Chandrababu Tour: శ్రీకాళహస్తిలోనూ హైటెన్షన్.. చంద్రబాబు పర్యటన ఎలా ఉంటుందో..!?

ABN , First Publish Date - 2023-08-05T10:16:43+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను వైసీపీ రణరంగంగా మార్చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి పేరుతో విస్తృత పర్యటన సాగిస్తున్నారు. అయితే.. చిత్తూరు జిల్లా పర్యటనలో అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయి.. రణరంగంగా మార్చారు!. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి, టీడీపీ వాహనాలను ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Chandrababu Tour: శ్రీకాళహస్తిలోనూ హైటెన్షన్.. చంద్రబాబు పర్యటన ఎలా ఉంటుందో..!?

తిరుపతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Naidu) చిత్తూరు జిల్లా పర్యటనను వైసీపీ (YCP) రణరంగంగా మార్చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి పేరుతో విస్తృత పర్యటన సాగిస్తున్నారు. అయితే.. చిత్తూరు జిల్లా పర్యటనలో అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయి.. రణరంగంగా మార్చారు!. చంద్రబాబు (TDP Chief)కాన్వాయ్‌పై రాళ్ల దాడి, టీడీపీ వాహనాలను ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంగళ్లులో దాడులు, ఆ తర్వాత పుంగనూరులో అడ్డగింతలు, లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగంతో రగిలిన టీడీపీ కార్యకర్తల్లో కొందరు దాడులకు దిగాల్సి వచ్చింది. పోలీసు వాహనాలనూ ధ్వంసం చేశారు. రాళ్లు తగలడంతో పలువురు పోలీసులూ గాయపడ్డారు. దీంతో చిత్తూరులో పరిస్థితి దారుణంగామారింది.


హైటెన్షన్..!

ఇదిలా ఉండగా.. నిన్నటి వైసీపీ దాడులతో చిత్తూరులో వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. ఈరోజు (శనివారం) శ్రీకాళహస్తిలో చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో టెన్షన్ మరింత పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టీడీపీ ఫ్లెక్సీలపై మున్సిపల్ సిబ్బంది చర్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని టీడీపీ నేతలు శ్రీకాళహస్తిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు పర్యటన ఉండగా ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు తొలగించవద్దని వారిని అడ్డుకొని వాగ్వివాదానికి దిగారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆదేశాలతోనే తాము ఈ ఫ్లెక్సీల తొలగింపునకు వచ్చామని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి తీసుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం ఏంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు ముందే శ్రీకాళహస్తిలో పరిస్థితి ఇలా ఉంటే.. చంద్రబాబు వచ్చాక ఇంకెలా ఉండబోతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


గవర్నర్‌కు ఫిర్యాదు..

మరోవైపు చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్‌ను టీడీపీ బృందం కలవనుంది. చంద్రబాబు పర్యటనలో ఆయన కాన్వాయ్‌పై వైసీపీ నేతల దాడిపై గవర్నర్‌కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. నిన్న (శుక్రవారం) చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి, టీడీపీ కార్యకర్తలకు గాయాలు వంటి అంశాలను గవర్నర్‌కు టీడీపీ నేతలు వివరించారు. టీడీఎల్‌పీ TDLP ఉపనేత నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, బోండా ఉమ తదితరులు గవర్నర్‌ను కలువనున్నారు.


నెల్లూరులో కూడా..

కాగా.. చిత్తూరులో పర్యటన ముగిసిన అనంతరం ఈరోజు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట, గూడూరు మీదుగా ఈరోజు సాయంత్రం నెల్లూరుకు బాబు చేరుకోనున్నారు. నగరంలోని కస్తూర్భా గార్డెన్స్‌లో యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించనున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రముఖులు, రైతులతో చంద్రబాబు సమావేశంకానున్నారు. కస్తూర్బా గార్డెన్స్‌లోనే రాత్రి బస చేసి... రేపు (ఆదివారం) రోడ్డు మార్గాన ప్రకాశం జిల్లాకు చంద్రబాబు వెళ్లనున్నారు.

Updated Date - 2023-08-05T10:18:35+05:30 IST