Criticism of Collegium : కొలీజియంపై విమర్శలు... సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందన...

ABN , First Publish Date - 2022-11-09T16:00:46+05:30 IST

న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) చేస్తున్న విమర్శలపై

Criticism of Collegium : కొలీజియంపై విమర్శలు... సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందన...
CJI Justice DY Chandrachud

న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) చేస్తున్న విమర్శలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) స్పందించారు. కొలీజియం విధానం పారదర్శకంగా లేదని, జవాబుదారీతనంతో లేదని వస్తున్న విమర్శలను సానుకూల దృక్పథంతో పరిశీలించాలని, ఈ విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అన్నారు.

సీజేఐగా ప్రమాణ స్వీకారం

జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత దేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించారు. సీజేఐగా ఆయన పదవీ కాలం 2024 నవంబరు 10 వరకు ఉంటుంది. జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌కు వారసునిగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు.

కిరణ్ రిజిజు విమర్శలు

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం పారదర్శకంగా లేదని, జవాబుదారీతనం కొరవడిందని ఆయన విమర్శిస్తున్నారు. ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ప్రభుత్వం సృష్టించే వరకు ప్రస్తుత విధానంతోనే కొనసాగవలసి ఉంటుందన్నారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను న్యాయ వ్యవస్థను కానీ, న్యాయమూర్తులను కానీ విమర్శించడం లేదన్నారు. అయితే తాను సామాన్య భారతీయుల ఆలోచనలను ప్రతిబింబిస్తూ వాస్తవాన్ని వెల్లడించానని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా ఇదే విషయాన్ని విశ్వసిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా న్యాయమూర్తులు నూతన న్యాయమూర్తులను నియమించరని తెలిపారు. కానీ భారత దేశంలో అలా జరుగుతుందన్నారు. నూతన న్యాయమూర్తుల నియామకం కోసం పేర్లను సిఫారసు చేయడానికి న్యాయమూర్తులు చాలా సమయాన్ని వెచ్చించవలసి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియలో చాలా రాజకీయాలు ఇమిడి ఉంటాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలోని న్యాయమూర్తులు చాలా ఎక్కువ పని చేస్తున్నారని, వారికి విరామం అవసరమని చెప్పారు. వారు కూడా మానవమాత్రులేనన్నారు. న్యాయమూర్తులు చేయవలసిన పనిని చేయాలన్నారు. తాను మాట్లాడిన కొన్ని పదాలు పరుషంగా ఉండి ఉండవచ్చునని, అయితే తాను చెప్పిన మాటలు తప్పు అని ఇంత వరకు కనీసం ఒక న్యాయమూర్తి అయినా చెప్పలేదన్నారు.

సానుకూల దృక్పథంతో చూడాలి

ఈ నేపథ్యంలో ఓ పత్రికకు జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొలీజియం వ్యవస్థపై విమర్శలను సానుకూల దృక్పథంతో పరిశీలించాలని చెప్పారు. దానిని మరింత మెరుగుపరచడానికి కృషి చేయాలన్నారు. ఆ వ్యవస్థలోనే మనం పని చేస్తున్నామని, అదే సమయంలో, తాను ఎటువంటి లోపాలు లేకుండా, ఆదర్శవంతంగా ఉన్నట్లు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక దేశాల్లోని ఏ వ్యవస్థా చెప్పుకోజాలదని, అందువల్ల కొలీజియం వ్యవస్థలో మనం మెరుగుపరచదగిన అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు. కాబట్టి ఇది నిరంతరం పరివర్తన చెందే ప్రక్రియ అని తాను భావిస్తున్నానని చెప్పారు.

కొలీజియం కార్యకలాపాలు పారదర్శకంగా లేవనే విమర్శలపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ, న్యాయమూర్తుల నియామకం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని అనుకోవడంలో ఔచిత్యం ఉందని, దీనిలో ప్రజాప్రయోజనం కూడా ఉందన్నారు. ఇది సమర్థించదగినదేనన్నారు. అయితే న్యాయమూర్తుల నియామకం కోసం పరిశీలనలో ఉండే హైకోర్టుల న్యాయమూర్తులు, బార్ సభ్యుల వ్యక్తిగత గోప్యతను కూడా కాపాడవలసిన అవసరం ఉందని తెలిపారు.

కొలీజియంలో జరిగే చర్చలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ బయటకు చెప్పడం, ప్రజల తనిఖీకి పెట్టడం మొదలుపెడితే, వచ్చే నికర ఫలితం ఏమిటంటే, న్యాయమూర్తి పదవిని ఇవ్వజూపినపుడు చాలా మంది సమర్థులు దానిని స్వీకరించడానికి ఆసక్తి చూపబోరని, దానిని కోరుకోరని తెలిపారు. వ్యవస్థ ప్రయోజనాలకు లేదా అవసరాలకు వాస్తవంగా సంబంధం లేని తనిఖీ స్థాయికి అత్యంత వ్యక్తిగత జీవితాలను వెల్లడించవలసి వస్తుందనే భావం కలుగుతుందన్నారు.

తీర్పుల్లో రాసే మాటలు, న్యాయమూర్తులుగా పనితీరు మాత్రమే లెక్కలోకి వస్తాయని తాను నమ్ముతానని చెప్పారు. విమర్శలతో వ్యవహరించవలసిన ఉత్తమమైన మార్గం ఏమిటంటే, కొలీజియం పని తీరుపై వచ్చే వైవిద్ధ్యభరితమైన విశ్లేషణల పట్ల మరింత ఓర్పుతో కూడిన పద్ధతిలో పని చేయడమేనని చెప్పారు. కొన్ని విమర్శలు సంపూర్ణంగా సమర్థనీయం కాకపోవచ్చునని, మరికొన్ని విమర్శలు మన విధానాలను ఏవిధంగా మెరుగుపరచుకోవచ్చునో పరిశీలించుకోవడాన్ని ప్రోత్సహించవచ్చునని చెప్పారు. దీనిని తాము చేస్తామన్నారు. అయితే మార్పు అనేది క్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్లుగా జరుగుతుందన్నారు. స్థిరత్వాన్ని, కచ్చితత్వాన్ని, ప్రతి ఒక్కరికీ మెరుగైన ఫలితాలను ఇచ్చే విధంగా ఈ మార్పు జరుగుతుందని తెలిపారు.

Updated Date - 2022-11-09T16:04:36+05:30 IST