‘ఆత్మ’కు ఆదరణ కరువు

ABN , First Publish Date - 2021-08-13T04:12:11+05:30 IST

వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు ఉద్దేశిం చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకం ‘ఆత్మ’ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) క్రమంగా నిరాదరణకు గురవుతోంది. 2001లో ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు సంబం ధించిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో కేటాయి స్తాయి.

‘ఆత్మ’కు ఆదరణ కరువు
బ్రహ్మాస్త్రం తయారీపై క్షేత్రప్రదర్శన నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)

కాగితాల్లోనే బడ్జెట్‌ కేటాయింపులు

నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం

నూతన పద్ధతులపై రైతుల్లో అవగాహన లేమి

మూస పద్ధతిలోనే కొనసాగుతున్న వ్యవసాయం

మంచిర్యాల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు ఉద్దేశిం చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకం ‘ఆత్మ’ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) క్రమంగా నిరాదరణకు గురవుతోంది. 2001లో ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు సంబం ధించిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో కేటాయి స్తాయి. వ్యవసాయం, వెటర్నరీ, హార్టీకల్చర్‌, సెమీకల్చర్‌, ఫిషరీస్‌, మార్కె టింగ్‌, కేవీకే (కృషి విజ్ఞాన కేంద్రం) శాఖల పరంగా నూతన ఆవిష్కర ణలు, కొత్త సాగు పద్ధతులను రైతులకు వివరించి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు ‘ఆత్మ’ను రూపొందించారు. వ్యవసాయశాఖ కమిషనర్‌ నేతృత్వంలో జిల్లా పరిధిలో చైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనర్‌గా వ్యవసాయాధి కారి పర్యవేక్షణలో కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది. పథకంలో భాగంగా రైతులకు అవసరమైన శిక్షణ తరగతులు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలకు సంబంధించి జిల్లా, రాష్ట్ర, దేశవ్యాప్తంగా జరిగే వివిధ కార్యక్రమాలకు రైతులను తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇందుకు రైతుల  ఖర్చులను ప్రభుత్వపరంగా వెచ్చించాల్సి ఉంది. 

కాగితాలకే పరిమితమైన బడ్జెట్‌

ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో ‘ఆత్మ’ రైతులకు ఉపయోగపడకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు కేటాయించడంతో తరుచుగా కార్యక్రమాలు చేపట్టేవారు. ఐదు సంవత్స రాలుగా పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. యేటా బడ్జెట్‌ కేటాయిస్తు న్నట్లు కాగితాల్లో చూపించడమే తప్ప నిధులు విడుదల చేయడం లేదు. అసలు ఆత్మ పథకం అమలవుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో రైతాంగం ఉంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మూడు సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో బడ్జెట్‌ కేటాయించినప్పటికీ అందులో 10 శాతం నిధులు కూడా విడుదల చేయలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.48.61 లక్షల బడ్జెట్‌ కేటాయించగా అందులో కేవలం రూ.9 లక్షలు విడుదల య్యాయి. 2020-21లో రూ.34.95 లక్షలు కేటాయించగా రూ.5 లక్షలు, 2021-22లో రూ.42.54 కేటాయించగా ఇప్పటివరకు నయా పైసా విడుదల చేయలేదు.

మొక్కుబడిగా పర్యటనలు

ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదల చేయకపోవడంతో అధికా రులు మొక్కుబడిగా పర్యటనలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తొలిసారిగా 2018 మార్చి 16 నుంచి 18వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన ‘కృషి ఉన్నతి మేళా’కు జిల్లా నుంచి 8మంది రైతు లను పంపించారు. అనంతరం హైద్రాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయంలో 23 ఫిబ్రవరి 2020న జరిగిన ‘అగ్రిటెక్‌ ఎగ్జిబిషన్‌’కు  తప్ప ఇంతవరకు క్షేత్ర పర్యటనలు చేపట్టలేదు. జిల్లాస్థాయిలో చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రం తయారీ, తదితర కార్యక్రమాలు చేపడుతుండగా, చైతన్య సదస్సులు, వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వచ్చిన సాంకే తిక పరిజ్ఞానంపై శిక్షణ తరగతులు, సాగుకు సంబంధించిన ప్రదర్శనలు అందకపోవడంతో నేటికీ వ్యవసాయం మూస పద్ధతిలోనే కొనసాగుతోంది. 

పర్యటనలు చేపట్టడం లేదు

బుద్దె శ్రీనివాస్‌, రైతు, ఇటిక్యాల మంచిర్యాల జిల్లా

ఐదు సంవత్సరాలుగా ఎలాంటి పర్యటనలు చేపట్టడం లేదు. గతంలో అప్పుడప్పుడు ప్రదర్శనలకు తీసుకెళ్లేవారు. శిక్షణ తరగతులు, కొత్త పద్ధతులపై అవగాహన కల్పించడం లేదు. అధికారులను సంప్రదిస్తే కార్యక్రమాలు చేపట్టడం లేదని చెబుతున్నారు. 

నిధుల మేరకు నిర్వహిస్తున్నాం

వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి, మంచిర్యాల

ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల మేరకు ‘ఆత్మ’ కార్యక్రమాలను చేపడుతున్నాం. పథకంలోని అన్ని శాఖల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. బడ్జెట్‌ మేరకు నిధులు విడుదల చేస్తే రైతులకు మరింతగా ఉపయోగకరంగా ఉంటుంది.

Updated Date - 2021-08-13T04:12:11+05:30 IST