ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయండి
ABN , First Publish Date - 2021-03-14T05:56:47+05:30 IST
: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు కోరారు.

ఉక్కు కార్మికుల డిమాండ్
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన
కూర్మన్నపాలెం, మార్చి 13: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరం శనివారానికి 30వ రోజుకు చేరింది. ఎల్‌ఎంఎంఎం, ఆర్‌ఎస్‌అండ్‌ఆర్‌ఎస్, డబ్ల్యూఆర్‌ఎం-1, ఎస్‌బీఎం విభాగానికి చెందిన కార్మికులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా గంధం వెంకటరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. నష్టాలు వచ్చాయని పరిశ్రమలను తెగనమ్మడం దారుణమన్నారు. కార్మిక నేత వైటీ దాస్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ జరిగితే దానిపై ఆధారపడే వేలాది కుటుంబాలు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశాు. రైల్వేలు, బీఎస్‌ఎన్‌ఎల్, ఉక్కు కర్మాగారాలు, బ్యాంకులు ఇలా అన్నీ అమ్ముకుంటూ పోతే ఏమి మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు అన్ని పార్టీలు కలసి రావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరో కార్మిక నేత ఎన్.రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా అప్పుల ఊబిలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు తమ భూమిని, నీటిని త్యాగం చేయటం వల్లనే ఈ రోజు స్టీల్‌ప్లాంట్ ఇంత అభివృద్ధి సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో జె.అయోధ్యరామ్, ఆదినారాయణ, జె.సింహాచలం, బోసుబాబు, రామచంద్రరావు, మురళీరాజు, మస్తానప్ప, గంధం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, రమణారెడ్డి, సన్యాసిరావు, గణపతి రెడ్డి, విళ్ల రామ్మోహన్ కుమార్, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.