Thene Manasulu: ఎర్రగా, బుర్రగా ఉంటే సరిపోదు.. తపన ఉండాలి

ABN , First Publish Date - 2022-11-17T18:40:49+05:30 IST

చెన్నైలోని జెమినీ స్టూడియో. సినిమా పాత్రికేయులు ఒక్కొక్కరే వస్తున్నారు. .. ఇంటూరి, మాగాపు రామన్‌, కొలను బ్రహ్మానందరావు.. వారితో పాటు ఓ యువ జర్నలిస్టు కూడా ఉన్నాడు. అతని పేరు..

Thene Manasulu: ఎర్రగా, బుర్రగా ఉంటే సరిపోదు.. తపన ఉండాలి
Thene Manasulu

చెన్నైలోని జెమినీ స్టూడియో. సినిమా పాత్రికేయులు ఒక్కొక్కరే వస్తున్నారు. .. ఇంటూరి, మాగాపు రామన్‌, కొలను బ్రహ్మానందరావు.. వారితో పాటు ఓ యువ జర్నలిస్టు కూడా ఉన్నాడు. అతని పేరు సి.వి.రెడ్డి (CV Reddy). నెల్లూరు నుంచి వెలువడే ‘శశిరేఖ’ (SasiRekha) అనే మాస పత్రిక తరఫున వచ్చిన రిపోర్టర్‌. సినిమా జర్నలిజం అతనికి కొత్త. చెన్నైలో స్టూడియోలకు వెళ్లి సినిమా వార్తలు సేకరించే బాధ్యతను సి.వి.రెడ్డికి అప్పగించారు ‘శశిరేఖ’ పత్రిక సంపాదకుడు ఐ.నాగమల్లారెడ్డి (I Nagamalla Reddy). ఈ సమావేశానికి వచ్చిన జర్నలిస్టులను ఆప్యాయంగా రిసీవ్‌ చేసుకుంటున్నారు బాబూ మూవీస్‌ అధినేత సుందరం (Sundaram). దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు (Adurthi Subba Rao) దర్శకత్వంలో అంతా కొత్త వారితో ఆయన నిర్మించిన ‘తేనె మనసులు’ (Thene Manasulu) చిత్రం షూటింగ్‌ పూర్తయింది. హైదరాబాద్‌, ఊటీలో షూటింగ్‌ చేయడం వల్ల చెన్నై పాత్రికేయులను కలిసే అవకాశం లేకపోయింది. అందుకే కొత్త హీరోలు కృష్ణ (Krishna), రామ్మోహన్‌ (Ram Mohan).. హీరోయిన్లు సుకన్య (Sukanya), సంధ్యారాణి (Sandhya Rani)లను పరిచయం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు సుబ్బారావు, సుందరం.

షూటింగ్‌ పూర్తయింది కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జెమినీ స్టూడియో (Gemini Studio)లో జరుగుతుండడంతో ఆ పనుల్లో అసోసియేట్‌ డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ (K Viswanath), దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు బిజీగా ఉన్నారు. కృష్ణ, రామ్మోహన్‌, సుకన్య, సంధ్యారాణి మాత్రం వచ్చేసి పాత్రికేయులకు నమస్కరించి, ఓ పక్కన కూర్చున్నారు. అందరూ కబుర్లు చెప్పుకుంటుండగా దర్శకుడు ఆదుర్తి వచ్చేశారు. రాగానే కొత్త హీరో, హీరోయిన్లను పరిచయం చేశారు. షూటింగ్‌ విశేషాలు వివరించారు. ‘అంతా కొత్త వారితో తీసిన సినిమా ఇది. మీ సహకారం కావాలి’ అని అభ్యర్ధించారు ఆదుర్తి సుబ్బారావు. ఆ తర్వాత పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సమావేశంలో ఆదుర్తిని ఒక ప్రశ్న వేశారు సి.వి.రెడ్డి. ‘ఎవరైనా వ్యక్తి మీకు తారసపడి, ఇతను సినిమాకు పనికి వస్తాడని అనిపిస్తే నటుడిగా పరిచయం చేయగలరా?’ అనే ఆ ప్రశ్నకు ‘అతను ఎర్రగా, బుర్రగా ఉంటే సరిపోదు. నటించాలనే తపన ఉండాలి. అది లేకపోతే ఎంత తోమినా ఫలితం ఉండదు. ‘తేనె మనసులు’ చిత్రం విషయాన్నే తీసుకోండి. ఎంతో మంది కొత్త వాళ్లను మేకప్‌ టెస్ట్‌ చేసి, చివరకు ఈ నలుగురిని ఎంపిక చేశాను. నా అంచనాలకు తగ్గకుండా వీరు నటించారు’’ అని చెప్పారు సుబ్బారావు. కొంత కాలం తర్వాత సి.వి.రెడ్డి జర్నలిజాన్ని వదిలిపెట్టి , చిత్రనిర్మాణరంగంలోకి ప్రవేశించి, నిర్మాత, దర్శకుడు అయ్యారు.

- వినాయకరావు

Updated Date - 2022-11-17T19:40:20+05:30 IST