Kuwait: షాకింగ్ డేటా.. ప్రవాసులను పెళ్లాడిన కువైటీ మహిళలు ఎంతమంది ఉన్నారంటే..
ABN , First Publish Date - 2022-11-09T09:24:49+05:30 IST
దేశంలో పౌరసత్వ సమస్య విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్న తరుణంలో ప్రత్యేకించి కువైటీలు కాని భార్యలు, విదేశీయులను వివాహం చేసుకున్న కువైత్ మహిళలు, వారి పిల్లలకు సంబంధించిన అధికారిక గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి.
కువైత్ సిటీ: దేశంలో పౌరసత్వ సమస్య విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్న తరుణంలో ప్రత్యేకించి కువైటీలు కాని భార్యలు, విదేశీయులను వివాహం చేసుకున్న కువైత్ మహిళలు, వారి పిల్లలకు సంబంధించిన అధికారిక గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం విదేశీయులను పెళ్లి చేసుకున్న కువైటీ మహిళలకు పుట్టిన మొత్తం పిల్లల సంఖ్య జూన్ 2022 చివరి నాటికి 15,100కి చేరింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (Public Authority for Civil Information) డేటా ప్రకారం ఇప్పటివరకు 19,429 మంది కువైటీ మహిళలు విదేశీయులను పరిణయమాడారు.
వీరిలో 17,429 మంది పాశ్చాత్య జాతీయులను పెళ్లాడగా.. 688 మంది ఆసియా జాతీయులను వివాహం చేసుకున్నారు. 379 మంది కువైత్ మహిళలు ఉత్తర అమెరికా జాతీయులను వివాహం చేసుకుంటే.. 246 మంది మహిళలు యూరోపియన్ పౌరులను పెళ్లి చేసుకున్నారు. మరో 57 మంది దక్షిణ అమెరికా జాతీయులను, 49 మంది ఆఫ్రికన్ జాతీయులను పరిణయమాడారు. అలాగే 39 మంది ఆస్ట్రేలియా జాతీయులను వివాహం చేసుకున్నట్లు డేటా చెబుతోంది.
ఇక నాన్-కువైటీలను పెళ్లి చేసుకున్న కువైటీ మహిళలల్లో పిల్లలు లేని వారి సంఖ్య 4,329. అలాగే 2,552 మందికి ఒకరు సంతానం ఉంటే.. 2,571 మందికి ఇద్దరు, 2,519 మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2,282 మంది కువైటీ మహిళలు ఎవరైతే విదేశీయులను వివాహమాడారో వారికి నలుగురు సంతానం ఉంటే.. 1,915 మందికి ఐదుగురు పిల్లలు, 1,249 మందికి ఆరుగురు పిల్లలు, 894 మందికి ఏడుగురు, 527 మందికి ఎనిమిది మంది, 324 మందికి తొమ్మిది మంది పిల్లలు, 267 మందికి తొమ్మిది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఇలా 2021 మధ్య నాటికి నాన్-కువైటీ పురుషులను పెళ్లి చేసుకున్న కువైత్ మహిళల మొత్తం సంఖ్య 20,128కి చేరుకుంది.