డబ్బులు కట్టించుకున్నారు.. డాక్యుమెంట్లు మరిచారు!
ABN , First Publish Date - 2022-02-12T06:28:09+05:30 IST
కరప, ఫిబ్రవరి 11: పక్క చిత్రంలో మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా తన ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందుకుంటున్న ఆమె పేరు పోలిశెట్టి ఏసుమణి. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద కరప చిరంజీవి కల్యాణ మండపంలో గతేడాది డిసెంబరు 22న ఆమెకు ఈ గృ

నెలలు గడుస్తున్నా జారీచేయని ఓటీఎస్ గృహహక్కు పత్రాలు
అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
కరప, ఫిబ్రవరి 11: పక్క చిత్రంలో మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా తన ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందుకుంటున్న ఆమె పేరు పోలిశెట్టి ఏసుమణి. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద కరప చిరంజీవి కల్యాణ మండపంలో గతేడాది డిసెంబరు 22న ఆమెకు ఈ గృహహక్కు పత్రాలు పంపిణీ చేశారు. రూ.10వేలకు అప్పు తీరడమే గాక తన ఇంటికి సర్వహక్కులు కలిగేలా జారీచేసిన డాక్యుమెంట్లను చూసుకుని ఏసుమణి ఎంతగానో మురిసిపోయింది. అయితే అధికారులు ఆమెకు ఆ ఆనందాన్ని ఎక్కువసేపు లేకుండా చేశారు. కార్యక్రమం ముగిసి మంత్రి వెళ్లినే వెంటనే సంతకాలు పూర్తికాలేదని చెప్పి ఆమె వద్ద నుంచి ఆ పత్రాలను వెనక్కి తీసేసుకున్నారు. ఇది జరిగి ఇప్పటికి దాదాపు రెండు నెలలు గడుస్తోంది. అయినా అధికారుల నుంచి స్పందన కరువవడంతో తన ఇంటి పత్రాల కోసం ఆమె ధీనంగా ఎదురుచూస్తుంది. ఆమెతో పాటు మండలవ్యాప్తంగా వందలాది మంది లబ్ధిదారులు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) కింద డబ్బులు కట్టి తమ ఇంటి డాక్యుమెంట్ల కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. ఇవేమీ పట్టించుకోని అధికారులు నిత్యం గ్రామాల్లో తిరుగుతూ ఓటీఎస్ స్కీమ్‌ను బలవంతంగా లబ్ధిదారులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క అధికారుల ఒత్తిడి తట్టుకోలేక, ఓటీఎస్ లక్ష్యాలను చేరుకోలేక కింది స్థాయి సిబ్బంది తీవ్ర అపసోపాలు పడుతున్నారు.
కరప మండలంలో...
కరప మండల వ్యాప్తంగా 9,873మంది జగనన్న సంపూర్ణ గృహహక్కు పఽథకం లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరిలో 3,436మంది రూ.91,27,678లను ఓటీఎస్ కింద చెల్లించారు. వీరందరికీ రుణ విముక్తి ధృవీకరణపత్రాలను జారీ చేసిన అధికారులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను మాత్రం అందజేయలేదు. అధికారుల బలవంతంతో అప్పులు చేసి మరీ సొమ్ములు చెల్లించామని, నెలలు గడుస్తున్నా గృహహక్కు పత్రాలను పంపిణీ చేయకపోవడం దారుణమని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పత్రాలు ఉంటే బ్యాంకులు రుణాలిస్తాయని, నిరభ్యంతరంగా క్రయ విక్రయాలు చేసుకోవచ్చని చెపితే డబ్బులు చెల్లించామని, అయితే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్న డాక్యుమెంట్లు ఇప్పటికీ తమ చేతికందలేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్లు అందజేయాలని పలువురు కోరుతున్నారు.