‘తూర్పు’లో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు చదువు

ABN , First Publish Date - 2022-09-12T06:33:58+05:30 IST

మాజీ ఎంపీ, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు తన బాల్యాన్ని కరప మండలం యండమూరులో గడిపిన విషయం వాస్తవానికి చాలామందికి తెలియదు. యండమూరు గ్రామంలోని చిన్నమ్మ ఇంట ఉంటూ దగ్గర్లోని పెద్దాపురప్పాడు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆయన 9, 10 తరగతులు చదువుకున్నారు.

‘తూర్పు’లో రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు చదువు
కృష్ణంరాజు చదువుకున్న బడి

పెద్దాపురప్పాడు(కరప), సెప్టెంబరు 11: మాజీ ఎంపీ, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు తన బాల్యాన్ని కరప మండలం యండమూరులో గడిపిన విషయం వాస్తవానికి చాలామందికి తెలియదు. యండమూరు గ్రామంలోని చిన్నమ్మ ఇంట ఉంటూ దగ్గర్లోని పెద్దాపురప్పాడు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆయన 9, 10 తరగతులు చదువుకున్నారు. కృష్ణంరాజు పశ్చిమగోదావరిజిల్లా మొగల్తూరులో సరిగా చదువుకోవడం లేదని ఆగ్రహించిన అతడి తల్లి లక్ష్మీదేవి అప్పట్లో కరప మండలం యండమూరులో ఉండే సోదరి కాకర్లపూడి సుభద్రాదేవి ఇంటికి పంపించేశారు. లక్ష్మీదేవి కోరిక మేరకు సోదరి సుభద్రాదేవి కృష్ణంరాజును సమీపంలోని పెద్దాపురప్పాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. కృష్ణంరాజు 1955, 56లలో అదే పాఠశాలలో 9వ తరగతి, ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుకున్నారు. కృష్ణంరాజు యండమూరులోని చిన్నమ్మ ఇంటినుంచి మురుగు కాలువ గట్టు వెంబడి నడుచుకుంటూ పెద్దాపురప్పాడు హైస్కూల్‌కు వెళ్లేవారని, అతడికి తన తండ్రి కాకర్లపూడి సోమసూర్యనారాయణరాజు తోడుగా ఉండేవారని వైజాగ్‌లో ఉంటున్న కాకర్లపూడి వెంకటసుబ్బరాజు తెలిపారు. పదో తరగతిలో తన తండ్రి ఇచ్చిన సైకిల్‌పై కృష్ణంరాజు హైస్కూల్‌కు వెళ్లే వారని, అప్పట్లో అదో వింతగా చూసేవారని గ్రామస్తులు తెలిపారు. ఒకసారి స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడుతుండగా బాషా అనే కుర్రోడు కృష్ణంరాజు వీపుపై బలంగా కొడితే ఐదు వేళ్లు తట్టుగా వచ్చేశాయని, అప్పుడు అతడి చిన్నాన్న కాకర్లపూడి వెంకటేశ్వరరాజు కోపంతో ఊగిపోగా ఆటల్లో అదంతా సహజమేనని కృష్ణంరాజు సర్దిచెప్పినట్లు గ్రామానికి చెందిన వాసంశెట్టి అప్పారావు తెలిపారు. తన సోదరుడు నాగూర్‌తో కృష్ణంరాజు సన్నిహితంగా మెలిగేవారని షేక్‌ మౌలానా అనే వ్యక్తి తెలిపారు. రాత్రి సమయాల్లో సినిమాలు చూడడానికి సైకిల్‌పై కాకినాడ వెళ్లేవారని, అలాగే ఎవరూ చూడకుండా పేకాట ఆడేవారని కృష్ణంరాజు జూనియర్‌ విద్యార్థి, వైజాగ్‌లో ఉంటున్న విశ్రాంత రైల్వే ఉద్యోగి మర్రెడ్డి పట్టాభిరామయ్య తెలిపారు. కృష్ణంరాజు కాకినాడ ఎంపీగా గెలిచిన తర్వాత గ్రామానికి తీసుకువచ్చి ఘనంగా సత్కరించినట్టు గ్రామస్థులు తెలిపారు. కృష్ణంరాజు, అతడి సోదరుడు, నటుడు ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణరాజు యండమూరులోని తమ ఇంట ఎంతో సరదాగా గడిపేవారని తన తల్లిదండ్రులు చెప్పినట్టు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న సుభద్రాదేవి కుమారుడు త్రినాథ్‌ తెలిపారు. కృష్ణంరాజు మృతితో కుటుంబసభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. అప్పట్లో కృష్ణంరాజు నివాసముండే ఇంటిని గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు చూసి అతడి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Updated Date - 2022-09-12T06:33:58+05:30 IST