Rs.2000 Note: రూ.2 వేల నోటుపై చంద్రబాబు ఆనాడు చెప్పిందేంటి?.. మరోసారి తెరపైకి..
ABN , First Publish Date - 2022-12-13T21:40:38+05:30 IST
ఔను..! రూ.2000 నోటు ఏమైపోయినట్టు?. ఎక్కడా కానరావడం లేదేంటి?.. కనీసం ఏటీఎంల లోనైనా దర్శనమివ్వడం లేదెందుకు!?.. చెలామణీలో ఉన్న పెద్ద నోటు గుర్తుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరి మదికి తట్టే సందేహాలివీ.
ఔను..! రూ.2000 నోటు ఏమైపోయినట్టు?. ఎక్కడా కానరావడం లేదేంటి?.. కనీసం ఏటీఎంలలోనైనా దర్శనమివ్వడం లేదెందుకు!?.. చెలామణీలో ఉన్న పెద్ద నోటు గుర్తుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహాలివి. ఈ నోటు కనుమరుగై దాదాపు మూడేళ్లు కావస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు నిషేధమేమీ విధించకపోయినా బ్యాంకులు, ఏటీఎంలు వంటి ఆర్థిక ప్రధాన కేంద్రాల వద్ద కూడా ఈ నోటు పెద్దగా కనిపించడం లేదు. పరిస్థితులకుతోడు డిజిటల్ లావాదేవీలు కూడా పెరిగిపోవడంతో జనాలు కూడా రూ.2000 నోటును దాదాపు మరచిపోతున్నారు. అయితే బ్లాక్‌మనీకి పర్యాయపదంగా మారిపోయిన ఈ నోటుపై నిషేధం విధించాలంటూ బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (Sushil Kumar Modi) రాజ్యసభలో సోమవారం కేంద్రప్రభుత్వానికి చేసిన సూచన మరోసారి ఈ నోటుపై చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ‘‘రూ.2 వేల నోటు బ్లాక్ మనీకి పర్యాయపదంగా మారింది. మెల్లమెల్లగా చలామణీ నుంచి తొలగించాలి. తొలగించడానికి ముందు బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు రెండేళ్లు సమయం ఇవ్వాలి. ఈ నోట్లను కొంత మంది దాచిపెట్టుకొని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఏటీఎంలలో ఈ నోట్లు కనిపించడం లేదు. రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి 2 వేల నోట్లను చెలామణీలోకి తీసుకురావడంలో హేతుబద్ధత లేదు’’ అని సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో సుశీల్ కుమార్ మోదీ కేంద్రానికి సూచించారు. ఈ నేపథ్యంలో రూ.2000 నోటుకు సంబంధించిన పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం..
నల్లధనం నిర్మూలన, ఉగ్రవాదులు-నేరగాళ్లకు నిధులు చేరకుండా అడ్డుకట్టవేయడమే ప్రధాన లక్ష్యాలుగా దేశంలో నవంబర్ 8, 2016న పెద్దనోట్ల రద్దు (demonitisation) జరిగింది. అప్పటివరకు చెలామణీలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవాసులు నానాఅవస్థలు ఎదుర్కొన్నారు. బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. మరోవైపు ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోటును చెలామణీలోకి తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున ముద్రణ కూడా చేపట్టింది. దీంతో నల్లధనం కట్టడికంటూ రూ.1000 నోట్లను రద్దు చేసి ఏకంగా రూ.2 వేల నోటు ప్రవేశపెట్టడంపై కేంద్రంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. హేతుబద్ధతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు రాజకీయ, ఆర్థికరంగ నిపుణులు వ్యతిరేకించారు.
రూ.2 నోటు ప్రవేశపెట్టడాన్ని ప్రశ్నించినవారి జాబితాలో నాటి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉన్నారు. రూ.2 వేల నోటు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. రూ.2000 నోటుపై నిషేధం విధించాలని, లేదంటే ‘పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ’ చందంగా పరిస్థితులు తయారవుతాయని కేంద్రానికి సూచించారు. ‘‘రూ.2 వేల నోటును ఎందుకు ప్రవేశపెట్టారో నాకు అర్థంకాలేదు. ఏదైనా సాంకేతిక కారణంతో ఆర్బీఐ ప్రవేశపెడితే కారణం చెప్పాలి. ఇంత పెద్దనోటు అవసరం ఏముంది. ఏ అవసరం లేకుంటే ఎందుకు ముద్రిస్తున్నారు?’’ అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పలువురు ఆర్థికవేత్తలు, నిపుణులు సైతం ఈ పెద్ద నోటు ప్రతిపాదనను తప్పుబట్టారు. ఈ విమర్శలను లెక్కచేయకుండా కేంద్రం ఈ పెద్ద నోటును ప్రవేశపెట్టింది. ఈ నోట్లను కొంతమంది దాచి పెట్టుకుంటున్నారనే విమర్శల నేపథ్యంలో దాదాపు మూడేళ్లక్రితం లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా రూ.2000 నోటు ముద్రణ చేయడంలేదంటూ 2019 ఏప్రిల్‌లో ప్రకటించింది. చెలామణీలో ఉన్న నోట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని నాటి ఆర్థిక శాఖా సహాయమంత్రి అనురాగ్ థాకూర్ ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఠాగూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు రూ.2000 నోటు కేంద్రంగా ప్రస్తుత పరిణామాలు, చర్చల తీరు ఎలా ఉన్నా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐల సమాలోచనలు ఏవిధంగా ఉన్నాయనేది ముఖ్యం. ఈ పెద్ద నోటు చెలామణీ లేదా ముద్రణపై నిషేధం ఉండబోతుందా?, లేక ఇంకేమైనా సంస్కరణలు ఉంటాయా అనేది వేచిచూడాల్సిందే.