Atla Taddi 2022: ఇవాళ అట్ల తద్ది.. కుజ దోషం ఉన్నవాళ్లు ఈ ఒక్క పని చేస్తే దోషం పోవడమే కాదు..

ABN , First Publish Date - 2022-10-12T19:40:45+05:30 IST

అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌.. ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌.. పీటకింద పిడికెడు బియ్యం.. పిల్లల్లారా జెల్లల్లారా.. లేచి రారండోయ్‌..

Atla Taddi 2022: ఇవాళ అట్ల తద్ది.. కుజ దోషం ఉన్నవాళ్లు ఈ ఒక్క పని చేస్తే దోషం పోవడమే కాదు..

అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌.. ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌.. పీటకింద పిడికెడు బియ్యం.. పిల్లల్లారా జెల్లల్లారా.. లేచి రారండోయ్‌.. అంటూ ఆటపాటలతో కోలాహలంగా సాగే నోము అట్ల తద్ది. ఈ నోమును కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుకుంటూ ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలని నోచుకోవడం అనాదిగా వస్తోంది. అట్ల తద్ది నోమును చంద్రోదయ ఉమావ్రతం అని కూడా అంటారు. పరమేశ్వరుడిని పతిగా పొందేందుకు సాక్షాత్తూ పార్వతీదేవి ఈ నోము నోచిందని పురాణాల కథనం. ఈ పండుగ ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి మూడో రోజున వస్తుంది.


పగలంతా ఉపవాసం

అట్లతద్ది వ్రతం ఆచరించేవారు తదియ నాడు తెల్లవారుజామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందు ఆరగించి తాంబూలం వేసుకోవాలి. అనంతరం ఆటలు ఆడాలి. పాటలు పాడాలి. ఊయలలు ఊగాలి. స్నానపానాదులు పూర్తిచేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అనంతరం 11మంది ముత్తయిదువలను ఇంటికి పిలిచి గౌరీదేవికి లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరంతో పూజ చేసి తోరాలను కట్టుకుంటారు. తులసి, తమలపాకులతో తోరాలను తయారు చేసుకోవాలి. తోరం కట్టుకున్న తర్వాత అట్లతద్దె కథను చదువుతారు.


ఆటపాటలతో సందడిగా..

యువతులు, మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఇది. ముఖ్యంగా యువతులైతే పొలంగట్లే కాదు.. తోటలన్నిటినీ వారి ఆటపాటలతో పరవశింపజేస్తారు. గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. వ్రతంలో భాగంగా ఆడపిల్లలు తెల్లవారుజామున వెన్నెల్లో ఒకచోటుకు చేరి బలంగా ఉన్న చెట్టు కొమ్మలకు ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దె రోజు ఆటలాడడం వల్ల నడుము గట్టిపడుతుంది. లోకంలో బతకాల్సిన తీరు గురించి తద్దెపాటలు సందేశమిస్తాయి. 


ఉప్పు పొట్లాల జాడేది

అట్లతద్ది రెండు రోజుల ముందు నుంచే యువతులతో పాటు యువకులు కూడా మరోవైపు ఆటపాటలతో సందడి చేస్తుంటారు. దీనిలో భాగంగా ఉప్పుపొట్లాలు తిప్పడం ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు ఉప్పు పొట్లాల జాడ ఎక్కడో గానీ కనిపించట్లేదు. తాడిచెట్టు మొవ్వలు కాల్చి వాటిలో ఉప్పుకలిపి పొట్లాలుగా చుట్టి వెలిగించి రాత్రి సమయంలో తిప్పుతారు. ఉత్సాహంగా సాగే ఉప్పు పొట్లాల వేడుకను తిలకించేందుకు వయో భేదం లేకుండా అందరూ ముందుకొస్తారు. 


వాయినం తీసుకునేది పార్వతీదేవే

వ్రతకథ చదవడం పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. 11 మంది ముత్తయిదువులకు ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి గౌరీదేవికి నివేదించిన నైవేద్యంలో ఒక కుడుమును ఉంచి వాయనంగా ఇస్తారు. వాయనాలు ఇచ్చేటప్పుడు ‘‘ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం’’ ఇలా మూడుసార్లు చెబుతారు. చివరకు నా వాయనం అందుకున్న సఖి ఎవరు అని అడుగుతారు. తీసుకునే వారు నేను గౌరీపార్వతిని అని అంటారు. వాయనాలు ఇచ్చిన అనంతరం చంద్రుని దర్శించుకుని అట్టుముక్క కొద్దిగా తిని ఉపవాసాన్ని విరమిస్తారు. దాంతో అట్లతద్దె వ్రతం పూర్తవుతుంది.


మంచి భర్త వస్తాడని..

అట్లతద్దితో గోరింటాకుకు విడదీయరాని బంధం ఉంటుంది. గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తాడని పెద్దలంటుంటారు. అందుకేనేమో పండుగ రోజున గోరింటాకుకు అధిక ప్రాధాన్యమిస్తారు. మహిళలు గోరింటాకు స్వయంగా కోసి నూరి చేతులకు వివిధ రకాల డిజైన్లతో అలంకరించుకోవడం ఆనవాయితీ. పోటీపడి మరీ మహిళలు, యువతులు అందమైన డిజైన్లతో గోరింటాకు పెట్టుకుంటారు.


గ్రహదోష నివారణకు..

కొందరైతే వాయనంలో భాగంగా నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలం కూడా ఇచ్చి వారి ఆశీర్వచనాలు తీసుకుంటారు. నవగ్రహాల్లోని కుజునకు అట్లంటే ప్రీతి కాబట్టి అట్లనే నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవ్వడమే కాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చేయడానికి వాడేది మినపపిండి, బియ్యపుపిండి మిశ్రమాలు. అందులో మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయనంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖ ప్రసవం జరుగుతుందని విశ్వాసం.

Updated Date - 2022-10-12T19:40:45+05:30 IST