‘గొట్టా’ గోడు వినేదెవరు?

ABN , First Publish Date - 2022-04-18T05:38:29+05:30 IST

గొట్టా బ్యారేజీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రధాన విభాగాలు దెబ్బతిన్నాయి. బ్యారేజీ దిగువ భాగంలో నీటి ప్రవాహ దిశను మార్చేందుకు జడ్జి స్టోన్‌ ఏఫ్రాన్‌ (రాతి కట్టుడు) అస్తవ్యస్తంగా మారింది. కొన్నేళ్ల కిందట వరదలకు రాళ్లు కొట్టుకుపోయాయి.

‘గొట్టా’ గోడు వినేదెవరు?
బ్యారేజీ దిగువన అస్తవ్యస్తంగా ఎఫ్రాన్‌ (రాతికట్టు)

దయనీయ స్థితిలో గొట్టా బ్యారేజీ

నిర్వహణ లేదు.. సిబ్బంది లేరు

దెబ్బతిన గేట్లు, హెడ్‌ రెగ్యులేటర్లు

ఆధునీకరణకు నోచుకోని  కుడి, ఎడమ ప్రధాన కాలువలు 

శివారు ఆయకట్టుకు అందని నీరు

ఏటా ఖరీఫ్‌, రబీలో రైతులకు తప్పని ఇబ్బందులు

(హిరమండలం/టెక్కలి)

జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న అపర భగీరధి గొట్టా బ్యారేజీ. లక్షలాది ఎకరాల సాగుకు నీరందిస్తున్న ప్రాజెక్టు ఇది. దశాబ్దాల కిందట నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. కనీస నిర్వహణ లేక కొట్టుమిట్టాడుతోంది.  అధికారులు, సిబ్బంది లేక సతమతమవుతోంది. ప్రాజెక్టు భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. దీనికి అనుసంధానంగా సుమారు రూ.1,750 కోట్లతో వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేపడుతున్నా.. బ్యారేజీ బాగోగులను ప్రభుత్వం గాలికొదిలేయడం విమర్శలకు తావిస్తోంది. అటు కుడి, ఎడమ ప్రధాన కాలువలు సైతం దయనీయ స్థితిలో ఉన్నాయి. శివారు ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. 

గొట్టా బ్యారేజీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రధాన విభాగాలు దెబ్బతిన్నాయి. బ్యారేజీ దిగువ భాగంలో నీటి ప్రవాహ దిశను మార్చేందుకు జడ్జి స్టోన్‌ ఏఫ్రాన్‌ (రాతి కట్టుడు) అస్తవ్యస్తంగా మారింది. కొన్నేళ్ల కిందట వరదలకు రాళ్లు కొట్టుకుపోయాయి. ఏళ్లు గడుస్తున్నా వీటిని సరిచేసే ప్రయత్నం చేయలేదు. అసలు నిధులే మంజూరు కాలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.8.5 కోట్లు మంజూరయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు సైతం ప్రారంభించారు. కానీ ఇంతలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. 25 శాతంలోపు పనులు జరిగిన ప్రాజెక్టు పనులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గొట్టా బ్యారేజీ పనులు అసంతపూర్తిగా నిలిపివేశారు. అటు తరువాత ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం రాతి కట్టుడు పనులు చేయకపోతే.. భారీ వరదల సమయంలో బ్యారేజీకి ముప్పు తప్పదని ఇంజనీరింగ్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

నాలుగేళ్లుగా మరమ్మతులు లేని గేట్లు

బ్యారేజీకి 24 గేట్లతో పాటు కుడి, ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి హెడ్‌ రెగ్యులేటరీ గేట్లు ఉన్నాయి. గత ఐదేళ్లుగా కనీస మరమ్మతులు లేక చాలావరకూ పాడయ్యాయి. లీకులకు గురయ్యాయి. నీరు వృథాగా పోతోంది. చివరిసారిగా టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో గేట్లకు మరమ్మతులు చేశారు. తరువాత నిర్వహణ ఊసే మరిచిపోయారు. ఏటా ఖరీఫ్‌, రబీకి నీరు విడిచిపెట్టే సమయంలో కొద్దిపాటి మరమ్మతు పనులు చేస్తున్నారు.గేట్లకు రంగులు వేసి చేతులు దులుపుకుంటున్నారు. గేట్లకు సంబంధించి బేరింగులు, రోలర్లు పాడవ్వడంతో ఎత్తీ దించే సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బంది కష్టపడాల్సి వస్తోంది. 

