FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం.. పసికూన చేతిలో ఓడిన అర్జెంటినా
ABN , First Publish Date - 2022-11-22T20:15:54+05:30 IST
ఫిఫా ప్రపంచకప్(FIFA World Cup)లో సంచలనం నమోదైంది. పసికూన సౌదీ అరేబియా (Saudi Arabia)
దోహా: ఫిఫా ప్రపంచకప్(FIFA World Cup)లో సంచలనం నమోదైంది. పసికూన సౌదీ అరేబియా (Saudi Arabia) చేతిలో లియోనల్ మెస్సీ (Lionel Messi)లాంటి దిగ్గజ ఆటగాడున్న అర్జెంటినా 1-2తో ఓటమి పాలైంది. అర్జెంటినాను ఓడించిన సౌదీ అరేబియా ఆటగాళ్ల ఆనందానికి అంతే లేకుండా పోయింది. కొందరు అభిమానులైతే ‘మెస్సీ ఎవరు?’ అని ప్రశ్నిస్తూ సంబరాలు చేసుకున్నారు. దోహాలో జరిగిన గ్రూప్-సి తొలి మ్యాచ్‌లోనే అర్జెంటినాను ఓడించిన సౌదీ అరేబియాపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మెస్సీ సేనను 51వ ర్యాంకర్ అయిన సౌదీ అరేబియా ఓడించడం సాకర్ ప్రపంచానికి షాకే. అర్జెంటినాను సౌదీ అరేబియా ఓడించడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. రెండుసార్లు అర్జెంటినా విజయం సాధించగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. లుసాలీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్‌తో మెరిసినా ఫలితం లేకుండా పోయింది. 2019 నుంచి ఇప్పటి వరకు వరుసగా 36 మ్యాచ్‌లలో విజయం సాధించిన అర్జెంటినా చివరికి ఓ చిన్న జట్టు చేతిలో ఓటమి పాలైంది.
మ్యాచ్ ఆరంభంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మార్చిన మెస్సీ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత కూడా అర్జెంటినా ఆధిపత్యం కొనసాగింది. తొలి సగం ముగిసే సరికి అర్జెంటినా 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే, సెకండాఫ్‌లో మాత్రం సౌదీ దూకుడు ముందు అర్జెంటినా నిలవలేకపోయింది. ఒక దశలో ఇరు జట్లు బంతిపై ఆధిపత్యం చలాయించడంతో గేమ్ హోరాహోరీగా జరిగింది. అయితే, 47వ నిమిషంలో సౌదీ ఆటగాడు అల్ పెహ్రీ గోల్ సాధించడంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. దీంతో సౌదీ అరేబియా రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. అదే జోరు ప్రదర్శిస్తూ అర్జెంటినా డిఫెండర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ క్రమంలో 57వ నిమిషంలో సలీమ్ అల్ దవాసరి గోల్ చేయడంతో ఆ జట్టు ఆధిక్యం 2-1కి పెరిగింది.
ఆ తర్వాత మరింత జాగ్రత్తగా ఆడిన సౌదీ అరేబియా ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్టులపై దాడి చేసినా సౌదీ డిఫెన్స్ ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకుని సంచలన విజయాన్ని నమోదు చేశారు. కాగా, అర్జెంటీనా తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం మెక్సికోతో తలపడుతుంది.