ఉక్కు పరిరక్షణకు మహిళలు నడుం బిగించాలి

ABN , First Publish Date - 2021-04-08T04:36:32+05:30 IST

మహిళా శక్తితో నిర్వహించే పోరాటాల్లో విజయాలు తథ్యమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి అన్నారు.

ఉక్కు పరిరక్షణకు మహిళలు నడుం బిగించాలి
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి

55వ రోజు కొనసాగిన ఉక్కు ఉద్యోగుల దీక్షలు

కూర్మన్నపాలెం, ఏప్రిల్‌ 7:  మహిళా శక్తితో నిర్వహించే పోరాటాల్లో విజయాలు తథ్యమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి అన్నారు. కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 55వ రోజు కూడా కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ శ్రామిక సంఘం మహిళలు, ఐద్వా మహిళలు, ఉక్కు ఉద్యోగుల సతీమణులు, ఉక్కు కో-ఆపరేటివ్‌ స్టోర్సు మహిళా ప్రతినిధులు, కాంట్రాక్టు మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఈ సదస్సులో స్వరూపారాణి మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణకు మహిళలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మహిళలకు కంటతడి పెట్టించిన ప్రభుత్వాలు మట్టి కొట్టుకుపోయాయని  గుర్తు చేశారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శేషారత్నం మాట్లాడుతూ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలతో దుర్మార్గ పాలనను అందించే బీజేపీ ప్రభుత్వానికి నూకలు చల్లే సమయం ఆసన్నమైందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  మణి మాట్లాడుతూ ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తగదన్నారు.  ఎల్‌ఐసీ వర్కింగ్‌ ఉమెన్‌ కన్వీనర్‌ కామేశ్వరి మాట్లాడుతూ దేశ పౌరులకు ఆర్థిక రక్షణ కల్గిస్తున్న ఎల్‌ఐసీని అమ్మకానికి పెట్టడం చాలా హేయమైన చర్యగా అభివర్ణించారు. మాజీ కార్పొరేటర్‌ విమల మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వమని అన్నారు. ఐద్వా నగర కార్యదర్శి సంతోషం మాట్లాడుతూ నేటి ప్రభుత్వంలో మహిళలపై దౌర్జన్యాలు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉక్కు శ్రామిక మహిళా సంఘం నాయకురాలు సత్యవతి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు మహిళలంతా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, గంధం వెంకటరావు, వరసాల శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-08T04:36:32+05:30 IST