UK: బ్రిటన్ వెళ్లాలనుకొనే భారతీయులకు గోల్డెన్ చాన్స్.. ఇకపై ప్రతియేటా..
ABN , First Publish Date - 2022-11-17T07:28:22+05:30 IST
బ్రిటన్ వెళ్లాలనుకొనే భారతీయులకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
భారతీయులకు బ్రిటన్ బంపర్ ఆఫర్
యువ నిపుణులకు ఏటా మూడు వేల వీసాలు
లండన్, నవంబరు 16: బ్రిటన్ వెళ్లాలనుకొనే భారతీయులకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత యువ నిపుణులకు ఏటా 3వేల వీసాలు అందించే కొత్త పథకానికి ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ఆమోదం తెలిపారు. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జి-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీతో సునాక్ మంగళవారం కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే బ్రిటన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. అదేవిధంగా బ్రిటన్ పౌరులు సైతం భారత్‌లో నివసించడానికి, పనిచేయడానికి కూడా వీలు కల్పించే ఈ పథకాన్ని 2023 సంవత్సరం మొదట్లో అధికారికంగా ప్రారంభించనున్నారు.
‘‘18 నుంచి 30 ఏళ్ల వయసున్న, డిగ్రీ పట్టభద్రులైన భారతీయ పౌరులు బ్రిటన్‌కు వచ్చి రెండేళ్ల వరకూ చదువుకోవడంతో పాటు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా ఏటా 3వేల వీసాలు అందజేస్తాం’’ అని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా, వాణిజ్యం, రక్షణ, భద్రత, రవాణా రంగాల్లో పరస్పర సహకారంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ బుధవారం చర్చించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, సింగపూర్ ప్రధాని లీ హెసియెన్, జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఆస్ట్రేలియా, ఇటలీ ప్రధానులు ఆల్బనీస్, మెలోనీలతోనూ వివిధ అంశాలపై చర్చించారు.