ఆంగ్ల భాష భారతీయకరణ

ABN , First Publish Date - 2021-11-11T06:13:44+05:30 IST

‘అది ఇంగ్లీష్ మీడియం స్కూలే కాని మంచి చదువుకు అక్కడ అవకాశం లేదు. టీచర్లందరూ ఎంటిఐను భరిస్తున్నవారే. ఇక వారి నుంచి పిల్లలు ఎలాంటి ఇంగ్లీషు నేర్చుకుంటారు?’- ఇవి, మా మేనల్లుడి మాటలు...

ఆంగ్ల భాష భారతీయకరణ

‘అది ఇంగ్లీష్ మీడియం స్కూలే కాని మంచి చదువుకు అక్కడ అవకాశం లేదు. టీచర్లందరూ ఎంటిఐను భరిస్తున్నవారే. ఇక వారి నుంచి పిల్లలు ఎలాంటి ఇంగ్లీషు నేర్చుకుంటారు?’- ఇవి, మా మేనల్లుడి మాటలు. దీపావళి పండుగ అనంతరం నేను, నా భార్య మా బంధువుల ఊరు వెళ్ళాం. బడికి వెళ్ళే వయస్సులో ఉన్న తన ఇద్దరు పిల్లలను మంచి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివించడం కోసం మా మేనల్లుడు ఒక పెద్ద నగరంలో కాపురం పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ఇప్పటికే నీ పిల్లలు సమీప పట్టణంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్నారు కదా’ అన్నాను. అనగా అందుకు ప్రతిస్పందనగా అతడు ఎంటిఐ గురించి నిస్పృహతో ప్రస్తావించాడు. మేము ఆశ్చర్యపోయాం. ఆ ఎంటిఐ గురించి మేము ఎన్నడూ వినలేదు. దాని గురించి విద్యావంతులమైన మాకు తెలియకపోవడమేమిటో మా మేనల్లుడికీ అర్థం కాలేదు. ఎంటిఐ అంటే ‘మదర్‌టంగ్ ఇన్‌ప్లూయెన్స్’ (మాతృభాషా ప్రభావం) అని మాకు వివరించాడు. మాతృభాషతో మిళితమైన ఆంగ్ల భాషను మాత్రమే ఆ ఉపాధ్యాయులు మాట్లాడగలరని, ఇక పిల్లలకు మంచి ఇంగ్లీష్ ఎలా అలవడుతుందని మావాడు బాధపడుతున్నట్లు మాకు అర్థమయింది. మానవులు భాషలను ఉపయోగించే తీరు తెన్నులపై మాతృభాషా ప్రభావం ఉండడం అత్యంత సాధారణ, సహజ, ఆరోగ్యకరమైన లక్షణం. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మాతృభాషగా కలవారే ఎంటిఐకి బాధితులు. దానినుంచి వారు ఎన్నటికీ బయటపడలేరు! బ్రిటన్‌లో ఇంగ్లీష్ భాషను ఎంటిఐ బహువిధాల ప్రభావితం చేస్తోంది. స్కాటిష్ ఇంగ్లీష్, ఐరిష్ ఇంగ్లీష్ మాత్రమే కాదు విలక్షణ బర్మింగ్ హామ్ ఉచ్ఛారణతో మాట్లాడే ఇంగ్లీష్ కూడా అక్కడ ఉన్నది. ప్రపంచమంతటా వ్యాపించిన ఇంగ్లీష్‌కు సహజంగానే పలు ప్రత్యేక పదావళులు, మాండలికాలు, ఉచ్ఛారణలు ఉన్నాయి. అమెరికన్ ఇంగ్లీష్, కెనడియన్ ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ ఉన్నప్పుడు ఇండియన్ ఇంగ్లీష్, బెంగాలీ ఇంగ్లీష్, తమిళ్ ఇంగ్లీష్ మాత్రం ఎందుకు ఉండ కూడదు? ఉన్నాయి కూడా. ఆకాంక్షాభరితులైన భారతీయులు మాతృభాషను మరచిపోవడానికి ప్రయత్నించడం ఒక విషాదకర వినోదం. ఇంగ్లీష్‌ను రెండో భాషగా నేర్చుకున్న వాళ్లు తమ సొంత బాధాకర విద్యా ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకోవల్సిన అవసరముంది ఇంగ్లీష్‌ను మొదటి భాషగా నేర్చుకున్నవారు సైతం తమ విలక్షణ ఉచ్ఛారణను ఎలా నేర్చుకున్నదీ గుర్తు చేసుకోవాలి. మాతృభాషా ప్రభావాన్ని వదిలించుకునేందుకు ఎన్నారైలు నానాతంటాలు పడడం ఒక సాధారణ విషయం. సాంస్కృతిక న్యూనత, స్వీయ ద్వేషానికి ఎంటిఐ ఒక సంకేతపదం. ఈ లక్షణం అందరినీ ప్రభావితం చేస్తుంది. 


రెండు దశాబ్దాల క్రితం మేము, విదేశాలలో శిక్షణ పొందిన, ఎంటిఐ యేతర ఆంగ్లాన్ని వినసొంపుగా మాట్లాడే ఒక విదుషీమణిని కలుసుకున్నాం. హిందీలో నా రచనల గురించి తెలిసినందున ఆమె నన్ను అభినందించారు. నా మౌలిక పరిశోధనలు కొన్ని హిందీలో జరిగాయని నేను చెప్పగా ఆమె ఆశ్చర్యపోయారు. చింతనాత్మక కృషిని మీరు హిందీలో ఎలా చేయగలిగారు అని ఆమె ప్రశ్నించారు. హిందీ భాష పట్ల దక్షిణ భారతీయుల వ్యతిరేకతే ఆమె ఆశ్చర్యంలో ప్రతిధ్వనించిందని నేను పొరపడ్డాను. అయితే తమిళంలో గానీ, కన్నడంలో గానీ చింతనాత్మక పరిశోధనలు సాధ్యం కావని ఆమె దృఢస్వరంతో చెప్నారు. ఆ భాషలు ఆధునిక ఆలోచనా వాహకాలు కావని ఆమె ఖండితంగా చెప్పారు. ఆ భాషల్లో మీరు కథలు, కవితలు రాయగలరు గానీ సామాజిక సిద్ధాంతం గురించి ఆలోచించలేరు, రాయలేరు అని ఆమె అన్నారు. 


