నగదు బదిలీ సఫలమా విఫలమా?
ABN , First Publish Date - 2021-12-09T08:31:44+05:30 IST
దేశంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్– డీబీటీ) త్వరలోనే రూ.20లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రారంభమైన డీబీటీలు ఇప్పుడు...
దేశంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్– డీబీటీ) త్వరలోనే రూ.20లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రారంభమైన డీబీటీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ, దాదాపు అన్ని సంక్షేమ పథకాలకూ విస్తరించాయి. కోవిడ్ సమయంలో విధించిన లాక్‌డౌన్‌ల వల్ల ఉపాధి కోల్పోయిన కోట్లాదిమంది ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డీబీటీల ద్వారా లబ్ధి పొందారు. ఈ తరుణంలో పౌరులు, ప్రభుత్వ యంత్రాగాల దృష్టికోణంలో డీబీటీల అమలు తీరును చర్చిద్దాం. డీబీటీలు అంటే–డిజిటల్ గుర్తింపు ఆధారంగా అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం అనే అర్థంలో వాడుతున్నారు. నగదు డీబీటీకి ఉదాహరణగా కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే ‘గ్యాస్ సబ్సిడీ’ని పేర్కొనవచ్చు.
సంక్షేమ పథకాల డెలివరీలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా పంపిణీని వేగవంతం చేయడం, అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, నకిలీ లబ్ధిదారులను ఏరివేయడం లక్ష్యాలుగా డీబీటీలను కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2013న 43 జిల్లాలలో 7 సంక్షేమ పథకాలతో ప్రారంభించింది. తదుపరి దశలో 78 జిల్లాలలో స్కాలర్‌షిప్‌లు, స్త్రీ శిశు కార్మిక సంక్షేమానికి సంబంధించిన 27 పథకాలకు విస్తరించారు. డిసెంబర్ 2014లో ప్రారంభించిన మూడవ దశ డీబీటీలో 7 కొత్త స్కాలర్‌షిప్ పథకాలతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా చేరింది. ఈ దశలో ఎలక్ట్రానిక్ చెల్లింపు ఫ్రేమ్‌వర్కును రూపొందించి, అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకు, వ్యక్తిగత లబ్ధిదారులకు ప్రయోజనాల బదిలీ జరిగే అన్ని పథకాలకు వర్తింపజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56 మంత్రిత్వ శాఖల ద్వారా 420 సంక్షేమ పథకాల ప్రయోజనాలు డీబీటీల రూపంలో ప్రజలకు అందుతున్నాయి.
దేశంలో 43కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలకు జన్–ధన్ ఖాతాలు, 100కోట్ల ప్రజలకు ఆధార్, సుమారు 100కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. కాబట్టి అన్ని సంక్షేమ పథకాలలోను డీబీటీని అమలు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
సాంప్రదాయిక సంక్షేమ పథకాల డెలివరీలలో–లబ్ధిదారుల గుర్తింపు, నమోదు, ధ్రువీకరణ, సేవల పంపిణీ... ఇవన్నీ దిగువ స్థాయి అధికారులు చేస్తారు. పథకం ప్రయోజనాలను అందించే అధికారులు, లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారులు ఒకరే కావడం వలన అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం ఎక్కువ. ఇందుకు భిన్నంగా డీబీటీ పథకాలలో స్థానిక అధికారుల పాత్ర తక్కువ. దీనివల్ల అవినీతి తగ్గుతుందని, పథకాల ఫలాలు అర్హులకు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అలానే కోట్లాది మంది ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాలనుకున్న నగదును ఒక్క మీట వొత్తడంతో సాధించవచ్చు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గత సంవత్సరం 30 మార్చి నెలలో 2.2 కోట్ల లావాదేవీల ప్రయోజనాలు ప్రజలకు బదిలీ చేయగలిగింది. అలాగే పరిపాలనా దృష్టికోణంలో సాపేక్షంగా డీబీటీలు చౌకైనవి.
ఇదంతా నాణానికి ఒక వైపు చిత్రం మాత్రమే. పౌరుల దృష్టి కోణం నుంచి చూస్తే మనకు కనిపించే చిత్రం వేరు. డీబీటీలో అర్హత కలిగిన పౌరులు, లబ్ధిదారులు ఎంపిక స్థాయిలోనే పక్కకు నెట్టివేయబడుతున్నారు. దీనికి కారణం మన దేశంలో డేటా సేకరణ పద్ధతులు శాస్త్రీయంగా వుండకపోవడమే. లబ్ధిదారుల తలరాతను మార్చగలిగే పౌరుల సమాచారం సేకరించడం ప్రణాళికబద్ధంగా లేకపోవడం వలన అర్హత లేని వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో కనపడడం, అర్హత కలిగిన వారి పేర్లు గల్లంతు కావడం పరిపాటి అయ్యింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘మీ భూమి’ వెబ్‌సైట్‌లో తప్పుల వలన ఆదివాసీ ప్రాంతాల్లో పీఎంకిసాన్ పథకం లబ్ధిదారుల జాబితాలో అర్హత లేని వేలాదిమంది ఆదివాసేతర పేర్లు ఉన్నట్లు మా పరిశీలనలో తెలిసింది.
