కరోనా కాలంలోనూ రాజకీయ సిఫారసులు

ABN , First Publish Date - 2020-05-24T07:51:18+05:30 IST

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను చికిత్స నిమిత్తం కొవిడ్‌ ఆసుపత్రులకు తరలిస్తున్న వైద్య అధికారులు...

కరోనా కాలంలోనూ రాజకీయ సిఫారసులు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులను చికిత్స నిమిత్తం కొవిడ్‌ ఆసుపత్రులకు తరలిస్తున్న వైద్య అధికారులు.. బాధిత కుటుంబ సభ్యులను, వారితో కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించి క్వారంటైన్‌ సెంటర్లకు పంపుతున్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే, కొందరు ప్రభుత్వ ఉన్నతా ధికారులు, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులే ఆ నిబం ధనలను తుంగలో తొక్కుతూ తమకు కావాల్సిన వారిని కొవిడ్‌ ఆసుపత్రులకు, క్వారంటైన్‌ సెంటర్లకు తరలించ కుండా మోకాలడ్డుతుండటం ఇప్పుడు చర్చనీయంశమైంది.


మంత్రి నిర్వాకం.. కేఎల్‌రావు నగర్‌లో భయంభయం

పాతబస్తీలోని కేఎల్‌రావు నగర్‌లో ఈనెల 19వ తేదీ రాత్రి ఓ వృద్ధురాలు మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించిందని కుటుంబ సభ్యులు చెప్పడంతో మర్నాడు ఉదయం బంధువులు, చుట్టుపక్కలవారంతా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణించిన వృద్ధురాలి తనయుడు వైసీపీ నాయకుడు కావడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో వచ్చి పరామర్శించారు. వృద్ధురాలి స్వస్థలం గుంటూరు జిల్లా డోలక్‌నగర్‌ కావడంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయుంచారు. అయితే, మృతదేహాన్ని గుంటూరుకు తరలించడానికి అధికారులు అభ్యంతరం చెప్పారు. స్థానిక మంత్రితో పాటు మరో ఇద్దరు మంత్రులతో సిఫారసు చేశారు. దీంతో కరోనా పరీక్షలు చేయించాలని, నెగెటివ్‌ రిపోర్టు వస్తే మృతదేహాన్ని తరలించడానికి అభ్యంతరం ఉండబోదని అధికారులు చెప్పడంతో కొవిడ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి మృతదేహానికి పరీక్షలు చేయించారు.


ఆ వృద్ధురాలు కరోనా కారణంగా మరణించినట్లు నిర్ధారణ కావడంతో అందరూ కంగుతిన్నారు. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి వైద్య సిబ్బందే దగ్గరుండి స్వర్గపురికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇంట్లో నుంచి బయటకు రాని వృద్ధురాలికి కరోనా రావడం చర్చనీయాంశమైంది. వృద్ధురాలు చనిపోయిన రోజే కేఎల్‌రావు నగర్‌ వాసులకు వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ బాధితులంతా మృతురాలి ఇంటి చుట్టుపక్కలవారే. పైగా 60 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధులే. దీంతో వారిని కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు.


ఓ అధికారి కూడా.. 

ఇటీవల సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. వారిద్దరినీ చికిత్స కోసం కొవిడ్‌ ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా, ఒక ఉన్నతాధికారి జోక్యం చేసుకుని వారిని ఆసుపత్రికి తీసుకెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఉద్యోగులు కృష్ణలంకలోని తమ నివాసాల్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులెవరినీ క్వారంటైన్‌ సెంటర్లకు తరలించలేదు. దీనిపై స్థానికుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పటికే కృష్ణలంకలో 135 మందికిపైగా కరోనా సోకగా, వారందరినీ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు, కాంటాక్టులను క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచారు. కానీ, ఆ ఇద్దరు ఉద్యోగుల కుటుంబ సభ్యులను స్వేచ్ఛగా వదిలేస్తే  వైరస్‌ వ్యాపించదా? అనేది ప్రశ్న. 


క్వారంటైన్‌.. తూచ్‌..

నిబంధనల ప్రకారం చనిపోయిన వృద్ధురాలి కుటుంబ సభ్యులతో పాటు పాజిటివ్‌ వచ్చిన మిగతా 9 మందికి చెందిన కుటుంబ సభ్యులను, వారితో కాంటాక్ట్‌ అయినవారందరినీ క్వారంటైన్‌ సెంటర్లకు తరలించాలి. కానీ, మృతురాలి కుటుంబ సభ్యులతోపాటు మిగిలిన పాజిటివ్‌ బాధితుల కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలించకుండా మంత్రి అడ్డుకున్నారని, వారంతా ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటారని చెప్పి అధికారులకు నచ్చజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. 


అధికార దుర్వినియోగమా..

కరోనా బారినపడిన కుటుంబాలవారిని, ఇళ్లలోనే ఉంచితే.. వారి నుంచి చుట్టుపక్కలవారికి వైరస్‌ వ్యాపించదని గ్యారెంటీ ఏంటి? అంటూ స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.  ఇలా ఒక్క కేఎల్‌రావు నగర్‌లోనే కాదు.. పాతబస్తీలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న అనేకమందిని క్వారంటైన్‌కు తరలించకుండా మంత్రి అధికారులను అడ్డుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2020-05-24T07:51:18+05:30 IST

News Hub