ఎల్‌వీఎం3-ఎం3 ప్రయోగానికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-03-24T02:49:10+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈనెల 26న ఉదయం తొమ్మిది గంటలకు ఎల్‌వీఎం మార్క్‌3-ఎం3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

ఎల్‌వీఎం3-ఎం3 ప్రయోగానికి సర్వం సిద్ధం

నేడు ఎంఆర్‌ఆర్‌ సమావేశం

రేపు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

సూళ్లూరుపేట, మార్చి 23: భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈనెల 26న ఉదయం తొమ్మిది గంటలకు ఎల్‌వీఎం మార్క్‌3-ఎం3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా వన్‌వెబ్‌ ఇండియా-2 పేరుతో 5,805 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను వాణిజ్య పరంగా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ 24 గంటల ముందు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెష్‌ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్‌) శుక్రవారం షార్‌లో జరగనుంది. తర్వాత షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమీక్షించాక ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసి ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. సాయంత్రం ప్రీ కౌంట్‌డౌన్‌ అనంతరం ప్రయోగ రిహార్సల్‌ నిర్వహిస్తారు. ఎల్‌వీఎం3-ఎం3 ద్వారా నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (వన్‌వెబ్‌ గ్రూపు కంపెనీ, ఇస్రోలో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ వారి ఆధ్వర్యంలో ఇస్రో వాణిజ్యపర ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. రాకెట్‌ భూమి నుంచి నింగిలోకి ఎగిరాక తన మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాక రాకెట్‌ శిఖర భాగాన ఉన్న 36 ఉపగ్రహాలను 19 నిమిషాల్లో భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఎర్త్‌ ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు షార్‌ నుంచి మార్క్‌3 (ఎల్‌వీఎం3-ఎం3) ఐదు ప్రయోగాలు విజయవంతంగా చేపట్టి ఉన్నారు. ఇది ఆరో ప్రయోగం కావడం విశేషం. చంద్రయాన్‌-2 వంటి కీలక ప్రయోగం కూడా ఎల్‌వీఎం-ఎం3 రాకెట్‌ ద్వారానే ప్రయోగించారు.

Updated Date - 2023-03-24T02:49:10+05:30 IST