Boost Your Health with Coconut Water: కొబ్బరి నీళ్లు తాగుదాం
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:25 AM
వేసవికాలంలో శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి కొబ్బరినీళ్లు మంచివాటివి. ఇవి శరీరానికి కావాల్సిన సహజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటంతో సహా, రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలను కూడా తగ్గిస్తాయి.

వేసవికాలంలో తరచూ గొంతు ఎండిపోతూ ఉంటుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలో నిర్జలీకరణ, అలసట, నీరసం, తలనొప్పి లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటి నుంచి తక్షణమే ఉపశమనం పొందేందుకు కొబ్బరినీళ్లు తాగడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరినీళ్లు అందించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఎండాకాలంలో మధ్యాహ్నం వేళ కొబ్బరి నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. శరీరానికి కావాల్సిన సహజ లవణాలు అందుతాయి.
కొబ్బరినీళ్లలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతాయి. భోజనానికి అరగంట ముందు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
కొబ్బరినీళ్లకు ఆల్కలీన్ గుణాలు ఉంటాయి. తరచూ ఈ నీళ్లు తాగుతూ ఉంటే కడుపులో ఆమ్లత్వం తగ్గుతుంది. కారంగా ఉండే పదార్థాలు తిన్నతరవాత అరగ్లాసు కొబ్బరినీళ్లు తాగితే కడుపులో చల్లగా అనిపిస్తుంది.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరిగి మలబద్దకం సమస్య తీరుతుంది.
కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, రైబోఫ్లేవిన్, థయమిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగుతూ ఉంటే అంటువ్యాధులు దరిచేరవు.
ఉదయం వ్యాయామం చేసిన తరవాత కొబ్బరి నీళ్లు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు తగ్గుతాయి.
తరచూ కొబ్బరినీళ్లు తాగుతూ ఉంటే శరీరానికి కావాల్సిన సి, ఇ విటమిన్లు; కాల్షియం లభిస్తాయి. దీంతో దంతాలు, కండరాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.