రంగా పేరుతో రాజకీయాలొద్దు!
ABN , First Publish Date - 2022-12-27T01:24:55+05:30 IST
అణగారిన వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు పోరాటాలు చేసిన వంగవీటి మోహనరంగా పేరును కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి చూడటం దురదృష్టకరమని మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు.

వాడవాడలా రంగా 34వ వర్థంతి
గవర్నర్‌పేట, డిసెంబరు 26 : అణగారిన వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు పోరాటాలు చేసిన వంగవీటి మోహనరంగా పేరును కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి చూడటం దురదృష్టకరమని మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా 34వ వర్థంతిని పురస్కరించుకుని సోమవారం వాడవాడలా ఆయనకు నివాళి కార్యక్రమాలు జరిగాయి. మహాత్మాగాంధీ రోడ్డులోని నిర్మల్ హృదయ్ భవన్ వద్ద ఉన్న వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద అభిమానులు, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు నివాళి కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జనసేన రాష్ట్ర కార్యదర్శి పోతిన వెంకట మహేశ్‌లతో కార్యక్రమానికి హాజరైన వంగవీటి రాధాకృష్ణ పూజా కార్యక్రమం నిర్వహించి, రంగా విగ్రహానికి గజమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగా ఆశయ సాధనకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అన్ని పార్టీల్లోనూ రంగా అభిమానులు ఉన్నారని, రంగా ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదన్నారు. అనంతరం బీసెంట్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.