BF.7 : భారత్‌లో కరోనా బీఎఫ్‌.7

ABN , First Publish Date - 2022-12-22T03:29:54+05:30 IST

చైనా సహా.. పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా బీఎఫ్‌.7 వేరియంట్‌ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్‌(బీఎ్‌ఫ.5)కు సబ్‌-వేరియంట్‌ అయిన బీఎఫ్‌.7 అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.

BF.7 : భారత్‌లో కరోనా బీఎఫ్‌.7

గుజరాత్‌లో ఇద్దరు, ఒడిసాలో ఒకరిలో గుర్తింపు

అక్టోబరులోనే కనుగొన్న ‘బయోటెక్నాలజీ రీసెర్చ్‌’

ఈ వేరియంట్‌ వ్యాప్తి వేగం.. జ్వరం, జలుబు

చైనాలో ఉధృతికి బీఎఫ్‌.7 వేరియంటే కారణం

భారత్‌లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

మనకు ‘హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ’ ఉంది: నిపుణులు

విమానాశ్రయాల్లో మళ్లీ ర్యాండమ్‌ పరీక్షలు

బీఎఫ్‌.7 వార్తలతో స్టాక్‌ మార్కెట్‌ పతనం

జోడో యాత్ర ఆపండి.. రాహుల్‌కు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ, డిసెంబరు 21: చైనా సహా.. పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా బీఎఫ్‌.7 వేరియంట్‌ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్‌(బీఎ్‌ఫ.5)కు సబ్‌-వేరియంట్‌ అయిన బీఎఫ్‌.7 అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో మూడు బీఎఫ్‌.7 కేసులు వెలుగు చూడగా.. బాధితులు హోంఐసోలేషన్‌లోనే కోలుకున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే చైనీయుల విషయంలో ఇది కొంత ప్రమాదకారిగానే కనిపించినా.. ‘హైబ్రీడ్‌ ఇమ్యూనిటీ’ ఉన్న భారతీయులకు ఈ వేరియంట్‌ ఏమంత పెద్ద ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే.. బుధవారం బీఎఫ్‌.7 వార్తల ప్రభావం స్టాక్‌మార్కెట్‌పై తీవ్రంగా పడింది. సెన్సెక్స్‌ 635 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు పడిపోయాయి.

చైనాలో వెలుగు చూసిన వెంటనే..

చైనాలోని బీజింగ్‌లో అక్టోబరు నెలలో బీఎఫ్‌.7 వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గుజరాత్‌లోని ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ ఉన్నట్లు ‘బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌’ గుర్తించింది. గుజరాత్‌లోనే మరో వ్యక్తికి, ఒడిసాలో ఇంకో వ్యక్తికి బీఎఫ్‌.7 సోకినట్లు తేలినా.. ఆ ముగ్గురూ హోంఐసోలేషన్‌లోనే కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘‘రెండు నెలల క్రితమే కొత్త వేరియంట్‌ వెలుగుచూసినా.. కేసుల పెరుగుదలపై ప్రభావం చూపలేదు. ఇదంత ప్రమాదకారి కాదు. కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది’’ అని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కూడా బీఎఫ్‌.7 భారత్‌లో వెలుగు చూసినా.. కేసుల పెరుగుదల లేదని వివరించారు. ప్రపంచ నిపుణులు కూడా ఒమిక్రాన్‌ సోకిన వారికి అంతకు మునుపటి వేరియంట్లు ఆల్ఫా, బీటాలను తట్టుకునే రోగనిధోక శక్తి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ సబ్‌-వేరియంట్‌ అయిన బీఎ్‌ఫ.7తో ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. చైనాలో పౌరులను చాలాకాలం లాక్‌డౌన్లలో పెట్టారని, ఒక్కసారిగా అన్‌లాక్‌ అవ్వడంతో వైర్‌సకు త్వరగా ఎక్స్‌పోజ్‌ అవుతున్నారని, అక్కడి వ్యాక్సిన్లు అంత సమర్థవంతమైనవి కాదనే వాదనలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. అందుకే చైనాలో బీఎఫ్‌.7 వేగంగా విస్తరిస్తున్నా.. మన దగ్గర దాని ప్రభావం అంతగా లేదని చెబుతున్నారు. కాగా.. దేశంలో కేసుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేదని, బుధవారం ఉదయం(గడిచిన 24 గంటల్లో) 129 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

బీఎఫ్‌.7 లక్షణాలేంటి?

ఒమిక్రాన్‌ సబ్‌-వేరియంటే బీఎఫ్‌.7. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్‌ ఆర్వో(ఆర్‌ నాట్‌) 10 నుంచి 18.6గా ఉంది. అంటే.. ఒకరికి ఈ వేరియంట్‌ సోకితే.. వారి నుంచి కనిష్ఠం సగటు 10 నుంచి గరిష్ఠం సగటు 18.6 మందికి వ్యాప్తిచెందుతుంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్‌ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతి కొద్ది కేసుల్లో వాంతులు, డయేరియా వంటి పొట్ట సంబంధ వ్యాధులు బయటపడవచ్చన్నారు.

మాస్కులు ధరించండి

చైనా, అర్జెంటీనా, అమెరికా, సూడాన్‌, కాంగో, జపాన్‌తోపాటు.. పలు ఐరోపా దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం.. బీఎఫ్‌.7 వేరియంట్‌ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కోరారు. ప్రతి వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.

జోడో యాత్రను ఆపండి

దేశంలో మళ్లీ కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోందని.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌కు లేఖ రాశారు. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని, టీకా వేసుకున్నవారే యాత్రకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా నిబంధనలు పాటించలేకపోతే యాత్రను సస్పెండ్‌ చేయాలన్నారు.

విమానాశ్రయాల్లో హైఅలర్ట్‌

శంషాబాద్‌ రూరల్‌/హైదరాబాద్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): బీఎఫ్‌.7 వేరియంట్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాల్లో మళ్లీ ఆంక్షలకు సిద్ధమైంది. వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌గా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మెడికల్‌ హైఅలర్ట్‌ ప్రకటించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో కొవిడ్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికులు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలితే.. క్వారంటైన్‌కు పంపుతామని, వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సీసీఎంబీకి పంపుతామని వివరించారు. భౌతిక దూరం, మాస్కుల నిబంధనను అమలు చేస్తామన్నారు.

Updated Date - 2022-12-22T03:29:56+05:30 IST