TTD: 28న ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

ABN , First Publish Date - 2023-01-19T20:02:36+05:30 IST

ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి ఈనెల 28వ తేదీన తిరుమల (Tirumala)లో వైభవంగా జరుగనుంది.

TTD: 28న ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

తిరుమల: ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి ఈనెల 28వ తేదీన తిరుమల (Tirumala)లో వైభవంగా జరుగనుంది. ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు మలయప్పస్వామి వివిధ వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 2020లో రథసప్తమి అనంతరం కొవిడ్‌ తీవ్రంగా వ్యాప్తించిన నేపథ్యంలో ఏడాది పాటు అన్ని ఊరేగింపులను టీటీడీ (TTD) రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా కేసులు కొంతమేర తగ్గిన నేపథ్యంలో కొవిడ్‌ (Covid) నిబంధనలు పాటిస్తూ 2021 ఫిబ్రవరి19న రథసప్తమి సందర్భంగా నాలుగు మాడవీధుల్లో వాహనసేవల ఊరే గింపును నిర్వహించారు. చక్రస్నానాన్ని మాత్రం ఏకాంతంగా నిర్వహించారు.2022 ఫిబ్రవరి నెలలో కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో 8వ తేదీన రథసప్తమి వాహనసేవలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గిన క్రమంలో ఈనెల 28వ తేదీన నాలుగు మాడవీధుల్లో సూర్యజయంతి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. తెల్లవారుజామున 5.30 నుంచి ఉదయం 8 గంటల నడుమ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగనున్నారు. మొత్తం ఏడు వాహనాలపై గోవిందుడు కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సుప్రభాత, తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా జరగనున్నాయి. వాహనసేవలు వీక్షించేందుకు వచ్చే భక్తులకు గ్యాలరీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వాహనసేవల వివరాలు..

ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు: సూర్యప్రభవాహనం(సూర్యోదయం 6.45గంటలు)

9 నుంచి 10 వరకు: చిన్నశేష వాహనం

11 నుంచి 12 వరకు: గరుడ వాహనం

మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు: హనుమంత వాహనం

2 నుంచి 3 వరకు: చక్రస్నానం

4 నుంచి 5 వరకు: కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు: సర్వభూపాల వాహనం

8 నుంచి 9 వరకు: చంద్రప్రభ వాహనం

Updated Date - 2023-01-19T20:02:38+05:30 IST