ఒంగోలు డెయిరీ క్లోజ్‌?

ABN , First Publish Date - 2021-01-01T06:19:05+05:30 IST

ఒంగోలు డెయిరీ భవిష్యత్‌పై పాడిరైతుల ఆశలు..

ఒంగోలు డెయిరీ క్లోజ్‌?
ఒంగోలులోని డెయిరీ సమావేశ మందిరం

నేటి నుంచి పాల సేకరణ నిలిపివేత

వీఆర్‌ఎస్‌ ద్వారా ఉద్యోగులను సాగనంపే ప్రయత్నం

తాత్కాలిక సిబ్బంది భవిష్యత్‌పై స్పష్టత కరువు

ఫ్యాక్టరీ, యంత్ర సామగ్రి అమూల్‌కు లీజు వైపు మొగ్గు

ఆందోళనలో డెయిరీ ఉద్యోగులు, పాడి రైతులు


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ఒంగోలు డెయిరీ ఇక మూతపడినట్లేనా? పాడి రైతుల కల్పవల్లిగా ఒక వెలుగు వెలిగిన సంస్థ చరిత్రలో కలిసిపోనుందా? అంటే.. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఔను! అన్న సమాధానం వస్తోంది. ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. గుజరాత్‌ రాష్ర్టానికి చెందిన అమూల్‌ సంస్థపై అపరిమితమైన ప్రేమ కురిపిస్తూ జిల్లా డెయిరీకి ఎసరు పెట్టింది. కీలకమైన పాల సేకరణను నిలిపివేస్తూ ఆదేశాలివ్వడంతో పాడిరైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దశాబ్దాల కాలంగా జిల్లాకు తలమానికంగా నిలిచిన ఒంగోలు డెయిరీకి పెద్దఎత్తున ఆస్తులు, యంత్ర సామగ్రి, సాంకేతిక అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ గత పాలకవర్గ నిర్వహణ లోపాలతో సంక్షోభంలో కూరుకుపోయింది. దానిని గాడిలో పెట్టి, పాడి రైతులకు బాసటగా నిలవాల్సిన పాలకులు అమూల్‌ పాట పాడుతున్నారు. డెయిరీ ఉద్యోగులకు ఉద్వాసన ప్రక్రియ కూడా మొదలైంది. సంస్థ ఆస్తులు, యంత్రసామగ్రి అమూల్‌కు లీజుకి వ్వడానికే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే డెయిరీని జిల్లావాసులు మర్చిపోవాల్సిందే.


ఒంగోలు డెయిరీ భవిష్యత్‌పై పాడిరైతుల ఆశలు ఆడియాసలుగానే కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు ఆ సంస్థ మూసివేత ఖాయం అన్న సంకేతాలను ఇస్తున్నాయి. డెయిరీ నిర్వహణలో అత్యంత కీలకమైన పాల సేకరణ ప్రక్రియ శుక్రవారం నుంచి నిలిపేస్తున్నారు. ప్రస్తుతం డెయిరీకి పాడి రైతుల నుంచి తక్కువ పరిమాణంలో మాత్రమే పాలు వస్తుండగా సేకరణ ఖర్చుల భారం పేరుతో వాటికి బ్రేక్‌ వేశారు. కాగా డెయిరీ సంక్షోభాన్ని గుర్తించిన గత టీడీపీ ప్రభుత్వం కంపెనీ చట్టం ద్వారా మనుగడలో ఉన్న అప్పటి పాలకవర్గాన్ని రద్దుచేసి అధికారులతో కూడిన ప్రక్రియను చేపట్టడంతోపాటు, రూ.35కోట్ల్ల మేర ఆర్థిక సహాయం చేసి తిరిగి సంస్థను నిలబెట్టే ప్రయత్నం చేసింది. అలా ఇప్పటివరకు ఏదో ఒకరకంగా మనుగడ సాగిస్తూ వస్తున్న ఒంగోలు డెయిరీకి ప్రస్తుత ప్రభుత్వం అమూల్‌ పేరుతో అసలుకే ఎసరు పెట్టింది. 


