Uddhav Thackeray: గుర్తు ఎత్తుకెళ్లినా కాగడా వెలిగింది..
ABN , First Publish Date - 2022-11-06T19:53:49+05:30 IST
ముంబై: తూర్పు అంథేరి శానససభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన అభ్యర్థి రుతుజ లట్కే 66,530 ఓట్ల ఆధిక్యంపై గెలుపొందడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ''మా పోరాటానికి ఇది తొలివిజయం'' అని..
ముంబై: తూర్పు అంథేరి శానససభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన అభ్యర్థి రుతుజ లట్కే (Rutuja Latke) 66,530 ఓట్ల ఆధిక్యంపై గెలుపొందడంతో ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) హర్షం వ్యక్తం చేశారు. ''మా పోరాటానికి ఇది తొలివిజయం'' అని అన్నారు. తమ పార్టీ పేరు, గుర్తు దక్కకుండా చేసినా కాగడా (పార్టీ కొత్త గుర్తు) వెలిగిందని, కాషాయ పతాకాన్ని (బీజేపీ గుర్తు) ఎగురకుండా చేసిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే తరహాలో తమ పార్టీ విజయాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అంథేరి విజయం కార్యకర్తల విజయమని, కాంగ్రెస్, ఎన్‌సీపీ, కమ్యూనిస్టు పార్టీ, వంచిత్ బహుజన్ అఘాడి, సంభాజి బ్రిగేట్, ఇతరులు తమకు పూర్తి సహకారం అందించారని ఉద్ధవ్ అన్నారు. బీజేపీ పోటీ చేయడం వల్లే నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయని చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావచ్చని ఇటీవల చేసిన ప్రకటనపై ప్రశ్నించినప్పుడు, మహారాష్ట్రలో 2 లక్షల కోట్ల పెట్టుబడులను కేంద్రం ప్రకటించడంతో మధ్యంతర ఎన్నికల వస్తాయనే అంచనాకు వచ్చినట్టు ఆయన సమాధానమిచ్చారు. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రకు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్‌కు పట్టుకువెళ్లారని, ఆ తర్వాతే మహారాష్ట్ర ప్రకటన వచ్చిందని అన్నారు.
గెలుపు మావల్లే: బీజేపీ
కాగా, బీజేపీ సపోర్ట్ కారణంగానే రుతుజ లట్కే గెలుపొందారని ఆ పార్టీ ముంబై విభాగం అధ్యక్షుడు ఆశిష్ షెలార్ అన్నారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, కమ్యూనిస్టులు, డజను ఇతర పార్టీలు శివసేన (యూబీటీ)కు మద్దతిచ్చినా ఓటింగ్ శాతం కానీ ఓట్లు కానీ పెరగలేదన్నారు. బీజేపీ పోటీ చేసి ఉంటే గెలుపు తమకే దక్కేదని చెప్పారు.