NRI: ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరు తానా కార్యక్రమం సక్సెస్
ABN , First Publish Date - 2022-12-24T17:43:03+05:30 IST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ తరపున తానా మీడియా కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని.. పెనమలూరులో నిర్వహించిన తానా చైతన్యస్రవంతి కార్యక్రమం విజయవంతమైంది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా-TANA), తానా ఫౌండేషన్ తరపున తానా మీడియా కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని.. పెనమలూరులో నిర్వహించిన తానా చైతన్యస్రవంతి కార్యక్రమం విజయవంతమైంది. జడ్ పి హైస్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు తానా నాయకులతోపాటు, ఏరియా ప్రముఖులు, జడ్‌పి హైస్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి చేయూత కార్యక్రమం కింద పేద విద్యార్థులకు దాదాపు లక్ష రూపాయల విలువ చేసే స్కాలర్ షిప్‌లను పంపిణీ చేశారు. రైతు కోసం కార్యక్రమం కింద పేద రైతులకు పవర్ స్ప్రేయర్లు, రైతు రక్షణ పరికరాలను అందజేశారు. ఆదరణ కార్యక్రమం కింద మహిళలకు కుట్టుమిషన్లను, వికలాంగులకు ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. క్యాన్సర్ పరీక్ష కేంద్రం ఏర్పాటుతోపాటు ఇఎన్‌టి, టాప్ స్టార్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు, పరీక్షలను చేశారు. జడ్‌పి హైస్కూల్‌కు కుట్టుమిషన్లను దివ్యంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు. న్యూయార్క్ ఎన్నారై శ్రీనివాస నాదెళ్ళ.. పెనమలూరు జడ్ పి హైస్కూల్ పేద విద్యార్థికి పది వేల రూపాయిలు సహాయం చేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, జడ్‌పి హైస్కూల్‌లో తరగతులను, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడంతోపాటు కార్పొరేట్ స్కూల్ కన్నా మిన్నగా ఈ హైస్కూల్ విద్యార్థులు పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ఇలాంటి హైస్కూల్‌లోనే చదువుకుని నేడు అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్నానని, ఈ ప్రాంతానికి చెందిన ఠాగూర్ మల్లినేని కూడా ఇక్కడ నుంచి చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. ‘‘మీరు కూడా కష్టపడి చదివితే బాగా అభివృద్ధి చెందుతారు’ అని చెప్పారు. అలాగే ఈ హైస్కూల్‌కు, పెనమలూరుకు ఏమైనా కావాల్సి వస్తే తానా తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ మాట్లాడుతూ, ఫౌండేషన్ తరపున వివిధ చోట్ల వివిధ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని, ఎంతోమందికి సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ జడ్‌పి హైస్కూల్‌కు కావాల్సిన బల్లలు ఇతర అవసరాలను తీర్చేందుకు తానా ఫౌండేషన్ కృషి చేస్తుందని హామి ఇచ్చారు. అంతకుముందు జడ్‌పి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గా భవానీ హైస్కూల్‌లో బల్లల కొరత, ఇతర అవసరాలను తెలియజేశారు. దీనిపై వెంకటరమణ స్పందిస్తూ తాము సహాయపడతామని హామీ ఇచ్చారు.
ఠాగూర్ మల్లినేని మాట్లాడుతూ, పెనమలూరు ప్రాంతం అభివృద్ధికి, జడ్‌పి హైస్కూల్‌కు కావాల్సిన సౌకర్యాల కల్పనకు తనవంతుగా కృషి చేయడంతోపాటు పెనమలూరు ఎన్నారై తరపున, తానా తరపున సహాయ సహకారాలను అందజేసినట్లు తెలిపారు. గ్రామస్థులకోసం, విద్యార్థులకోసం ఉచిత వైద్యశిబిరాలను, పేద విద్యార్థులు బాగా చదివేందుకు వీలుగా వారికి స్కాలర్‌షిప్‌లను, వికలాంగులకోసం ట్రైసైకిళ్ళను తానా తరపున చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం, జడ్ పి హైస్కూల్ అభివృద్ధికి కృషి చేస్తామని హామి ఇచ్చారు.
తానా సెక్రెటరీ సతీష్ వేమూరి, తానా చైతన్యస్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పాంత్రాతోపాటు, నాగా పంచుమర్తి, శ్రీనివాస్ ఓరుగంటి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, శ్రీనివాస నాదెళ్ళ, పవన్ దొడ్డపనేని, అనిల్ వీరపనేని తదితర తానా నాయకులతోపాటు గ్రామ సర్పంచ్ లింగాల భాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థిని సాయి వర్ధిని కిలారు బృందం, పెనమలూరుకు చెందిన సుధీర్ పాలడుగు, వర ప్రసాద్ మరీదు, నరేంద్ర బాబు మోర్ల, ప్రవీణ్ కిలారు, కోడూరు మహేష్, కృష్ణ దావులూరి, సురేష్ కిలారు, సాంబశివరావు వీరంకి, తిరుమల గండరపు, గోపినాథ్ అర్చన, జావుల్లా రెహమాన్ షేక్ వాలంటీరుగా పాల్గొన్నారు.