AP News: ఏపీలో కూడా దంచికొడుతున్న వానలు.. గోదావరి, మున్నేరులో వరద ఉధృతి
ABN , First Publish Date - 2023-07-27T13:20:04+05:30 IST
గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అధికారులను ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ అప్రమత్తం చేస్తోంది. సహాయ చర్యల్లో మూడు ఎన్డీఆర్‌ఎఫ్, నాలుగు ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచారు.
రాజమండ్రి: గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అధికారులను ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ అప్రమత్తం చేస్తోంది. సహాయ చర్యల్లో మూడు ఎన్డీఆర్‌ఎఫ్, నాలుగు ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచారు. అత్యవసర సహాయం కోసం 24 గంటలు స్టేట్ కంట్రోల్ రూమ్‌లో నెంబర్లు అందుబాటులో ఉంచారు. గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది.
ఇక తుంగభద్ర జలాశయం అప్పుడే సగం నిండింది. జలాశయంలోనికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో లక్ష 11 వేల 307 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 1615.22 అడుగులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 50 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇక ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తోంది. లక్ష పాతిక వేల క్యూసెక్కులకుపైగా వరద నీరు ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. పెనుగంచిప్రోలు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. చిల్లకల్లు-వైరా రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వత్సవాయి మండలం లింగాల కాజ్ వేపై మున్నేరు పొంగిపొర్లుతుంది. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట దగ్గర వరద నీరు 16 అడుగులకు చేరింది. మున్నేరు పరివాహ ప్రాంతాల్లో అధికారులను జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అప్రమత్తం చేశారు. మరో రెండు రోజులపాటు ఇదే ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.