పాతనేతల చూపు టీడీపీ వైపు

ABN , First Publish Date - 2022-12-24T01:02:31+05:30 IST

గత రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రంలో ప్రధాన రాజకీయాల పార్టీగానే కాకుండా అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ మళ్లీ తొమ్మిదేళ్ల విరామం అనంతరం జిల్లాలో తన ఉనికిని విస్తరించుకునేందు కోసం సన్నాహాలు చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

పాతనేతల చూపు టీడీపీ వైపు
జిల్లా కేంద్రంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహం

ఖమ్మం సభ సక్సెస్‌తో జిల్లాలో హుషారు

జిల్లాలో పాగాకు తెలుగుదేశం పార్టీ సన్నాహాలు

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసంతృప్తి నేతల దృష్టి ఇటువైపే

జిల్లాలో మారనున్న సమీకరణలు

నిర్మల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గత రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రంలో ప్రధాన రాజకీయాల పార్టీగానే కాకుండా అధికారంలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ మళ్లీ తొమ్మిదేళ్ల విరామం అనంతరం జిల్లాలో తన ఉనికిని విస్తరించుకునేందు కోసం సన్నాహాలు చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్ర రాష్ర్టానికే పరిమితమైన టీడీపీ తిరిగి తెలంగాణలో పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా జిల్లాలో కూడా ఆ పార్టీ ఆస్తిత్వాన్ని తిరిగి బలపర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో టీడీపీ నిర్వహించిన బహిరంగసభ సక్సెస్‌ కావడం ఆ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో అందరి దృష్టి అటువైపే కేంద్రీకృతమవుతోంది. ఖమ్మం సభ సక్సెస్‌ స్పూర్తితో నిర్మల్‌ జిల్లాలో కూడా ఆ పార్టీ కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టేందు కోసం కసరత్తులు చేస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మల్‌కు చెందిన చాలా మంది నాయకులు కేంద్ర, రాష్ట్రస్థాయిలో ఉన్నత పదవులను చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రిగా వేణుగోపాలచారి కొనసాగడమే కాకుండా రాష్ట్రమంత్రిగా కూడా వ్యవహారించారు. ఓ దశలో ఆయన టీడీపీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా గుర్తింపు పొందారు. అప్పటి నుంచే నిర్మల్‌ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచింది. క్రమంగా తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఆ పార్టీ జిల్లాలో ఉనికిని కోల్పోయింది. అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ప్రస్తుత అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి క్రమంగా పార్టీ ఉనికి కనిపించకుండా పోతోంది. ప్రస్తుతం అధికార టీ ఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలలో నిర్మల్‌ జిల్లా నాయకులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గం సైతం ఇక్కడ స్వర్గీయ ఎన్‌టీఆర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. నిర్మల్‌ నడిబొడ్డున ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం ఎదుట ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఎన్‌టీఆర్‌ విగ్రహం అందరికీ గత స్ర్ముతులను గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వవైభవం సాధించడమే కాకుండా ప్రధాన రాజకీయపార్టీగా ఎదిగేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఙానేశ్వర్‌ ముదిరాజ్‌ నియామకం కావడం ఆ పార్టీకి కొత్త ఊపునిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జిల్లాలో పార్టీ విస్తరణ కార్యకలాపాలకు కాసాని జ్ఙానేశ్వర్‌ ముదిరాజ్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. జ్ఙానేశ్వర్‌ ముదిరాజ్‌కు నిర్మల్‌కు చెందిన చాలా మంది సీనియర్‌ నాయకులతో సంబంధాలు ఉన్న కారణంగా వారందరినీ టీడీపీ వైపు దువ్వే ప్రయత్నాలు మొదలుకాబోతున్నాయంటున్నారు. కొద్దిరోజుల్లోనే హైదరాబాద్‌లో జరిగే టీడీపీ బహిరంగసభ అనంతరం జిల్లాలో టీడీపీ కార్యకలాపాలకు తిరిగి శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయంటున్నారు.

ప్రధాన పార్టీల అసంతృప్తి వాదులపై గురి

జిల్లాలోని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లోని అసంతృప్తి వాదులను, అసమ్మతి వాదులనే కాకుండా గత కొద్దిరోజుల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేతలపై టీడీపీ అధిష్టానం గురి పెట్టిందంటున్నా రు. ఇప్పటికే తనకున్న సంబంధాలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జ్ఙానేశ్వర్‌ ముదిరాజ్‌ జిల్లా రాజకీయ పరిస్థితులను సమీక్షించినట్లు సమాచారం. దీని ఆధారంగా ఆయన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీల్లోని అసంతృప్తి, అసమ్మతివాదుల జాబితాను తయారు చేశారంటున్నారు. దీంతో పాటు అప్పటి టీడీపీ హయాంలో చురుకుగా వ్యవహరించి ప్రస్తుతం తటస్థంగా ఉన్న నేతలతో కూడా సంప్రదింపులు జరిపేందుకు సన్నాహాలు మొదలయ్యాయంటున్నారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పెద్దగా ప్రభావం చూపే పరిస్థితుల్లో లేని కారణంగా కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

పాత సంబంధాలతో పావులు కదుపుతూ

బీ.సీ నాయకుడిగా అప్పట్లో కొనసాగిన కాసాని జ్ఙానేశ్వర్‌ ముదిరాజ్‌కు జిల్లాలోని చాలా మంది సీనియర్‌ నాయకులతో సత్సంబంధాలున్నాయంటున్నారు. అలాగే అప్పటి టీడీపీలో కొనసాగి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న సీనియర్‌లతోనూ కాంగ్రెస్‌ పార్టీలోని మరికొంతమంది సీనియర్‌ నాయకులతో ఆయనకు సంబంధాలున్నట్లు చెబుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన కాసాని ఆ పాత సంబంధాలను తిరిగి తెరపైకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని ఆధారంగానే ఆయన ఇప్పటికే ఈ దిశగా కార్యచరణ మొదలుపెట్టారంటున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులతో ఆయన ఫోన్‌లో సంభాషించినట్లు సమాచారం. హైదరాబాద్‌ బహిరంగసభ అనంతరం జిల్లాల వారీగా ఆయన పర్యటించనున్నట్లు చెబుతున్నారు. ఈ పర్యటన సందర్భంగా పాత, కొత్త తరం నేతలందరితో ఆయన మంతనాలు జరిపే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

పూర్వ వైభవం సాఽఽధ్యమేనా ?

ప్రస్తుతం జిల్లాలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు అప్పట్లో టీడీపీలో వెలుగు వెలిగారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారంతా టీడీపీని వీడి వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుతో రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తుండగా ఆ పార్టీలోని అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లోని కొంతమంది సీనియర్‌లను కూడా తమవైపుకు తిప్పుకోవాలని టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం అర్ధ, అంగ బలాలతో బలంగా ఉన్న ప్రధానపార్టీలకు తెలుగుదేశం పార్టీ ఏ మేరకు సమాంతరంగా ఎదుగుతుందోనన్నదే చర్చకు తావిస్తోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా రూపుదిద్దుకోవడం అంత తేలికైన వ్యవహారం కాకపోయినప్పటికీ ఆ పార్టీ తిరిగి పూర్వవైభవం సాధించేందు కోసం రాజకీయపరంగా కత్తీమీద సాము చేయాల్సిందేనంటున్నారు.

Updated Date - 2022-12-24T01:02:32+05:30 IST