అలానే చాలా మటుకు డీబీటీలలో ముందుగానే నిర్ణయించిన అర్హతా ప్రమాణాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పేర్లను, ఆన్‌లైన్ డేటా బేసులతో పోల్చి చూస్తారు. తమ అర్హత నిరూపణకు పౌరులు చాలాసార్లు తమ సమయాన్ని, వనరుల్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. వేలి ముద్రలు పడకపోవడం లాంటి సమస్యల వలన అర్హత కలిగిన లబ్ధిదారులు సైతం ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా పథకం ద్వారా అక్టోబరు నెలలో జరిగిన నగదు బదిలీలో బయోమెట్రిక్ ధ్రువీకరణలో విఫలమైన రైతులకు అన్ని అర్హతలు ఉన్నా, రైతు భరోసా పథకంలో ప్రయోజనాలు నిరాకరించారు.
ఇక పైన పేర్కొన్న అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత చెందినా– ప్రభుత్వం నగదును బదిలీ చేసినా– బ్యాంకు స్థాయిలో సాంకేతిక సమస్యల వలన కొన్ని పేమెంట్లు ప్రజలకు అందడం లేదు. ఉదాహరణకు దేశవ్యాప్తంగా ఒక్క ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం’లో మాత్రమే ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా’ మాపింగ్ సమస్యల కారణంగా 375కోట్ల రూపాయలను తిరస్కరించామని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. ఐతే ఆ సంఖ్య కనీసం పది రెట్లు ఎక్కువగా ఉంటుందని మా అంచనా. అలాగే సాలీనా ‘మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’లో ప్రతి సంవత్సరం లక్షలాది కార్మికులు బ్యాంకు స్థాయి తిరస్కరణల పరిష్కారానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇన్ని గండాలు దాటి నగదు బ్యాంకు అకౌంటులో జమ ఐనంత మాత్రాన కష్టాలు తీరినట్లు కాదు. ఒరిస్సాలో ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు తమ వేతనాలు తీసుకోవడానికి సగటున రెండు మూడు రోజులు పాటు తమ పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, బ్యాంకు నుంచి 1000 రూపాయలు తీసుకోవడానికి 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని మా పరిశోధనలో తేలింది. ఇక ఆధార్ సంఖ్య, వేలి ముద్రల సహాయంతో నగదు తీసుకునే అవకాశం ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్ల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా మోసాలు జరుగుతున్నాయని ‘లిబ్టెక్ ఇండియా’ సంస్థ ఝార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాల్లో చేసిన పరిశోధన ద్వారా తేల్చింది.
స్థూలంగా చెప్పాలంటే డీబీటీలు ప్రభుత్వ పని సులభతరం చేసినా, పౌరులను పలు ఇక్కట్లకు గురి చేయడం మాత్రమే కాక, పౌరుల హక్కులకు కూడా భంగం కలిగిస్తున్నాయి. పథకాలలో లబ్ధిదారులని డిజిటల్‌గా ఎంపిక చేయడం ద్వారా పంచాయితీలకు, గ్రామ సభలకు గల అధికారాలకు గండిపడింది. ఇక డీబీటీలను నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖలు పథకాలకు సంబంధించిన అర్హతా ప్రమాణాలను, కుటుంబ డిజిటల్ సమాచారాన్ని ప్రజలతో పంచుకోవడం లేదు. డీబీటీలలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించే శక్తి ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే దిగువ స్థాయి అధికారులకు ఉండటం లేదు. డీబీటీ పథకాలలో ఆధార్ తప్పనిసరి కాదు. కానీ ఉద్దేశించిన లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకోవడంలో ఉపయోగకరం కాబట్టి ఆధార్‌కు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఐతే ప్రభుత్వం ఏమి చెప్పినా ప్రస్తుతం ఆధార్ లేకుండా డీబీటీల లబ్ధి పొందడం దాదాపు అసాధ్యం. ప్రజలలో ఆర్థిక అక్షరాస్యత లేమి, అవసరం ఐనన్ని బ్యాంకులు లేకపోవడం, ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడం వంటి అంశాలు పౌరులు డీబీటీ లను పొందడాన్ని మరింత జటిలం చేస్తున్నాయి.
ప్రభుత్వ వ్యవస్థలో సమర్థత పెంచడానికి, పారదర్శకతను నెలకొల్పడానికి, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి డీబీటీలు ఉపకరిస్తాయని ‘నీతి ఆయోగ్’ చెబుతుంది. మోదీ ప్రభుత్వ నినాదమైన ‘గరిష్ఠ పాలన–కనీస ప్రభుత్వం’ అన్నది డీబీటీల వల్లనే సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఎనిమిదేళ్ల డీబీటీల అనుభవం చెబుతున్న కథ దీనికి భిన్నంగా ఉంది. డీబీటీల రూపకల్పనలో నగదు బదిలీలు పొందుతున్న పౌరులను గ్రహీతలుగా మాత్రమే చూడకుండా వారి హక్కులను గౌరవించడం, వారి అనుభవాలను మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలా జరగనప్పుడు డీబీటీలు కేవలం ప్రభుత్వాలు తమ పరిపాలనా సౌలభ్యం కోసం తెచ్చిన సాంకేతిక ప్రయోగంగా మిగిలిపోతాయి.
చక్రధర్ బుద్ధ
వెంకట కృష్ణ కగ్గా