత్యంలో కాకతీయ ప్రతాపరుద్రుడి (1295-1323) కాలంలోనే ప్రారంభమైంది. తన సమకాలికు డైన కృష్ణమాచార్యుల సింహగిరి వచనాల విషయాలు తెలుసుకొన్న కాకతీయ ప్రతాపరుద్రుడు కనకగిరి సీమలో 50 గ్రామాల మీద అధికారాన్ని, ఒక అగ్రహారాన్ని సైతం అతనికి దానం చేసాడు. దానితో కల్లూరు అనే గ్రామాన్ని కృష్ణమాచార్యులు కట్టించాడు. ఈ కల్లూరు గ్రామం నేటి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే ఉంది. ఆ తరువాత తాను రాసిన చాతుర్లక్ష వచనాలను రాగిరేకులపై చెక్కించి, వాటిని బండ్లమీద ఎక్కించుకొని శ్రీరంగం వెళ్లిపోయాడు. ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర కూడా ఆ రాగిరేకుల విషయాన్ని ధ్రువీకరిస్తోంది. ఈ రాగిరేకుల విధానాన్నే తాళ్లపాక అన్నమాచార్యులు కూడా అనుసరించాడు. అయితే కృష్ణమాచార్యుల రాగిరేకులు ఎక్కడికి పోయాయి, ఎలా పోయాయి అన్నది ఎవరికీ తెలియదు. అతని చివరి రోజులు శ్రీరంగంలో గడిపి, ఆ శ్రీరంగేశ్వరునిలోనే ఐక్యమయాడని భావిస్తున్నారు. 


18వ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రల్లో సింహాచల క్షేత్రం విధ్వంసానికి గురైంది. బహుశా కృష్ణమాచార్యుల వాఙ్మయం అప్పుడే అంతరించిపోయి ఉంటుంది. తన చాతుర్లక్ష (నాలుగు లక్షల) వచనాల ప్రసక్తి కృష్ణమాచార్యులు చెప్పుకున్నా, నేడు దాదాపు రెండు వందల వచనాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. సింహగిరి వచనాల్లో కొన్నింటికి సామాన్య లక్షణాలుంటే, మరి కొన్నింటికి విశేష లక్షణాలున్నాయి. వైష్ణవసిద్ధాంత వచనాలు, పురాణ వచనాలు, వేదాంత వచనాలు, కథా వచనాలు, జీవిత వచనాలు, నీతి వచనాలు వగైరా.


కృష్ణమాచార్యుల వాఙ్మయాన్ని తాళ్లపాక తిరువెంగళాచార్యుడు తెలుగు వేదంగా స్తుతించాడు. ‘‘వేదంబు తెనుగు గావించి సంసార ఖేదంబు మాంపిన కృష్ణమాచార్యు’’ అని చెప్పుకున్నాడు. చూర్ణికలుగా అతని వచనాల్ని చెబుతారు. చూర్ణిక అంటే తేలిక పదాలతో కూడిన రచన. పాండిత్య ప్రదర్శనకు అవకాశం లేని రచన. పామరులకు కూడా అందులోని ఆత్మాశ్రయ భావం అర్థం కావడం అక్కడ ముఖ్యం. ఈ లక్ష్యాన్ని సింహగిరి వచనాలు తప్పకుండా నెరవేర్చాయి. 13వ శతాబ్దం నాటికి పద్యం గద్యం ప్రచలితంగా ఉన్నప్పటికీ, వచనాల రూపాన్నే కృష్ణమాచార్యులు ఎన్నుకుందుకు బహుశా అతనికి ముందు, సంస్కృతం కన్నడంలో వచ్చిన వచనాల అధ్యయనం అతన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు.


