ఉక్కు నినాదం ఢిల్లీ పెద్దల చెవుల్లో మారుమోగాలి
ABN , First Publish Date - 2021-03-31T05:20:49+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఎలా బతకాలని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కో-కన్వీనర్ కేఎస్‌ఎన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు

పరిరక్షణ కమిటీ నేతల పిలుపు
కూర్మన్నపాలెం, మార్చి 30: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే దాన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఎలా బతకాలని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కో-కన్వీనర్ కేఎస్‌ఎన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 47 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఆయన ప్రసంగించారు. మంగళవారం టీపీపీ, సీపీపీ, పీఈఎం, ఆర్‌ఎండీ, సీఈడీఎల్ యూబీ, హైడ్రాలిక్స్, టెక్ సర్వీసెస్ విభాగానికి చెందిన కార్మికులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కె.ఎస్.ఎన్.రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వనరులను సమీకరించుకోవటానికి ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పటం అన్యాయమన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కో-కన్వీనర్ గంధం వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆరోపించారు. మెదక్‌కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వెంకటరావు మాట్లాడుతూ దేశ రక్షణకు సైనికుల వీరత్వం ఎంత ముఖ్యమో, వారి ప్రాణ రక్షణకు తయారు చేసే ఆయుధాలు కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెం శిష్ఠకరణ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీగా వెళ్లి ఉక్కు ఉద్యోగులకు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గంగవరం గోపి, డి.సత్యారావులు మాట్లాడుతూ దేశంలోనే పేరుపొంది లాభాల బాటలో పయనిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేస్తే సహించేది లేదన్నారు. ఈ దీక్షా శిబిరంలో ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, దేముడు, జి.ఆనంద్, టి.మోహన్ కుమార్, వెటీ దాస్, జె.సింహాచలం, ప్రసాద్, గంగవరం గోపి, బోసుబాబు, రామచంద్రరావు, మస్తానప్ప, గంధం వెంకటరావు, బొడ్డు పైడిరాజు, రమణారెడ్డి, సన్యాసిరావు, గణపతి రెడ్డి, విళ్ల రామ్మోహన్ కుమార్, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.