మన దేశంలోని ఏకభాషా భాషీయులు, ఆంగ్ల మానసపుత్రులైన మేధావుల అభిప్రాయాలనే ఆ విద్వాంసురాలు వ్యక్తం చేస్తున్నారని నేను భావించాను. మా మేనల్లుడికి భావవ్యక్తీకరణ సామర్థ్యం, సామాజిక ఆత్మవిశ్వాసం లేనప్పటికీ ఆంగ్లభాషపై ఆ విదుషీమణికి ఉన్న మక్కువే అతడికీ ఉన్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇంగ్లీష్ భాష ఆధునికతా వాహిక అనేది మన సమాజంలో ఒక అవ్యక్త విశ్వాసంగా ఉంది. ఇంగ్లీష్‌ను మేధో వికాసానికి ఆలంబనగా, మన భవిష్యత్తుకు అదొక అనివార్యసాధనంగా అసంఖ్యాకులు భావిస్తున్నారు. దేశీయభాషలను పిచ్చాపాటీకి మాత్రమే పనికివచ్చే భాషలుగా పరిగణిస్తున్నారు. ఇదొక సాంస్కృతిక దురభిప్రాయం. అంతేకాదు ఒక ఆధునిక మూఢ విశ్వాసం. కనుకనే ఎంటిఐని వదిలించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆరాట పడుతున్నారు. 


చాలా సమాజాలలో భాష ఒక వర్గపోరాట నెలవు. సాంస్కృతిక ఆధిపత్యాన్ని చెలాయించడానికి అత్యంత అనుకూల క్షేత్రం. భారత్ లాంటి వలసపాలనానంతర సమాజాలలో ఈ ధోరణి మరింత తీవ్రస్థాయిలో ఉంది. మనం భాషాపరమైన వివక్ష లేదా వెలిని పాటిస్తున్నాం. ఆంగ్లం అధికార శక్తుల భాష. భారతీయ భాషలతో దాని సంబంధం, జాతివివక్ష వ్యవస్థలో శ్వేతజాతీయేతరులతో శ్వేత జాతీయుల సంబంధానికి భిన్నమైనది కాదు. ఆంగ్లాన్ని నేర్చుకోవడం అంటే ఒక భాషను నేర్చుకోవడం కాదు. అధికారానికి అదొక పాస్‌పోర్ట్ లాంటిది. స్పోకెన్ ఇంగ్లీష్ వ్యాపార రంగం మా మేనల్లుడి లాంటి వారిని ఒక భ్రమకు లోను చేస్తోంది. తమ సంభావ్యశక్తిని వారు తమ బలహీనతగా పరిగణించేలా స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలు ప్రభావితం చేస్తున్నాయి. ఇదే మన అసలు విషాదం. క్వీన్స్ ఇంగ్లీష్‌ను క్షుణ్ణంగా, సమగ్రంగా నేర్చుకోవడం ద్వారా మానవ మేధోవికాసానికి మనం మన అత్యుత్తమ సేవలు అందించలేం. మన సృజనాత్మకత, ఉత్కృష్టతకు మాతృభాషా ప్రభావమే ఆలంబన అవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాలలోని ఎంటిఐ నుంచి స్వీకరించడం ద్వారా మాత్రమే ఇంగ్లీష్ ఆధునిక ఆలోచనా వాహిక అయింది. తనను తాను సర్వోత్కృష్ట పరచుకుంది. ఇతరుల ఆధునికత నుంచి నేర్చుకోవడం ద్వారా కాకుండా మన సొంతకాళ్ళపై నిలబడి ముందుకు చూడడం ద్వారా మాత్రమే మనం ఆధునికులుగా పురోగమించగలమని రామ్ మనోహర్ లోహియా మాటలను జ్ఞాపకముంచుకోవాలి. ఆయన ‘అంగ్రేజీ హటావో’ (ఇంగ్లీష్‌ను నిషేధించండి) ఉద్యమాన్ని నిర్వహించారు. ఇప్పుడు దానిని మనం అనుసరించనవసరంలేదు. మన కాలానికి యోగ్యమైన నినాదం ‘అంగ్రేజీ బద్లో’ (ఇంగ్లీష్‌ను పరివర్తించుట). ఆంగ్లభాషను భారతీయకరణ చేసుకోవాలి. భారతీయ భాషల నుంచి స్వీకరించే, నేర్చుకునే ఆంగ్లభాషను మనం అభివృద్ధిపరచుకోవాలి. అటువంటి భారతీయ ఇంగ్లీష్ మాత్రమే నిర్వీర్యమైపోకుండా మన మేధోశ్రేణులను రక్షించగలుగుతుంది. ఆంగ్ల భాషనూ అది కాపాడుతుంది. చాలా కాలంగా ఇంగ్లీష్ గౌరవప్రదమైన బయటి భాషగా ఉంది. ఎంటిఐని ఔదలదాల్చి, ఇంగ్లీష్‌ను మరో భాషగా చేసుకుని, గౌరవించాల్సిన సమయమాసన్నమయింది.


యోగేంద్ర యాదవ్

Updated Date - 2021-11-11T06:13:44+05:30 IST