శ్రీవైష్ణవులకి, వేదంతో సమానమైన రామానుజాచార్యుని గద్యత్రయం ఒకటి ఉంది. శ్రీర్గ గద్యం, శరణాగతి గద్యం, శ్రీవైకుంఠ గద్యాల లోని అనేక భావాలు సింహగిరి వచనాల్లో కనిపిస్తాయి. వాటిల్లోలానే తన వచనాలలో నరసింహస్వామిని అనేక సంబోధనలతో స్తుతిస్తాడు కృష్ణమాచార్యుడు. శరణాగతి గద్యంలోని నడకసైతం కొన్ని వచనాలలో కనిపిస్తుంది. అంతేకాదు అందులోని గద్యాల చివర్లో ఉన్న ‘‘శరణం ప్రపద్యే’’లా, సింహగిరి వచనం చివర్లో ‘‘సింహగిరి నరహరీ నమో నమో దయానిధీ’’ అనే నమస్సుల్ని వాడాడు. ఇరువురి రచనల్లోనూ ఆర్ద్రతతో కూడిన భక్తి భావావేశాలున్నాయి. ఏదో ఒకే విషయానికి ప్రాధాన్యమీయక అనేక విషయాల్ని సందర్భోచితంగా చెప్పే తీరూ ఉంది. నిజానికి రామానుజాచార్యుని అనుకరించడమే కాదు, అతనిని గురువుగా భావించి అనేక వచనాల్లో ‘‘మాయతీ రామానుజ మునివరం’’ అని చెప్పుకున్నాడు.


తెలుగు సాహిత్యంలో భక్తి భావాన్ని అందుకొని గుర్తించి ఉపయోగించి ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రధముడు కృష్ణమాచార్యుడు. కృష్ణమాచార్యుని వచన సంకీర్తనలు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గానం చేయబడినట్టు అన్నమాచార్య చరిత్రలో ఉంది. అన్నమాచార్యునికి కృష్ణమాచార్యుని వచనాలతో అలా పరిచయమూ ఉంది. 


సింహగిరి వచనాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. వీటికి చందో నియమం లేదు. పరిమాణ నియమం కూడా లేదు. ప్రస్తావించాల్సిన వస్తువును బట్టి కొన్నే కొన్ని చరణాల్లో ముగించేవీ ఉన్నాయి, పేజీలకు పేజీలు నిండేవీ ఉన్నాయి. అందులో అంతఃసూత్రంగా భక్తి కొనసాగుతూ ఉంటుంది. వేటికవే వైవిధ్యభరితమైనవే అయినా అవి స్వయం సంపూర్ణాలు. నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి - ‘‘దేవా, ఆకలు యనియెడు తెవులింటింటికి దిప్పు. అసత్యకృతమే ముప్పు. తగవు. ధర్మము నడిపినదే యొప్పు. అనాథపతీ, నరహరీ, మిమ్ము దలంపనిదే తప్పు, సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!’’ (సింహగిరి వచనం- 61) 


వచనాల్లోని ఉపమానాలకు ఒక ఉదాహరణ: ‘‘కూపములో బడిన శిశువలె గూయుచున్నాడను, తల్లిలేని బిడ్దవలె కలవరించు చున్నాడను, తైలములోని మక్షికము చందం బాయెను, ఉరిబడ్డ మొకమువలె నుపాయ మెఱుంగక ఉన్నవాడను, పసిరికాయ పురుగువలె తేలలేక’’ (సింహగిరి వచనం - 32). 


