Summer Plant Care Made Easy: వేసవిలో మొక్కల సంరక్షణ ఇలా
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:38 AM
వేసవిలో మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యరశ్మి నుండి అవి రక్షించేందుకు నీడ కల్పించడం, సూర్యోదయానికి ముందే నీళ్లు పోయడం, మొక్కల ఆకులను, పువ్వులను కత్తిరించడం ముఖ్యమైనది. ఎరువులు ఇవ్వడం సీజనల్‌గా, ఎండ తీవ్రత తగ్గిన తరువాత చేయడం ఉత్తమం

మనం... ఇంటి పరిసరాల్లో లేదంటే బాల్కనీలో చిన్న కుండీల్లో రకరకాల మొక్కలు పెంచుతూ ఉంటాం. వేసవిలో ఎండ తీవ్రత వల్ల ఈ మొక్కలు ఎండిపోతూ ఉంటాయి. ఒక్కోసారి చనిపోతాయి కూడా. ఇలా కాకుండా ఎండాకాలంలో కూడా మొక్కలు పచ్చగా ఏపుగా పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవి...
మధ్యాహ్న సమయంలో మొక్కల మీద నేరుగా సూర్యరశ్మి పడకుండా మందపాటి వస్త్రాన్ని పరదాలా వేయాలి. మొక్కలకు ఇలా నీడను అందించడం వల్ల వాటి ఆకులు, వేర్లు ఎండిపోకుండా ఉంటాయి. కాండంలో తేమ నిలిచి మొక్క చక్కగా పెరుగుతుంది.
ఎండాకాలంలో సూర్యోదయానికి ముందే మొక్కలకు నీళ్లు పోయడం మంచిది. ఈ సమయంలో అయితే వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండదు కాబట్టి, మట్టి మెల్లగా తడిని పీల్చుకుని ఎక్కువసేపు నిల్వ ఉంచుకుంటుంది. దీనిని మొక్కలు గ్రహించి ఆరోగ్యంగా పెరుగుతాయి.
మొక్కలకు ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోయాలి. దీనివల్ల భూమి లేదా కుండీ లోపలికి వ్యాపించి ఉన్న వేర్లకు నీరు అందుతుంది.
మొక్కలను ఒక్కోటిగా కాకుండా నాలుగు లేదా అయిదింటిని ఒక సమూహంలా నాటాలి. దీనివల్ల మొక్కలన్నింటికీ నీరు, సూర్యరశ్మి సమపాళ్లలో అందుతాయి.
ఎండిపోయిన ఆకులు, పువ్వులను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. దీంతో పోషకాలు అంది మొక్కలు పచ్చగా ఏపుగా పెరుగుతాయి.
ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మొక్కలకు ఎరువులు అందించకూడదు. వాతావరణం కాస్త చల్లబడినప్పుడు మట్టిలో ఎరువులు కలిపితే మొక్కలు బలంగా ఉంటాయి.
వేసవికాలంలో మట్టి ఎక్కువగా తడారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో బిందు సేద్య విధానం లేదా స్వీయ నీటి కుండీలను ఉపయోగించి మట్టి ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. మట్టిపై ఎండిన ఆకులు లేదా గడ్డి పరచి ఉంచితే ఎక్కువసేపు తడి నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
Virat Kohli: వెబ్‌సిరీస్‌లో అనుష్క భర్త.. అచ్చం కోహ్లీని పోలి ఉన్న ఈ నటుడిని చూడండి..
Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి