NRI: అమెరికాలో సిక్కు యువకుల న్యాయపోరాటం.. మద్దతుగా నిలిచిన మాజీ సైనికాధికారులు..

ABN , First Publish Date - 2022-11-05T19:39:30+05:30 IST

సైన్యం శిక్షణ కార్యక్రమాల్లో తమకు మత సంప్రదాయాల్ని పాటించేందుకు అనుమతించాలంటూ అమెరికాలోని ముగ్గురు సిక్కు మతస్థులు చేస్తున్న న్యాయపోరాటం కీలక మలుపు తిరిగింది.

NRI: అమెరికాలో సిక్కు యువకుల న్యాయపోరాటం.. మద్దతుగా నిలిచిన మాజీ సైనికాధికారులు..

ఎన్నారై డెస్క్: సైన్యం శిక్షణ కార్యక్రమాల్లో తమకు మత సంప్రదాయాల్ని(Sikh traditions) పాటించేందుకు అనుమతించాలంటూ అమెరికాలోని ముగ్గురు సిక్కు మతస్థులు(Sikhs) చేస్తున్న న్యాయపోరాటం కీలక మలుపు తిరిగింది. వారికి మద్దతుగా కొందరు కీలక ఆర్మీ అధికారులతో పాటూ ముస్లిం, యూదులు, సిక్కు సంస్థలు అండగా నిలిచాయి. డిస్ట్రి‌క్ట్ కోర్ట్ ఆఫ్ అప్సీల్స్‌లో సిక్కు యువకులు దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా మాజీ సైనికాధికారులు(Veterans) కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. మత సంప్రదాయాలను పాటించేందుకు సైన్యంలోని ఇతర విభాగాలు.. సిక్కులను అనుమతిస్తున్న విషయాన్ని వారు ప్రస్తావించారు. సైనికులను తమ మత విశ్వాసాలకు దూరం చేస్తే.. క్లిష్ట సమయాల్లో వారిలో నైతిక స్థైర్యం దెబ్బతినొచ్చని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మతపరమైన మినహాయింపులు కోరుతూ.. జస్కిరత్ సింగ్, ఆకాశ్ సింగ్, మిలాప్ సింగ్ చహాల్ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అమెరికా నేవీలో కీలక పోరాట దళమైన మెరీన్ కోర్‌లో చేరేందుకు వారు శిక్షణ పొందాల్సి ఉంది. ఇందుకోసం గడ్డం తొలగించాలని, జుట్టు కత్తిరించుకోవాలని మెరీన్ కోర్ అధికారులు వారికి స్పష్టం చేశారు. ఈ సంప్రదాయం శిక్షణకు అడ్డుపడొచ్చని అభిప్రాయపడ్డారు. ట్రెయినింగ్ పూర్తయ్యాక ఆ సంప్రదాయాలను మళ్లీ కొనసాగించవచ్చని చెప్పారు.

సైనిక విధుల్లో ఉన్న అనేక మంది ఇప్పటికే ఇటువంటి మతపరమైన మినహాయింపులు పొందుతున్నారు. అమెరికా త్రివిధ దళాలు తమ సిబ్బందికి ఈ అనుమతులు ఇచ్చాయి. అయితే.. తాము కోరిన అనుమతి దక్కకపోవడంతో ఆ ముగ్గురూ కోర్టును ఆశ్రయించారు. శిక్షణ సమయంలో కూడా తమకు మినహాయింపులు ఉండాలన్నారు. దీన్ని కాదంటే తమ మతస్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారికి నలుగురు రిటైర్డ్ అధికారుల మద్దతు దక్కింది. యూఎస్ ఆర్మీ మాజీ సెక్రెటరీ ఎరిక్ ఫానింగ్, రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ జెఫ్రీ కెండాల్, మరో ఇద్దరు రిటైర్డ్ అధికారులు మార్క్ హర్ట్లింగ్, ఆర్. ప్యాట్రిక్ హ్యూస్టన్‌లు కోర్టులో ఉమ్మడిగా అఫిడవిట్ దాఖలు చేశారు. మత విశ్వాసాలను అనుసరించొద్దనడం ట్రెయినీలను నైతికంగా దెబ్బతీయొచ్చని, యువకులు ఆర్మీకి దూరమవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-11-05T19:39:37+05:30 IST