Quid pro quo: అంతా క్విడ్ ప్రోకో!
ABN , First Publish Date - 2022-11-19T02:57:19+05:30 IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. క్విడ్ ప్రో కో జరిగినట్లు నిర్ధారణకొచ్చింది. సీబీఐ పకడ్బందీగా చార్జిషీట్లు దాఖలు చేసిందని అభిప్రాయపడింది.

స్పష్టంగా కనిపిస్తోంది
వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో
హెటిరోకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
సీబీఐ వేసిన చార్జిషీటు పకడ్బందీగా ఉంది
దరఖాస్తు చేసిన రోజే భూముల కేటాయింపా?
అసలు కార్యకలాపాలే మొదలవ్వని
జగన్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులా?
వాటి విలువను విజయసాయి ఆమోదించారు
ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు
హెటిరో క్వాష్ పిటిషన్ కొట్టివేత
2006 నవంబరు 17న హెటిరో, అరబిందో కంపెనీలు దరఖాస్తు చేస్తే.. అదే రోజు వాటికి భూములు కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి (వైఎస్ రాజశేఖర్‌రెడ్డి) చెప్పారు. అంతకు 2-3 రోజుల ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం భూములివ్వలేదు. ఇక్కడే క్విడ్ ప్రొ కో జరిగింది. ఇది అత్యున్నత స్థాయిలో చేసిన తప్పు కాదా?
అసలు కార్యకలాపాలే ప్రారంభంకాని ఏ-1 వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో ఒక్కో షేర్‌కు రూ.350 చొప్పున ప్రీమియం చెల్లించి హెటిరో, అరబిందో కొనుగోలు చేశాయి.
ఏ-2 విజయసాయిరెడ్డి ఆ విలువను ఆమోదించారు.
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. క్విడ్ ప్రో కో జరిగినట్లు నిర్ధారణకొచ్చింది. సీబీఐ పకడ్బందీగా చార్జిషీట్లు దాఖలు చేసిందని అభిప్రాయపడింది. అసలు కార్యకలాపాలే ప్రారంభంకాని జగన్‌కు చెందిన సంస్థల్లో హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అరబిందో సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు కోర్టు గుర్తించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఉన్న ఆరోపణలను కొట్టివేయడానికి నిరాకరిస్తూ.. ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ గతేడాది తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిని హెటిరో కంపెనీ సుప్రీంకోర్టులోసవాల్ చేసింది. ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హెటిరో తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో హెటిరో గ్రూపు ఏ-4గా ఉందని తెలిపారు. కంపెనీ గ్రూపును నిందితురాలిగా చేర్చరాదని, వ్యక్తులనే నిందితులుగా చేర్చాలని.. ఈ కేసులో ఏమీ లేదని అన్నారు.
అభియోగాలను కొట్టేయడానికి (క్వాష్) నిరాకరించిన మేజిస్ట్రేట్ కోర్టు.. కారణాలను రికార్డు చేయనవసరం లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని ప్రస్తావించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘ఈ కేసులో 2006 నవంబరు 17 కీలకమైన తేదీ. 75 ఎకరాల చొప్పున భూములు కేటాయించాలంటూ ఆ తేదీన హెటిరో గ్రూపు డైరెక్టర్ శ్రీనివా్‌సరెడ్డితో పాటు అరబిందో ఫార్మా కంపెనీ.. అప్పటి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఎండీ బీపీ ఆచార్యకు దరఖాస్తులు చేశాయి’ అని పేర్కొంది. హెటిరో కంపెనీ లీజు కోసం దరఖాస్తు చేసిందని రోహత్గీ తెలిపారు. అయితే ఏమిటని.. దరఖాస్తులు చేసుకున్న రోజునే భూములను కేటాయించారని ధర్మాసనం ఎత్తిచూపగా.. అవునని రోహత్గీ అంగీకరించారు. ధర్మాసనం ఇంకా స్పందిస్తూ.. ‘ఈ విషయం చార్జిషీటులో స్పష్టంగా నమోదై ఉంది. ఇది అత్యున్నత స్థాయిలో చేసిన తప్పు కాదా? దీనిపై మేం ఎక్కువ చెప్పదలచుకోలేదు. పారిశ్రామిక పార్కు కోసం 954 ఎకరాలు సేకరించారు. 