AP News: శ్రీకాళహస్తి ఆలయంలో మంగ్లీ నృత్యం మరువక ముందే మరో ఘటన...
ABN , First Publish Date - 2023-03-28T10:48:57+05:30 IST
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అపచారాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో (Srikalahasthi Temple) అపచారాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఆలయంలో సింగర్ మంగ్లీ (Singer Mangli) ఓ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అది మరవక ముందే మరో చిత్రీకరణ జరగడం వివాదానికి దారి తీసింది. ఆలయంలో వీడియోల చిత్రీకరణ నిషేధం అమలులో ఉన్నప్పటికీ చిత్రీకరణ కొనసాగింది. ఆలయ వీడియోల పరంపర సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా ప్రత్యక్షమవుతున్నాయి. గర్భాలయ గోడలపై శాసనాలు సహా రాహు - కేతు పూజా మండపాన్ని చిత్రీకరించారు. ఈ వీడియో ఓ యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం అవడంతో శ్రీకాళహస్తి దేవాలయం మరోసారి వార్తల్లో నిలిచింది.
కాగా... శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయంలో మంగ్లీ పాట పాడుతూ నృత్యం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆలయంలో వీడియో చిత్రీకరణ నిషేధం అమలులో ఉన్నా పాట చిత్రీకరించడంపై వివాదం చెలరేగింది. దీనిపై భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో వీడియో చిత్రీకరణ నిషేధం అమలులో ఉంది. ఈ క్రమంలో ఆలయంలో మంగ్లీ వీడియోను చిత్రీకరించడం వివాదంగా మారింది. అయితే ఇప్పుడు తాజాగా ఆడియో వీడియోల చిత్రీకరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.