కృష్ణమాచార్యులకు వర్ణవ్యవస్థ మీద విప్లవాత్మక భావాలున్నాయి. అనేక ఇతర సంప్రదాయాల్లో సైతం స్వాతంత్య్రం ప్రకటించినట్టు అతని వచనాలు చెబుతాయి. తన పెళ్లి పందిట్లో శూద్రులతో సహపంక్తి భోజనం చేశాడట. పరమం, పవిత్రం అనుకునే యజ్ఞోపవీతాన్నీ ఆనాడే వదిలిపెట్టాడట. పర్యవసానంగా పసుపు బట్టల్లోనే అత్తవారింటి నుంచి వెలిపడి, భార్యాసమేతంగా బయటపడ్డాడట. అతనికి ఆచార్య కటాక్షం కంటే మరో సాధనం లేదు. సింహగిరి నరహరిని మించిన దైవమూ లేడూ. మతసహనానికి సంబంధించిన వచనాలూ ఉన్నాయి: ‘‘ఏవర్ణనైననేమి మీ దివ్యనామ గుణసంగతి... గలుగజేసి మీ దాసానుదాసునిగా జేయవే’’ - (సింహగిరి వచనం 47); ‘‘దేవా మీభక్తుండైయుండి రుద్రభక్తుల దూషించుట దోషంబని తెలిసియందుకు...’’- (సింహగిరి వచనం 26). 


మొదటి ముద్రణ తరువాత, సింహగిరి వచనాల పుస్తకాల్లో ఎక్కడా చేర్పులు లేవు. కనీసం పునర్ముద్రణ అయినా లేదు. కీర్తనల్లా గాని లేదా వచనాల్లా గాని కృష్ణమాచార్యుల రచనలకు దేవస్థానాలు, విశ్వవిద్యాలయాలు, సాహిత్య సంస్థలు, మొదలయిన వాటి నుండి ప్రచారమయినా లేకపోవడమే విషాదం. అతనికి గురువు లేడు. అతనికి ఏ రాజు ప్రోత్సాహమూ లేదు. ఆ రచనలకు తాను, తన సింహగిరి నరహరే ఆది అంతమూ కూడా.


సింహగిరి నరహరి వచనాల నుండి కొన్ని వచనాలు: 

‘‘దేవా! విష్ణుభక్తి లేని విద్వాంసుకంటె హరికీర్తనము సేయునతడె కులజుండు. శ్వపచుండైన నేమి ఏ వర్ణంబైననేమి? ద్విజునికంటె నతండు కులజుండు. దృష్టింజూడగా విద్వజ్జన దివ్యభూషణము. సింహగిరిం దలంచిన యాతండె కులజుండు.’’


‘‘సంధ్యాది నిత్యకర్మాణుష్ఠానంబులు దప్పక నడిపిన నేమి? చతుర్వేద షట్‌ శాస్త్రముల్‌ సదివిన నేమి? శత క్రతువు లాచరించిన నేమి? సకల ధర్మంబులుసేసిన నేమి? మా సింహగిరి నరహరిదాసులకు దాసులైనం గాని లేదుగతి’’ (11)


‘‘దేవా! మీకు మొఱపెట్టి విన్నపము చేయుచున్నాడను, సంసారమోహబంధముల దగులువడితిని. కర్మానుకూలంబులం బెనగొంటిని. కాంతలమీది కోరిక కడవదాయెను. కామాంధకారము కన్నులగప్పెను. కర్మవారిధి గడువదయ్యెను. అపరకర్మములకు లోనైతిని, అజ్ఞానజడుండనైతిని, అధమాధముండనైతిని, అందని ఫలములకఱ్ఱులు సాచితిని, దుష్టదురాచారుండనైతిని, మూఢుండనైతిని, చపలుండనతిపాతకుండను’’ (32)


‘‘దేవా, పర్వతంబునకుబోయి శైవులగుదురు. తిరుపతుల జూచి వైష్ణవులగుదురు. శక్తిమతంబును జూచి కుశాలులగుదురు. ఇటువంటి మనస్సంచలనమునగద రౌరవాది నరకగతియైు ఇహపరములు లేకుండుట. ఆత్మజ్ఞానులైన జనులే మతాభిమానులు. శాస్త్ర వైరాగ్యములలో బాధలు చెప్పంబడు, వానినేయవలంబు చేయుదురు. ఈ మతమా మతమన దిరిగెడు నట్టి కుమతుల నేనేమందు. సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ!’’ (47)

ముకుంద రామారావు

99083 47273


ప్రత్యేకంమరిన్ని...