‘పూర్ణ స్వరాజ్’ వైతాళికుడు
ABN , First Publish Date - 2022-07-15T10:32:59+05:30 IST
విస్మృత స్వాతంత్ర్యోద్యమ నిర్మాతలలో మౌలానా హస్రత్ మొహానీ (1875–1951) ఒకరు. మత సామరస్యం, కర్షక–కార్మిక శ్రేయస్సు, ప్రజాస్వామిక విలువల వికాసానికి జీవిత పర్యంతం...

విస్మృత స్వాతంత్ర్యోద్యమ నిర్మాతలలో మౌలానా హస్రత్ మొహానీ (1875–1951) ఒకరు. మత సామరస్యం, కర్షక–కార్మిక శ్రేయస్సు, ప్రజాస్వామిక విలువల వికాసానికి జీవిత పర్యంతం కృషి చేసిన మహోదాత్తుడు మొహానీ. రాజ్యాంగ సభలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన వాదనలు వర్తమాన భారతీయ రాజకీయ సమస్యల పరిష్కారానికీ ఉపయుక్తమైనవి.
భారత రాజ్యాంగ సభ. నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించే శుభ సందర్భంలో సభ ఉంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం పట్ల ఒకే ఒక్క సభ్యుడు అసమ్మతి వ్యక్తం చేశాడు. ఆ మౌలిక శాసనపత్రాన్ని ఆమోదించేందుకు నిరాకరించాడు. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆ సభ్యుని డెస్క్ వద్దకు వెళ్ళి మీ అసమ్మతి చరిత్రలో భాగమవుతుంది సుమా అని హెచ్చరించారు. అందుకు ఆ సభ్యుడు సవినయంగా ప్రతి స్పందిస్తూ ‘ప్రతిపాదిత రాజ్యాంగం భారతీయ ముస్లింలకు న్యాయం చేయనందుకు కనీసం ఒక్కరన్నా అసమ్మతి తెలిపారనే విషయం చరిత్రలో నమోదవ్వాలన్నదే తన మనోరథమని’ అన్నాడు. ఆ సభ్యుడు మౌలానా హస్రత్ మొహానిగా సుప్రసిద్ధుడైన సయద్ ఫజ్లుల్ హసన్.
కవి– స్వాతంత్ర్య సమరయోధుడు అయిన మొహాని 1921లోనే సంపూర్ణ స్వాతంత్ర్యమే లక్ష్యం కావాలని ప్రప్రథమంగా ఉద్ఘోషించిన దేశ భక్తుడు. అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వార్షిక మహాసభలో మొహానీ చేసిన సంపూర్ణ స్వాతంత్ర్య ప్రతిపాదనను మహాత్మాగాంధీ వ్యతిరేకించారు. అయితే యువ నాయకులు జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోస్‌లు కాంగ్రెస్ వ్యవహారాలను ప్రభావితం చేయడం ప్రారంభమైన తరువాత సంపూర్ణ స్వాతంత్ర్య డిమాండ్‌కు పరిస్థితులు సానుకూలమయ్యాయి. అదే అంతిమంగా 1929లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన లాహోర్ కాంగ్రెస్‌లో పూర్ణస్వరాజ్ తీర్మానంగా ప్రతిఫలించింది. ఆ తీర్మానం స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక మైలురాయి.
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్థిల్లాలి) అనే సుప్రసిద్ధ నినాదాన్ని సృష్టించిందికూడా మొహానీయే. 1921లోనే ఆయన ఇచ్చిన ఈ నినాదానికి సర్దార్ భగత్ సింగ్ తన రచనలు, ప్రసంగాల ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించాడు. ఆయన నేతృత్వంలోని ‘హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్’ అధికారిక నినాదమయింది. ఢిల్లీలోని కేంద్ర శాసనసభలో బాంబులు వేసిన అనంతరం భగత్ సింగ్, ఆయన సహచరుడు బటుకేశ్వర్‌దత్‌లు ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించడంతో ఆ చైతన్య మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలకు సుపరిచితమయింది. ఉర్దూ సాహిత్యనికి మొహానీ ప్రశస్త సేవలు అందించారు. నిజానికి మొహానీని మొట్టమొదటి అభ్యుదయ కవిగా గౌరవించాల్సి ఉందని ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ అభిప్రాయపడ్డారు. మొహానీ రాసిన వివిధ గజల్స్‌ను పలువురు గాయకులు ఇప్పటికీ గానం చేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్‌లో బాలగంగాధర్ తిలక్ అనుయాయిగా ఉన్న మొహానీ తదనంతర కాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్నారు. 1925 డిసెంబర్‌లో కాన్పూర్‌లో జరిగిన అఖిల భారత కమ్యూనిస్టుల మహాసభ ఆహ్వానసంఘ అధ్యక్షుడుగా ఉన్న మొహాని స్వతంత్ర భారతదేశానికి సోవియట్ తరహా రాజ్యాంగం ఉండాలని ప్రతిపాదించారు. ముస్లింలీగ్‌లో కూడా పనిచేసిన మొహానీ, హిందువులు, ముస్లింలు భిన్న జాతులవారని జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. దేశ విభజన నిర్ణయాన్ని ఆయన అంగీకరించలేదు. పాకిస్థాన్‌కు వెళ్లిపోయే ఆలోచన కూడా ఆయన చేయలేదు. భారత్‌లో స్థిరపడి ముస్లింలతో సహా మైనారిటీల హక్కులను రక్షించేందుకు కృషి చేశారు. హజ్ యాత్రలను ఎంత నిష్ఠగా చేసేవారో అంతే నిష్ఠగా ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజున మథురను సందర్శించేవారు. ‘కృష్ణుడిని ప్రేమించే మౌలానా’గా ప్రజలు ఆయన్ని గుర్తు చేసుకుంటారు.