Kodikathi Case: కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా
ABN , First Publish Date - 2023-05-11T12:43:28+05:30 IST
కోడికత్తి కేసు విచారణ జూన్ 15కు వాయిదా పడింది. గురువారం ఎన్‌ఐఏ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా ఎన్‌ఐఏ తరపున లాయర్ హాజరుకాకపోవడంతో పాటు వేసవి సెలవుల కారణంగా కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
అమరావతి: కోడికత్తి కేసు విచారణ జూన్ 15కు వాయిదా పడింది. గురువారం ఎన్‌ఐఏ కోర్టులో (NIA Court) ఈ కేసు విచారణకు రాగా ఎన్‌ఐఏ తరపున లాయర్ హాజరుకాకపోవడంతో పాటు వేసవి సెలవుల కారణంగా కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. కాగా.. ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ప్రమోషన్‌పై కడపకు బదిలీ అయిన నేపథ్యంలో నూతనంగా వచ్చిన న్యాయమూర్తి ముందు మొదటి నుంచి పిటిషన్‌లపై వాదనలు జరగాల్సి ఉంది. అయితే ఈరోజు ఎన్‌ఐఏ తరపు న్యాయవాదలు ఎవరూ హాజరుకాకపోవడం, అలాగే వేసవి సెలవుల కారణంగా కేసు విచారణను కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. కేసు విచారణ నిమిత్తం నిందితుడు జనిపల్లి శ్రీను అలియాస్ కొడికత్తి శ్రీనును రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడకు తీసుకువచ్చారు. కోడికత్తి శీను లాయర్ అబ్దుల్ సలీం కూడా కోర్టుకు వచ్చారు. అయితే విచారణను కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో నిందితుడిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
కాగా.. నూతన న్యాయమూర్తి ఎదుట ముఖ్యమంత్రి వేసిన రెండు పిటిషన్‌లపై సీఎం జగన్ తరపు న్యాయవాది మరలా తమ వాదనను వినిపించాల్సి ఉంది. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలోనే సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనపై నిందితుడు కోడి కత్తి శీను తరపు న్యాయవాది అబ్దుస్ సలీం గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో కుట్ర కోణంలో విచారణ జరగలేదంటూ ఐదు ఏళ్ల తర్వాత సీఎం జగన్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపే విధంగా ఎన్‌ఐఏను ఆదేశించాలంటూ ఆ పిటీషన్‌లో అభ్యర్థించారు. నిందితుడు, ఎన్‌ఐఏ తరపు వేసిన కౌంటర్లపైన నేడు వాదనలు జరగాల్సి ఉండగా... ఎన్‌ఐఏ తరపు న్యాయవాది హాజరుకానందున న్యాయమూర్తి కేసు విచారణను జూన్ 15కు వాయిదా వేశారు.