 పేరుకుపోయిన మట్టి, పూడిక

బ్యారేజీ గట్లు సైతం ప్రమాదకరంగా మారాయి. గర్భంలో మట్టి, పూడిక పేరుకుపోయింది. దీంతో నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వేసవిలో బ్యారేజీలో డెడ్‌ స్టోరేజీకి నీరు చేరుకుంటుంది. ఆ సమయంలో వంశధార ఇన్‌ఫ్లో కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. ఈ సమయంలో బ్యారేజీలో మట్టి, పూడిక తీయడానికి అవకాశముంటుంది. మరోవైపు నదీ పరీవాహక గ్రామాలైన దుర్భలాపురం, గులుమూరుల వద్ద గట్లు బలోపేతం చేయాల్సిన అవసరముంది. బ్యారేజీలో మట్టి తొలగింపు ద్వారా అటు గట్లు కూడా బలోపేతం చేయవచ్చు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వంశధార అధికారులను అడుగుతుంటే ప్రతిపాదనలు పంపినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోతే ఏంచేస్తామని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

తాత్కాలిక మరమ్మతులతో సరి

ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1,48,000 ఎకరాలకు సాగునీరందుతోంది. హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వరకూ 104 కిలోమీటర్ల మేర కాలువ విస్తరించింది. హిరమండలం, జలుమూరు, సారవకోట, పోలాకి, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, మెళియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు, మండలాల మీదుగా కాలువ ప్రవహిస్తోంది. నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన కాలువ పూర్తిస్థాయిలో నిర్వహణ లేకపోవడంతో దయనీయ స్థితిలోకి మారింది. అడపాదడపా తాత్కాలిక మరమ్మతులే తప్ప శాశ్వతమైన పనులకు నోచుకోలేదు. దీంతో ఖరీఫ్‌, రబీలో శివారు ఆయకట్టుకు నీరందడం లేదు. రైతులు నీటి కోసం పడిగాపులు కాయాల్సిందే. కాలువ గట్లు మొదలుకొని యూటీలు, సర్‌ప్లస్‌ వైర్లు, రివిటింగ్‌లు, షట్టర్లు పాడయ్యాయి. సాధారణంగా గొట్టా బ్యారేజీ ఎడమ ప్రధాన కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద 2,480 క్యూసెక్కులు నీటిని విడిచిపెడతారు. అయితే కాలువల అస్తవ్యస్త పరిస్థితుల నేపథ్యంలో శివారు ఆయకట్టు వద్దకు వచ్చేసరికి కనీసం 200 క్యూసెక్కుల నీరు అయినా రాని దుస్థితి నెలకొంది. చాలాచోట్ల కాలువల్లో మట్టి, పూడిక పేరుకుపోయింది. గుర్రపు డెక్క ఆవహించింది. దీంతో నీటి ప్రవాహానికి అడ్డంగా మారుతోంది. వర్షాకాలంలో గట్లు గండి పడడానికి కారణమవుతున్నాయి. 

- కుడి ప్రధాన కాలువదీ అదే పరిస్థితి. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాలకు సంబంధించి 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోక శివారు ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి. అధికారులు తూతూమంత్రపు మరమ్మతు పనులకే పరిమితమవుతుండడంతో శివారు ఆయకట్టుకు సాగునీరు గగనంగా మారుతోంది. 

ప్రతిపాదనలకు కొర్రీలు

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ డాక్టర్‌ కిల్లి కృపారాని వంశధార కాలువల సమస్యను అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పటి ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ ఐఎస్‌ఎన్‌ రాజు కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతిపాదనల ఫైల్‌ ఆరుసార్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం రకరకాల కొర్రీలతో వెనక్కి రావడం పరిపాటిగా మారిపోయింది. తొలిసారిగా రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.   రెండోసారి రూ.246 కోట్లు, మూడోసారి రూ.420 కోట్లు, నాలుగోసారి రూ.580 కోట్లు, ఐదోసారి రూ.630 కోట్లు, చివరగా ఏడోసారి 2020-21 సంవత్సరానికి గాను రూ.831.95 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం కనికరించడం లేదు. కనీస స్థాయిలో నిధులు మంజూరు చేయడం లేదు. దీనిపై ఈఈ శ్రీకాంత్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. 

 ప్రత్యేకంగా దృష్టి

గొట్టా బ్యారేజీ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. త్వరలో సిబ్బంది నియామకం చేపడతాం. ఎఫ్రాన్‌ (రాతి కట్టు) నిర్మాణానికి సంబంధించి రూ.12 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన సాధారణ నిధుల కోసం విన్నవించాం. త్వరలో మంజూరవుతాయని ఆశాభావంతో ఉన్నాం. 

- డోల తిరుమలరావు, ఎస్‌ఈ, వంశధార 


 సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం  

 రెవెన్యూ శాఖ మంత్రి ప్రసాదరావు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 17: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశించా రు. పెదపాడులోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం అధికారులతో నిర్వ హించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో రెండు జీవనదులు ప్రవహి స్తున్నాయని, ఆ నీటిని ఉపయోగించుకుంటే జిల్లా పూర్తిగా సస్యశ్యామలం అవుతుందన్నారు. వంశధార ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు సుమారు రూ.2వేల కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. ఒడిశాతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో హిరమండలం రిజర్వాయర్‌ వద్ద రూ.300 కోట్ల వ్యయంతో లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తే 19.5 టీఎంసీల నీటిని నింపగలమన్నారు. ఇందుకోసం నేరడి వద్ద బ్యారేజీ కట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో ఉన్న 200 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిఉందన్నారు. కార్యక్రమంలో వంశధార ఎస్‌ఈ డోల తిరు మలరావు, బొబ్బిలి ఎస్‌ఈ రాంబాబు, డిప్యూటీ ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈలు మన్మథరావు ప్రదీప్‌కుమార్‌, డిప్యూటీ ఈఈ స్వర్ణకుమార్‌, డీఈ లావణ్య తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-04-18T05:38:29+05:30 IST