Education Principal Secretary Praveen Prakash: నా మెనూ ఇదీ!

ABN , First Publish Date - 2022-12-07T03:40:27+05:30 IST

సారొస్తున్నారు. ఏ హడావిడీ చేయొద్దు. ప్రొటోకాల్‌ అంటూ సమయం వృథా చేయొద్దు’’... పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జిల్లాల పర్యటనపై ఆ శాఖ జారీ చేసిన ఆదేశాలివి.

Education Principal Secretary Praveen Prakash: నా మెనూ ఇదీ!

ఉదయం దోశ, ఇడ్లీ.. మధ్యాహ్నం పుల్కా, చపాతీ

మధ్యలో పార్లే, క్రాక్‌జాక్‌ బిస్కెట్లు, టీ

డ్రైఫ్రూట్లు, మాంసం, పళ్లు, జ్యూస్‌లు వద్దు

ప్రవీణ్‌ ప్రకాశ్‌ పర్యటనలపై ఆదేశాలు జారీ

పాఠశాల విద్యాశాఖ వర్గాల్లో విస్మయం

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘సారొస్తున్నారు. ఏ హడావిడీ చేయొద్దు. ప్రొటోకాల్‌ అంటూ సమయం వృథా చేయొద్దు’’... పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జిల్లాల పర్యటనపై ఆ శాఖ జారీ చేసిన ఆదేశాలివి. చూడటానికి ఎంత బాగుందో కదా! ఉన్నతాధికారి అయినా సింపుల్‌గా ఉంటాననడం గొప్ప విషయమే! అలా అనుకునేలోపే... ఆ ఉత్తర్వుల్లోనే ఆయనకు ఏ మెనూ ఉండాలో కూడా ఆ శాఖ సెలవిచ్చింది. మెనూ సింపుల్‌గానే కనిపిస్తున్నా... సారు ఏం తింటారు, ఏం తాగుతారు అనేదానిపై ఉత్తర్వులు ఇవ్వడం విద్యాశాఖ వర్గాలను నోరెళ్లబెట్టేలా చేసింది. కొత్తగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ వరుసగా పాఠశాలలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా ఆయన తినే ఆహారం, బస విషయాలపై దృష్టి పెట్టకుండా తనిఖీల్లో పాల్గొనాలని జిల్లాల అధికారులకు సూచిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఆయన రాత్రి బస చేస్తే మెనూ ఎలా ఉండాలో సూచించింది.

ఉదయం 6 గంటలకు: పార్లే/ క్రాక్‌జాక్‌ బిస్కెట్లలో ఏదో ఒక రకం, టీ.

ఉదయం 8 గంటలకు: ఇడ్లీ/ దోశ (ఉల్లి దోశ/ ప్లెయిన్‌ దోశ), చట్నీ.

మధ్యాహ్నం 1.30 గంటలకు: చపాతీ/ పుల్కా, వెజిటబుల్‌ కర్రీ.

సాయంత్రం 5గంటలకు: పార్లే/ క్రాక్‌జాక్‌ బిస్కెట్లలో ఏదో ఒక రకం, టీ

రాత్రి 8.30 గంటలకు.. పుల్కా/ చపాతీ, వెజిటబుల్‌ కర్రీ, ఒక గ్లాసు పాలు... ఇలా మెనూలో ఏమేం ఉండాలో స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. డ్రైఫ్రూట్లు, మాంసం, పళ్లు, జ్యూస్‌లు ఏవీ వద్దని అందులో స్పష్టం చేసింది. ఆహారం విషయంలో గతంలో ఏ అధికారీ ఇలా మెనూ జారీ చేసిన దాఖలాలు లేవని, తొలిసారి ఇలాంటి ఉత్తర్వులు చూస్తున్నామని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హడావిడి వద్దనుకున్నప్పుడు ఇలా మెనూ ఇవ్వడమెందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated Date - 2022-12-07T09:20:19+05:30 IST