అమూల్‌ రాకతో సేకరణ

పాడి రైతులకు మేలు పేరుతో ప్రభుత్వం అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకొంది. రాష్ట్రంలో ఆ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. తొలి విడత మూడు జిల్లాల్లో అమూల్‌ పాల సేకరణ ప్రారంభం కాగా అందులో మన జిల్లా కూడా ఉంది. దాదాపు నెలన్నర రోజులుగా జిల్లా యంత్రాంగం మొత్తం పూనుకొని అమూల్‌కు అండగా పాలసేకరణకు అష్టకష్టాలు పడుతోంది. అయినా రోజుకు 10వేల లీటర్ల వరకే వస్తున్నాయి. వాటిని ఒంగోలు డెయిరీలో కూలింగ్‌ ప్రాసెస్‌ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఒంగోలు డెయిరీ అభివృద్ధిపై పెద్దపెద్ద మాటలు చెప్పిన పెద్దలు అమూల్‌తో ప్రభుత్వ ఒప్పందంతో మిన్నకుండిపోయారు. కాగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య మిణుకుమిణుకుమంటున్న ఒంగోలు డెయిరీ పరిస్థితి అమూల్‌ రాకతో మరింత క్షిణించిపోయింది. అప్పటి వరకు రోజువారీ 18వేల లీటర్ల వరకూ ఒంగోలు డెయిరీకి వస్తుండగా అమూల్‌ రాక తర్వాత 4వేలకు పడిపోయి సేకరణ ఖర్చు భారీగా పెరిగింది. దీంతో ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచి పాలసేకరణను శుక్రవారం నుంచి నిలిపేయాలని ప్రస్తుతం ఒంగోలు డెయిరీ యాజమాన్యం నిర్ణయించింది. ఆ మేరకు సూపర్‌వైజర్లు, ఏజెంట్లకు సమాచారం పంపింది. 


ఉద్యోగులకు ఉద్వాసన

ప్రస్తుతం డెయిరీలో 68మంది శాశ్వత ఉద్యోగులు, మరో 60మందికిపైగా తాత్కాలిక సిబ్బంది పనిచేస్తుండగా వారి ఉద్వాసన ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఉద్యోగులుగా ఉన్న వారిని వీఆర్‌ఎస్‌ ఇచ్చి శాశ్వతంగా పంపేలా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా ప్రస్తుతం డెయిరీలో పనిచేస్తున్న 68మంది పర్మి నెంట్‌ ఉద్యోగులను వచ్చే ఫిబ్రవరి ఆఖరులోపు వీఆర్‌ఎస్‌ ద్వారా ఇంటికి పంపివేయనున్నారు. తాత్కాలిక సిబ్బందిని కూడా తొలగించనున్నారు. మరోవైపు ఒంగోలు డెయిరీని శాశ్వతంగా సమాధి చేసి ఈ సంస్థ పరిధిలో ఉన్న పాలపొడి ఫ్యాక్టరీ, ఇతర యంత్రాలు మొత్తం వనరులను లీజుపేరుతో అమూల్‌కు అప్పగించే విధంగా ప్రభుత్వ చర్యలువేగవంతంగా సాగుతున్నాయి. ఇక్కడ బుధవారం జరిగిన డెయిరీ వార్షిక సర్వసభ్య సమావేశం కూడా అందుకు అనుకూలంగానే అధికారులు ప్రభుత్వ అదేశాలతో నడిపించారు. 


ప్రభుత్వ చర్యలతో కష్టాలు

డెయిరీ ప్రస్తుతం కంపెనీ చట్టం పరిధిలో ఉన్నప్పటికీ సహకార చట్టం ద్వారా సంస్థకు సంక్రమించిన అస్తులన్నీ కంపెనీ చట్టంలోకి మార్పు జరగకపోవడం, తిరిగి సహకార చట్టంలోకి మారడానికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్‌ ఉంది. పెద్దఎత్తున బ్యాంకులు ఇతర సంస్థలకు అప్పులు వంటి అనేక ప్రతికూల అంశాల నేపథ్యంలో పాల సేకరణ, వ్యాపారాన్ని పెంచి సంస్థను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అమూల్‌ సంస్థను ప్రోత్సహించడంతో డెయిరీ మరింతగా క్షీణించింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పోకడ, యంత్రాంగం చర్యలతో మూసివేత దిశగా ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం నుంచి ఒంగోలు పరిసరాల నుంచి పాల సేకరణను నిలిపివేస్తున్న అధికారులు ప్రస్తుతం ఎర్రగొండ పాలెంలోని కూలింగ్‌ సెంటర్‌ నుంచి వస్తున్న పాలను మరికొన్నిరోజుల పాటు తెప్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, సిబ్బందిపై స్పష్టత వచ్చాక వాటిని కూడా నిలిపివేయవచ్చని సమాచారం. అయితే అమూల్‌ సేకరించే పాలు ప్రాసెసింగ్‌ మాత్రం ఒంగోలు డెయిరీలోనే కొనసాగుతుంది. ఈ పరిణామాలు పాడి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


Updated Date - 2021-01-01T06:19:05+05:30 IST