Indians: కెనడా వలసల్లో 18శాతం మంది భారతీయులే
ABN , First Publish Date - 2022-10-28T11:43:45+05:30 IST
కెనడా జనాభాలో దాదాపు 23శాతం మంది వలసదారులే ఉన్నారని ఆ దేశ సెన్సస్ రిపోర్టు-2021 వెల్లడించింది.
ఎన్నారై డెస్క్: కెనడా (Canada) జనాభాలో దాదాపు 23శాతం మంది వలసదారులే ఉన్నారని ఆ దేశ సెన్సస్ రిపోర్టు-2021 వెల్లడించింది. ఇక కొత్తగా వస్తున్న వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62శాతం మంది ఉంటే.. వీరిలో భారతీయులే (Indians) అధికమని నివేదిక పేర్కొంది. వలసల్లో భారత్ ఏకంగా 18.6శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఫిలిప్పీన్స్ (11.4శాతం), చైనా (8.9శాతం) ఉన్నాయి. 2021 వరకు మొత్తం 8.3 మిలియన్ల మంది వలసదారులు కెనడాలో ఉంటే.. వీరిలో 1.3 మిలియన్ల మందికి కెనడా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (Permanent Residency) కల్పించింది. 2016 నుంచి 2021 వరకు ఐదేళ్ల కాలపరిమితిలో ఆ దేశంలో స్థిరపడిన 13 లక్షల మందికి ఇలా పర్మినెంట్ రెసిడెన్సీని కెనడా సర్కార్ (Canada Govt) ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం 23శాతంగా ఉన్న ప్రవాసులు 2041 ఏడాది నాటికి 34శాతానికి పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
కెనడాలో ఇమ్మిగ్రేషన్ రేటు ఎందుకు ఎక్కువ?
కెనడాలో కార్మికుల కొరత (Workers Shortage) కారణంగా గత ఐదు సంవత్సరాలుగా వలసలు బాగా పెరిగాయి. వృద్ధాప్యం కారణంగా జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది 2030 నాటికి శ్రామిక శక్తి నుండి పూర్తిగా వైదొలుగుతారు. అదే సమయంలో మరణాల సంఖ్య క్రమంగా పెరగడం, అలాగే సాపేక్షంగా తక్కువ సంతానోత్పత్తి స్థాయిల కారణంగా కార్మికుల కొరత మరింత తీవ్రమైంది. దీంతో ఇతర దేశాల కార్మికులపై కెనడా ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ ప్రభుత్వం భారీ మొత్తంలో వలసదారులను ఆహ్వానించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా 2022 ఏడాది చివరినాటికి దాదాపు 4,32,000 మందిని, అదే 2024 చివరి నాటికి 4,50,000 మంది కొత్త వలసదారులను స్వాగతించాలని కెనడా చూస్తోంది.