విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ దుర్మార్గం
ABN , First Publish Date - 2021-03-23T06:00:10+05:30 IST
త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించటం దుర్మార్గమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి
కూర్మన్నపాలెం, మార్చి 22: త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించటం దుర్మార్గమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సోమవారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఏపీయూడబ్ల్యూజే) ప్రతినిధులు సందర్శించి నల్ల బెలూన్‌లు ఎగురవేసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే విశాఖ అభివృద్ధితోపాటు రాష్ట్రం కూడా తిరోగమనం వైపు పయనిస్తుందన్నారు. జర్నలిస్టు సంఘం నేతలు ఆలపాటి సుధాకర్, సోమ సుందర్, చంద్రమోహన్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు పూనుకోవటం తగదన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పాటైన ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామని, ఉక్కు ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పోరాట కమిటీ ప్రతినిధులు జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, జె.రామకృష్ణ, యు.వెంకటేశ్వర్లు, గంధం వెంకటరావు, జి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.