2006 నవంబరు 17న హెటిరో, అరబిందో కంపెనీలు దరఖాస్తు చేయగా.. అదే రోజు ఆ కంపెనీలకు భూములు కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి (వైఎస్ రాజశేఖర్‌రెడ్డి) చెప్పారు. అంతకు రెండు, మూడ్రోజుల ముందు దరఖాస్తు చేసుకున్న వారికి భూములివ్వలేదు. ఇక్కడే క్విడ్ ప్రొ కో జరిగింది. అసలు కార్యకలాపాలే ప్రారంభంకాని ఏ-1 వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో ఒక్కో షేర్‌కు రూ.350 చొప్పున ప్రీమియం చెల్లించి హెటిరో, అరబిందో కంపెనీలు కొనుగోలు చేశాయి. మేం ఏదీ దాచాలనుకోవడం లేదు. ఏ-2 విజయసాయిరెడ్డి ఆ విలువను ఆమోదించారు. ఈ విషయాలన్నీ మూడు చార్జిషీట్లలో స్పష్టంగా ఉన్నాయి. ఈ పరిణామాలు గమనించాక మీ పిటిషన్‌ను కొట్టివేయాలనిపిస్తోంది’ అని అని స్పష్టం చేసింది. స్పందించిన రోహత్గీ.. హెటిరో దరఖాస్తు చేసిందని, ఏపీఐఐసీ భూములు కేటాయించిందని.. కేటాయింపు విషయంలో క్విడ్ ప్రొ కో ఆరోపణలు ఉన్నప్పటికీ.. కోర్టులు చట్టప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు.
‘ఇక్కడ మోడస్ ఆపరాండీ (నేరం చేసిన పద్ధతి) ఏమిటంటే.. క్విడ్ ప్రొ కోలో భాగంగా ముఖ్యమంత్రి చెప్పగానే భూములిచ్చారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టులు చట్టప్రకారం నడుచుకోవాలని, అంతిమంగా హెటిరో నిర్దోషిగా తేలవచ్చు.. లేదంటే దోషిగా నిరూపితం కావచ్చు.. ఎవరు చూస్తారని రోహత్గీ వ్యాఖ్యానించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘అదే విషయాన్ని హైకోర్టు కూడా చెప్పింది. అంతిమంగా మీరు నిర్దోషిగా తేలవచ్చు. కానీ ఇది కొట్టివేయదగిన కేసు కాదు’ అని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పులో లోపాలు ఉన్నాయని రోహత్గీ చెప్పగా.. కింది కోర్టు తీర్పు మరింత మెరుగ్గా ఉండాలని చేస్తున్న వాదనను తాము అర్థం చేసుకుంటున్నామని.. అదే సమయంలో మేజిస్ట్రేట్ కోర్టులు అదనపు పనిభారంతో పనిచేస్తున్న విషయాన్ని గమనించాలని ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టుతో పోల్చుకుంటే కింది కోర్టులకు భారం ఎక్కువగా ఉంటుందని, అవి శనివారాలు కూడా పనిచేస్తాయని, పైగా తాము అది చేయాలి.. ఇది చేయాలని వాటికి అనేక ఆదేశాలు జారీ చేస్తుంటామని గుర్తుచేసింది. ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ట్రయల్‌పై ప్రభావం చూపరాదని ఉత్తర్వుల్లో పేర్కొనాలని రోహత్గీ కోరారు. అనంతరం హెటిరో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
సీబీఐ అభియోగమిదీ..
ఏపీఐఐసీకి చెందిన జడ్చర్ల సెజ్‌లో హెటిరో, అరబిందోలకు 75 ఎకరాల చొప్పున 2006లో భూములను కేటాయించినందుకు గాను ఆ రెండు కంపెనీలు జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ గుర్తించింది. దీనికి సంబంధించి నమోదైన కేసులో 13 మంది నిందితులు ఉండగా... ఏ-1గా జగన్, ఏ-2గా విజయసాయిరెడ్డి, ఏ-3గా అరబిందో గ్రూపు, ఏ-4గా హెటిరో గ్రూపు, ఏ-5గా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, ఏ-6గా హెటిరో కంపెనీ డైరెక్టర్ ఎం.శ్రీనివా్‌సరెడ్డి, ఏ-7గా అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానందరెడ్డి, ఏ-8గా ట్రైడెంట్ అప్పటి డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, ఏ-9గా అప్పటి ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్య, ఏ-10గా వైవీఎల్ ప్రసాద్, ఏ-11గా అరబిందో కంపెనీకి చెందిన పీఎస్ చంద్రమౌళి, ఏ-12గా జగతి పబ్లికేషన్స్, ఏ-13గా జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి.