Somu Veerraju: వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై చార్జ్‌షీట్‌: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2023-04-30T20:54:19+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై మే 6 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చార్జ్‌షీట్‌..

Somu Veerraju: వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై చార్జ్‌షీట్‌: సోము వీర్రాజు

మంగళగిరి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై మే 6 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చార్జ్‌షీట్‌ (Charge sheet) దాఖలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Viraraju) తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మన్‌ కీ బాత్‌ కార్యక్రమం వందవ ఎపిసోడ్‌ను ఆదివారం మంగళగిరిలో చేనేత కార్మికులతో కలిసి ఆయన వీక్షించారు. అనంతరం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వంపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని నిర్ణయించామని, దీని కోసం రెండు కమిటీలను కూడా నియమించామని చెప్పారు. ఒక కమిటీ ఆయా అంశాలను సేకరిస్తుందని, మరో కమిటీ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల శాండ్‌, ల్యాండ్‌, గ్రావెల్‌, కోల్‌ యాష్‌, చెరువులు తదితర సహజ వనరుల దోపిడీ వివరాలను చార్జ్‌షీట్‌ ద్వారా సమీకరిస్తామని వీర్రాజు తెలిపారు.

పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోదీ నిశ్శబ్ద విప్లవం తీసుకువచ్చారన్నారు. జాతీయ రహదారులు, రైల్వేస్‌, ఎయిర్‌ వేస్‌ అభివృద్ధి, ఏపీకి ఎయిమ్స్‌, 25 లక్షల ఇళ్లు, వ్యవసాయ రంగం అభివృద్ధితోపాటు ముద్ర లోన్లు, ఎల్‌ఈడీ బల్బులు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని కిందిస్థాయి ప్రజలకు అందేలా మోదీ పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. ప్రధానిగా మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మే 15 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు నెల రోజులపాటు అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. 15 రోజులపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడం.. మరో పక్షం రోజులు ప్రజాపోరు యాత్రను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ భేటీ గురించి తన వద్ద ఎటువంటి సమాచారం లేదని వీర్రాజు తెలిపారు.

Updated Date - 2023-04-30T20:54:19+05:30 IST